To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
1 November 2017
Hyderabad
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం, అక్టోబర్ 22న సాహిత్య వేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 123 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, జయప్రదం చేసారు.
కార్యక్రమంలో లాస్య సుధ డాన్స్ అకాడమీ డా. కలవగుంట సుధ శిష్యులు ప్రార్థనా గీతం ఆలపించారు. డా. బల్లూరి ఉమాదేవి గారు 123వ సాహిత్య సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసి ‘మహిళ నాడు - నేడు , వేమన దృష్టిలో మహిళ’ అనే అంశము పై ప్రసంగిస్తూ, గృహనిర్వహణలోను దేశప్రగతిలోను మహిళలకు అగ్రస్థానం ఇవ్వబడింది.వేదకాలంలోని గార్గి మొదలుకొని నేటి కాలం దాక మహిళ సాధించిన విజయాలను వివరించారు. అందుకే మాతృదేవోభవ అంటూ తల్లికి మొదటిస్థానమిచ్చారు. రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీ, ఇందిరాగాంధీ, విక్టోరియా రాణి, మార్గరేట్ థాచర్ ఇలా ఎందరో మహిళలు సాధించిన ప్రగతిని వివరించారు. వంటింటి కుందేలుగా వున్న మహిళ నేడు అన్ని రంగాలలో ప్రావీణ్యత నందుకొన్న తీరు వివరించారు. వేమన మహిళలకిచ్చిన గౌరవాదరాలను విశదీకరించడంతో బాటు స్వయంగా మహళలను గూర్చి వ్రాసిన పద్యాలను కవితలను చదివి వినిపించారు.
మాసానికో మహనీయుడు ('మామ') అనే శీర్షికలో భాగంగా తోటకూర పల్లవి "కవి సమ్రాట్" బిరుదాంకితుడు. తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత 20వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు అయిన విశ్వనాథ సత్యనారాయణ గురించి ఆహూతులకు తెలియజేశారు. సంస్థ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి తెలుగు సిరిసంపదలు అయినటువంటి జాతీయాలు,నుడికారాలు, పొడుపుకథలు గుర్తుచేస్తూ కార్యక్రమంలో ప్రేక్షకులను కూడా పాల్గొనేట్టు చేసి ఎంతో ఆసక్తి కరంగా కార్యక్రమాన్ని ముందుకు నడిపారు.
జువ్వాడి రమణ రామరాజభూషణుడు రచించిన వసుచరిత్ర లోని పద్యాలను వినిపించారు. తదనంతరం యీరం ఖాన్ ‘మురిపాల ముకుందా సరదాల సనంద' అనే పాట పై చక్కటి నృత్యం చేసి ప్రేక్షకుల ప్రశంసలను పొందారు. ముక్కు తిమ్మన పారిజాతాపహరణములో సత్యభామ తన కోపాన్ని ఏ విధంగా చూపించిందో అనిన ఘట్టాన్ని ఉదాహరణగా తీసుకుని స్త్రీల బలానికి కోపము ప్రధాన మని "మాసిన చీర గట్టుకొని మౌనము తోడ నిరస్త భూషయై------"అన్న పద్యాన్ని తదితర సంబంధమైన పద్యాలను ఆచార్య పుదూర్ జగదీశ్వరన్ శ్రోతలకు వినిపించారు. డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి ‘అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం’ లాంటి మధురమైన సినిమా గీతాలను తమ అధ్భుత గాత్రంతో ఆలపించి సభను అలరించారు. మద్దుకూరి చంద్రహాస్ అందమె ఆనందం, మనసున మనసై పాటల సాహిత్యం, పోతన, కొడాలి సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావుల పద్యాలు కొన్ని చక్కగా విశ్లేషించారు.
ముఖ్య అతిథి డా. బల్లూరి ఉమాదేవి గారిని ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, పాలక మండలి సభ్యులు కన్నెగంటి చంద్రశేఖర్ దుశ్శలువాతో మరియు కార్యక్రమ సమన్వయకర్త సింగిరెడ్డి శారద మరియు సాహిత్య వేదిక బృంద సభ్యులు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు వీర్నపు చినసత్యం, సాహిత్య వేదిక బృంద సభ్యులు డా. కలవగుంట సుధ, జయ తెలకపల్లి, శశి రెడ్డి కర్రి, పల్లవి తోటకూర తదితరులు పాల్గొన్నారు.
సమన్వయకర్త సింగిరెడ్డి శారద సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 9, టీవీ 5, టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.