To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
27 June 2015
Hyderabad
డాల్లస్/ఫోర్టువర్త్,టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” 95 వ కార్యక్రమం ఈ నెల ఆదివారం జూన్ 21, దేశిప్లాజా స్టూడియో, డాలస్ లో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. "సామాన్య మానవుడి జీవితంలో నవ రసాలు" ఇతివృత్తంగా శ్రీమతి కల్వకోట ఉమాదేవి గారు చేసిన ప్రసంగం నవరసభరితంగా సాగింది. ఈ కార్యక్రమం చిన్నారులు బుయ్యనప్రగడ తన్మయి, బుయ్యనప్రగడ తేజోమయి, గణేశన్ శుభశ్రీ మరియు గణేశన్ జయశ్రీ వీనుల విందుగా పాడిన ప్రార్ధనా గీతంతో ప్రారంభమైంది. శ్రీ నిమ్మగడ్డ రామకృష్ణ ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన స్వీయ కవితను చదివి వినిపించారు. “మాసానికో మహనీయుడు” అంశంలో శ్రీ వరిగొండ శ్యాం, తెలుగు రచయితలు శ్రీ దాశరధి రంగాచార్య, శ్రీ శివరాజు వెంకట సుబ్బారావు (బుచ్చిబాబు), శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గురించి మాట్లాడారు. శ్రీ దాశరధి రంగాచార్య గారి “చిల్లర దేవుళ్ళు” రచనకు కేంద్ర సాహితి అవార్డు లభించిందని, ఆయన నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించిన గొప్ప వ్యక్తిగా ప్రస్తుతించారు. శ్రీ దొడ్ల రమణ పోతన భాగవతంలోని పద్యాలను కడు రమ్యంగా చదివి, అహూతుల మన్ననలు అందుకున్నారు. డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ ‘ఫాదర్స్ డే’ సందర్భంగా మానవుని జీవితంలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని స్వీయ కవిత ద్వారా సరళంగా విశదీకరించారు. శ్రీ పెద్ది సాంబశివరావు మాట్లాడుతూ తను శంకర్ నారాయణ నిఘంటువు నవీకరించానని, తెలుగు నుంచి ఆంగ్లం నిఘంటువును, తెలుగు రచనల ఇండెక్స్ ను తయారు చేస్తున్న విధానాన్ని ఆసక్తికరంగా వివరించారు. శ్రీ మాడ దయాకర్ వినూత్నంగా “మీసం రోషం” అంశంపై కవులు భావోద్వేగాలను ఏ విధంగా వర్ణించారో చక్కగా వివరిచారు. శ్రీమతి అట్లూరి స్వర్ణ "సరదాగా కాసేపు" క్విజ్ ఆద్యంతం నవ్వుల పూవులు పూయించింది.
ముఖ్య అతిధి శ్రీమతి కల్వకోట ఉమాదేవి కరుణ రసంతో ప్రసంగం మొదలుపెట్టి చివరి హాస్య రసం దాక అన్ని నవరసాలను తమదైన శైలిలో ఆసక్తికరంగా వివరించారు. మనిషికి మాత్రమే భగవంతుడు నవరసాలు అనుభవించే అవకాశం ప్రసాదించాడు అని, ధైనందిన జీవితంలో రసానుభూతి జరుగుతుందని వివరించారు. భరతముని నాట్యానికి సంబంధించి తెలిపినవి ఎనిమిది రసాలేనని, అందులో శాంత రసం లేదని తెలిపారు. తరువాతి కాలంలో శాంత రసం తొమ్మిదవ రసంగా చేర్చబడిందని వివరించారు. ప్రతి రసానికి ఒక భావము ఉంటుందని, కరుణ రసం శోక భావం నుంచి ఉత్పన్నమవుతుందని వివరించారు. రామాయణంలోని కరుణ రసాన్ని వివరిస్తూ సీతాదేవిని అడవిలో విడచినప్పుడు ఆమెకు కోపం రాలేదని కేవలం శోకం మాత్రమే వచ్చిందని చెప్పారు. ఆవు పులి కధలోని కరణ రసాన్ని వివరించిన తీరు సభలోని అందరిని ఆకట్టుకొన్నది. రతి భావం నుంచి శృంగార రసం, ఓర్పు భావం నుంచి శాంత రసం, కోపం నుంచి రౌద్ర రసం, అసహ్యం నుంచి భీభత్స రసం, భయం నుంచి భయానక రసం, ఆశ్చర్యం నుంచి అద్భుత రసం, నవ్వు నుంచి హాస్య రసం ఉత్పన్నమవుతాయని వివరించారు.
ఈకార్యక్రమం దేశీ ప్లాజా టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కావడంతో అమెరికా నలుమూలల నుండి ఎంతో మంది వీక్షించారు. అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ శ్రీమతి ఉమాదేవి గారు నవరసాలను విపులంగా విశ్లేషించి చాలా విషయాలను తెలియజేశారని ప్రస్తుతించారు. ప్రతి సంవత్సరం జరుపుకునే "తెలుగు సాహిత్య వేదిక వార్షికోత్సవం" జులై 12 న అని, నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు "100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 14 న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలు పెట్టారని, టాంటెక్స్ వేదికపై ఈ-టివి వారి ప్రతిస్ఠాత్మకమైన “స్వరాభిషేకం” కార్యక్రమం ఆగష్టు 29వ తేదీ ‘అలెన్ ఇవంట్స్ సెంటర్” లొ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుచున్నవని, అందరూ విచ్చేసి, పాల్గోని, జయప్రదం చేయమని కోరారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం శీలం కృష్ణవేణి ముఖ్య అతిధి శ్రీమతి కల్వకోట ఉమాదేవి గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.