
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 February 2017
USA
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం ఫిబ్రవరి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 115 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు.
సింగిరెడ్డి శారద సభను ప్రారంభిస్తూ 115వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం పలికారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన భక్తి గీతాలను శ్రీ ప్రభల శ్రీని, శ్రీమతి దీపిక, శ్రీమతి ప్రభల ఉమ, చిరంజీవులు ప్రభల అంజలి, చాగంటి శ్రీక , ఎడవల్లి శ్రేయ , మద్దుకూరి మహిత , మద్దుకూరి అభినుతి, అనసారపు శ్రేయాస్ ,రాయవరం స్నేహిత్ మరియు ప్రభల ఆరతి చక్కగా ఆలపించారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన కొన్ని సినీగీతాలను శ్రీ వడ్లమన్నాటి నాగి, శ్రీమతి శ్రీలక్ష్మి, శ్రీ శ్రీనివాస్ ఇయ్యుణ్ణి గానం చేసారు. తెలుగు భాషాభిమాని, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం 112 వ సాహిత్య సదస్సుకు ముఖ్య అతిథి, సాహిత్య విశ్లేషకుడు శ్రీ వేముల లెనిన్ బాబు "ఆంధ్ర మహాభారతం అవతారికలోని విశేషాలను గురించి ప్రసంగించారు. డాలస్ కి చెందిన సాహిత్యాభిమాని శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్ గారు "ఆంధ్రనగరి" పుస్తక పరిచయం చేసారు. శ్రీ తోకల గోపి జంధ్యాల మాటలతో కడుపుబ్బ నవ్వించారు. శ్రీ జువ్వాడి రమణ తెలుగు సాహిత్యం లో ముస్లిం రచయితలు అనే అంశంపై ప్రసంగించారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన "కొలువైతివా రంగసాయి" గేయానికి గురుపరంపర స్కూల్ అఫ్ ఆర్ట్స్ నుండి శ్రీమతి హేమమాలిని చావలి శిష్యురాలు చిరంజీవి సనంపూడి కౌముది నాట్యం చేసి అందరినీ అలరించింది. కూచిపూడి కళాక్షేత్ర శ్రీమతి పద్మ సొంటి శిష్యులు "భో శంభో" పాటకి చిరంజీవులు విళ్ళా అమూల్య, కటసాని గీతిక నాట్యం చేసారు.
ప్రతి ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి 5 గంటల వరకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సమర్పించే టాంటెక్స్ తరంగిణి కార్యక్రమం తెలుగు వన్ రేడియో ద్వారా 115వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుని దేశీ ప్లాజా స్టూడియో నుండి RJ శ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసారు.
115వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వకళాభారతి డా.రత్న కుమార్ గారు భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి సాహిత్యం - అనుభూతులు అంశం మీద ప్రసంగించారు. తాతగారితో తనకున్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ సాహితీ జ్ఞాపకాలను సభతో పంచుకున్నారు. పలు ప్రముఖ గేయాలకు శ్రీమతి వింజమూరి అనసూయగారిచే స్వర పరుచుకోవడం తనకు బాగా గుర్తు అని చెప్పుకొచ్చారు. కృష్ణశాస్త్రి గారు రాసిన "జయ జయ ప్రియ భారత" గేయం భారతదేశ జాతీయగీతం అయితే ఎంతో బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి పలువురి ప్రశ్నలకు డా.రత్న కుమార్ గారు ఓపికగా సమాధానాలిచ్చారు.
2017 సాహిత్యవేదిక సభ్యులు మరియు సమన్వయకర్త సింగిరెడ్డి శారద ముఖ్య అతిథిని జ్ఞాపిక మరియు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, తక్షణ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సమ్యుక్త కార్యదర్శి కోడూరు కృష్ణారెడ్డి, సమ్యుక్త కోశాధికారి మండిగ శ్రీలక్ష్మి, పాలక మండలి అధిపతి రొడ్డా రామక్రిష్ణా రెడ్డి, పాలక మండలి సభ్యులు రుమాళ్ల శ్యామల, కన్నెగంటి ఛంద్ర శేఖర్, కార్యవర్గ సభ్యులు పార్నపల్లి ఉమా మహేశ్వర్, కొణిదల లోకేష్ నాయుడు, పాలేటి ళక్ష్మి, తోపుదుర్తి ప్రబంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమన్వయకర్త సింగిరెడ్డి శారద సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమనులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ 5, టోరి , టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.



