pizza
TANTEX - 119th Nela Nela Telugu Vennela - Sahitya Vedika
సినారేకి సాహిత్య నివాళులు
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 119 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

26 June 2017
డాలస్ టెక్సస్.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం జూన్ 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 119 నెలలుపాటున ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ యొక్క విశేషం. సినీ వినీలాకాశంలో ఒక ధృవతారగా నిలిచిన ప్రపంచ ప్రఖ్యాత కవి రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారికి టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక సభ్యులు, డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహిత్య ప్రియులు, అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో పాల్గొని పుష్ప నివాళులు సమర్పించారు. డా. సి.నారాయణ రెడ్డి గారిని స్మరించుకోవటం కార్యక్రమంలో ప్రత్యేక అంశం గా నిలిచింది.

తర్వాత శ్రీమతి స్వాతి బృందం పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య రచించిన ‘చక్కని తల్లికి చాంగు భళా’, ‘నారాయణతే నమో నమో’ వంటి కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అటుతర్వాత డా. సి. నారాయణ రెడ్డి గారు రచించిన ‘కర్పూర వసంతరాయలు’ గ్రంధాన్ని విశ్లేషిస్తూ శ్రీ రమణ జువ్వాడి ప్రసంగించారు. ఆనాటి రాజైన కుమార వీరా రెడ్డి రాజనర్తకి ‘లకుమా దేవి’ని చూసి సమ్మోహితుడై ఆమె పై కవితలల్లిన తీరును చాల చక్కగా వివరించారు. అంతేకాక ‘కర్పూర వసంత రాయలు’ గ్రంధంలో సినారే కేవలం సాహిత్యమే కాక వారి నాట్య శాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా చాలా చక్కగా వివరించారు.

అటుతర్వాత శ్రీ పూదూరు జగదీస్వరన్ ‘యవ్వని పద్యాలు ముత్యాలు రాలంగ...’ అనీ ‘సినారే భళి భళారే విశ్వంబర కీర్తితో’ అనీ తమ స్వీయ రచనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇంతేకాక వారి మిత్రులు శ్రీ నక్తా రాజు రచించిన ‘ఆయిత బాహువుల్ సహజమైనటువంటి మంద హాసముల్...’ అనే గద్య పద్యాన్ని ఫాడి వినిపించారు. దాన వీర శూర కర్ణ చలన చిత్రం లో సినారే వ్రాసిన ధుర్యోధనుని సంభాషణలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో తమ స్వీయ రచనలతో శ్రీ టి.వరదయ్య ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

డా.ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి సినారే కవితా సంపుటి 'నా రణం మరణం పైనే' మొదటి ప్రతిని సినారే చేతులుమీదుగా అందుకున్న అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకోవటమే కాక, 'పంచకట్టులోన ప్రపంచాన్న మొనగాడు...ఎవరయ్య ఇంకెవరు మన తెలుగువాడు' వంటి పద్యాలను, సినారే రచించిన ఎన్నో పాటలను స్వయంగా పాడి వినిపించారు. శ్రీ చంద్రహాస్ మద్దుకూరి, ‘పాటలో ఏముంది నా మాటలో ఏముంది’ అనే సినారే వ్రాసిన పుస్తకాన్ని పరిచయం చేసి ‘పాటో బయోగ్రఫి’ అనే పదాన్ని చక్కగా విశ్లేషించారు.

శ్రీమతి కిరణ్మయి వేముల వటపత్ర సాయికి, శ్రీ లెనిన్ వేముల వందేమాతరం, చిత్రం భళారే విచిత్రం, డా. ఉమాదేవి బళ్ళూరి ‘చదువురాని వాడవని, వగలరాణివి నీవే, చెలికాడు నిన్నే’ వంటి సినారే వ్రాసిన చలన చిత్ర గీతాలను కలిపి వ్రాసిన స్వీయ కవిత ఆలపించి కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు.

ఇక కార్యక్రమంలో అన్నిటికన్న ముఖ్య ఘట్టానికొస్తే శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ 119 వ సాహిత్య సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ‘ఆధునిక తెలుగు కవిత్వంలో లఘు కవితా ప్రక్రియలు’ అనే అంశం విశ్లేషిస్తూ ప్రసంగించారు. వీరు వృత్తి రీత్యా ఉపాధ్యాయులు అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా సమాజ సేవకుడిగా, పర్యావరణవేత్తగా, సంపాదకులుగా ‘శరత్ సాహితీ కళా స్రవంతి’ ,‘తెలంగాణ సాహిత్య వేదిక’ స్థాపకులుగా ప్రఖ్యాతి చెందారు. ‘ఏది చెప్పినా బతుకు సత్యాలనే చెప్పాలి’ అని నమ్మే వీరి రచనలు కథా సంపుటి, కవితా సంపుటిగా సబ్బని పబ్లికేషన్స్ ద్వారా ముద్రితమయ్యాయి. అంతేకాక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, శేషేంద్ర స్మారక పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు వీరి సొంతమయ్యాయి. వీరి భాషా ప్రావీణ్యం, తెలుగు భాషకి గణిత శాస్త్రానికి గల సంబంధాలను, ఒక కవిత ఎలా ఉండాలి, ఎన్ని అక్షరాలు కలిగి ఉండాలి అలాగే హైకులు, నానోలు, వంటి వాటిలోని లక్షణాలను చాలా చక్కగా వివరించారు. కొత్తగా కవితలు రాయాలనుకునేవారికి కూడా ఇది ఒక చక్కటి శిక్షణ గా అనిపించటం ఒక విశేషం. వారి అమోఘమైన పాండిత్య ప్రతిభకు ప్రేక్షకులు మంత్రముగ్ధులు అయ్యారు.

ముఖ్య అతిథి ప్రసంగానంతరం ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ.కృష్ణారెడ్డి ఉప్పలపాటి, కార్యవర్గ సభ్యులు తదితరులు ముఖ్య అతిథి శ్రీ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన ‘అక్షరాణువులు‘ పుస్తక ఆవిష్కరణ తరువాత వారిని దుశ్శలువాతో సన్మానించి ఙ్ఞాపికను బహుకరించారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved