To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 May 2015
Hyderabad
కనుమరుగవుతున్న వాత్సల్య రసాస్వాదన – టాంటెక్స్ సాహిత్యవేదికపై డా. పుట్టపర్తి ప్రసంగం
డాల్లస్/ఫోర్టువర్త్,టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 94 వ కార్యక్రమం ఈ నెల ఆదివారం మే 17, దేశిప్లాజా స్టూడియో, డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ గారి అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. "కనుమరుగవుతున్న వాత్సల్య రసాస్వాదన" ఇతివృత్తంగా డా. పుట్టపర్తి నాగపద్మిని గారు చేసిన ప్రసంగం మనసు మడతల్లో ఎక్కడో దాగిన మమకారపు మల్లెలను చిగురించేలా చేసింది. ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన అంశంతో ప్రారంభమైనది. అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు పాశ్చాత్య పద్ధతిలో వాయిద్య సంగీతం నేర్చుకుంటారు కాబట్టి, వారి ధోరణిలోనే, వారి నోట్స్ తోనే మన శాస్త్రీయ వాయిద్య పరికారాలు పలికిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో డా. కలవగుంట సుధ గారి ఆధ్వర్యంలో ప్రార్ధనా గీతాన్ని చిన్నారులు మాతంగి సాయి కౌశిక, కలవగుంట నర్తన, కస్తూరి ప్రణవ్, ప్రభల ఆరతి, కలవగుంట కీర్తన, మరియు వడ్డూరి సిద్ధార్ధ మోహన రాగం రూపక తాళంలో ఎంతో చక్కగా ప్రదర్శించారు. చి॥ చెరుకూరి బృహతి "భగవంతుని కీర్తన - కవిభావం" అనే అంశం మీద త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు అంతరంగ ఆవిష్కరణ చక్కగా చేసింది. చి॥కొణిదెన సాత్విక్, శ్రీ శ్రీ గారి గురించి తెలుగులో అనర్గళంగా మాట్లాడి, ఆయన మహాప్రస్థానం నుండి కొన్ని కవితలు చాలా బాగా చదివి వినిపించారు. “మాసానికో మహనీయుడు” అంశంలో వరిగొండ శ్యాం, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మాట్లాడుతూ ఆయన మన జాతీయ గీతం "జనగణమణ" మాత్రమే కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల జాతీయగీతాలను కూడా రచించారని, ఆసియా ఖండంలో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి అని ప్రస్తుతించారు. చి॥ కర్రి యశస్వ్ “జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి” రమ్యంగా ఆలపించి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని గుర్తు చేసారు. శ్రీమతి అట్లూరి స్వర్ణ గారి "సరదాగా కాసేపు" క్విజ్ ఆద్యంతం నవ్వులు పూయించింది. బాదరాయణ సంభంధం అంటే ఏదో ఒక వంకతో చుట్టరికం కలుపుకోవడం అని, దారిన పోతున్న ఒక వ్యక్తి నా బండి చక్రం బదరీ (రేగు) తో చేసింది, మీ ఇంట్లో కూడా రేగు చెట్టు ఉంది అని సంబంధం కలుపుకొని చక్కగా భోజనం చేసి వెళ్ళాడని హాస్యపూరకంగా వర్ణించారు. డా. MDN రావు గారు స్వీయ కవిత చదివి వినిపించగా, శ్రీమతి మల్లాది పద్మజ చక్కని కథానిక తో అలరించారు.
ముఖ్య అతిధి డా. పుట్టపర్తి నాగపద్మిని గారు తొలుత తమ తండ్రిగారు 'సరస్వతీపుత్ర‘ స్వర్గీయ పుట్టపర్తి నారాయణచార్యులు గారు రచించిన "శివతాండవం" కావ్యం నుండి చక్కని పద్యాలను వినిపించారు. ప్రధాన ప్రసంగం చేస్తూ, కాలం ఇట్టే గడచి పోతుంది, పిల్లలు లేత పెదవులతో వచ్చీ రాని మాటలతో మాట్లాడే ముద్దు ముద్దు మాటలు తనివితీరా ఆస్వాదించాలి, కాలం వెనక్కు రాదు, ఆ వాత్సల్యం-ప్రేమలో తడుస్తూ, ఈ అపురూపమైన మానవ జన్మను చరితార్ధం చేసుకోవాలి అని చెప్పారు. కృష్ణ పరమాత్మను ఆవిష్కరించే పాటల్లో వాత్సల్యం పొంగిపొరలుతుంది, త్యాగరాజు అన్నమయ్య పాటలలో విశిష్ఠత ఎంతో చక్కగా వివరించారు. శాతవాహన చక్రవర్తి హాలుడు రచించిన “గాథా సప్తశతి” నుండి కొన్ని ఘట్టాలు వివరిస్తూ ఒకసారి వచ్చిన వరదలకు చెట్లు గూళ్ళు కొట్టుకు పోతున్నా, అప్పుడు ఒక కాకి ఆ వరదకు ఎదురు ఈదుతూ తన పిల్లలను రక్షించే విధానం, కడు రమ్యంగా వివరించారు. 15 వ శతాబ్దానికి చెందిన అంధుడైన సూరదాసు అనన్య సామాన్య రీతిలో కృష్ణ లీలలు వర్ణించిన విధానం, కృష్ణునిలో రాముని దర్శించిన విధానం, ఆకట్టుకొనేలా వివరించారు. మన జానపదులు గొప్ప సంప్రదాయం అని, తెలుగు సాహిత్యంలో రకరకాలైన పాటలు ఉన్నాయని, ప్రజలకు అత్యంత సులభంగా చేరువయ్యేవి జానపదాలు అని కొనియాడారు. ఋగ్వేదం ఉన్న ధ్వని, లయ, శృతి లాలిపాటలలో ఉన్నాయని ప్రస్తుతించారు. లాలిపాటలలో జీవస్వరాలు ఉన్నాయని, వాటిని పదే పదే పలకడం వలన జీర్ణ శక్తి పెరుగుతుంది వివరించారు.
ఈకార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలా కొత్తవారు కూడా సాహిత్య అభిలాషతో ఈ కార్యక్రమానికి రావడం, ముఖ్యంగా బాలబాలికలు ఉత్సాహంతో పాల్గొనడం ఎంతో అభినందనీయం అన్నారు. పిల్లలను ప్రొత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు చెప్పారు. డాల్లస్ సంగీత, సాహిత్య, సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అని, సంస్థ ఎఫ్ఫుడూ తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ప్రతి సంవత్సరం జరుపుకునే "తెలుగు సాహిత్య వేదిక వార్షికోత్సవం" జులై 12 న అని, నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు "100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 14 న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలు పెట్టారని, అందరూ విచ్చేసి, పాల్గోని, జయప్రదం చేయమని కోరారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం ముఖ్య అతిధి డా. పుట్టపర్తి నాగపద్మిని గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, కాకర్ల విజయమోహన్, వీర్నపు చినసత్యం, శీలం కృష్ణవేణి, సింగిరెడ్డి శారద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.