pizza
Sahitya Vedika-8th Anniversary & 96th Nela Nela Telugu Vennela
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

17 July 2015
Hyderabad

పద్యం, హాస్యం ప్రధానంగా సాగిన టాంటెక్స్ తెలుగు సాహిత్య వేదిక అష్టమ వార్షికోత్సవం

డాల్లస్/ఫోర్టువర్త్,టెక్సస్: తెలుగు సాహిత్య సేవలలో నిర్విరామంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల” అష్టమ వార్షికోత్సవం ఈ నెల ఆదివారం జూలై 12 మలంకార చర్చి ఆడిటోరియంలో సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఎంతో ఘనంగా జరిగింది. తెలుగు భాష, సాహిత్యం, సంస్క్రతి పరిరక్షణ ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో మరో మైలు రాయి ఈ అష్టమ వార్షికోత్సవం. "సంగీత సాహిత్య నృత్య సమ్మేళనం" గా ప్రతి సంవత్సరం జరుపుకునే మన తెలుగింటి వేడుక. పద్యం, హాస్యం ప్రధాన ఇతివృత్తాలుగా సాగిన ఈ వేడుక పిల్లలు, పెద్దల భాగస్వామ్యంలో ఏంతో సందడిగా, మన ఇంటిలో వేడుకలా ఆద్యంతము ఉల్లాసంగా జరిగింది. ముఖ్య అతిధి శ్రీ తురిమెళ్ళ శంకర నారాయణ గారు, విలక్షణ అతిధి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, విశిష్ట అతిధి డా. కేతు విశ్వనాథరెడ్డి గారు, ప్రత్యేక అతిధి శ్రీమతి అమల్లదిన్నె పద్మజ గారు, టాంటెక్స్ కార్యవర్గం, పాలకమండలి సభ్యులు, సాహిత్య వేదిక సభ్యుల జ్యోతి ప్రజ్వలనతో సభ ఘనంగా ప్రారంభమైంది. చిన్నారి చావలి ఉమ సరస్వతి నమోస్తుతె ప్రార్ధనా గీతం వీనులవిందుగా ఆలపించింది. తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త దండ వెంకట్ ప్రారంభోపన్యాసం చేస్తూ మన సాహితీ సంపదను కాపాడుకోవడానికి, సాహితీ పండితులను గౌరవించడానికి ప్రయత్నం ఒక ఎత్తయితే, వీటిని భావితరాలకు అందించడం అంతే ముఖ్యమని, ఈ సంవత్సంలో ఇంతవరకు దాదాపు 30 మంది బాల బాలికలు పాల్గొని తమ సాహిత్య ప్రతిభను ప్రదర్శించిన తీరును కళ్లకద్దినట్లు వివరించారు. మన భాష, సాహిత్యం విరాజిల్లేందుకు చేయి చేయి కలిపి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

శ్రీమతి చావాలి మంజు హేమమాలిని సమర్పణలో గురు పరంపర డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ బాల బాలికల సంగీత విభావరిలో దరువర్ణం మాతే మలయధ్వజ, బ్రహ్మ మొక్కటే అతి మధురంగా గానం చేసి ఆహుతుల హర్షద్వానాలు అందుకున్నారు. ప్రత్యేక అతిధి శ్రీమతి పద్మజ అమల్లదిన్నె(మల్లాది) గారి పద్య పఠన ప్రాముఖ్యత ప్రసంగం ఒక ప్రవాహంలా సాగి, నన్నయ్య నావాడని, పోతన నావాడని వాదించే ఉదాహరణలో, అచ్చులని హల్లులని ఎలా విడదీయలేమో అలాగే పద్యాలని కూడా ప్రాంతాలవారీగా విడదీయలేమని, పద్యం తెలుగువాడి సొంతమని కొనియాడారు. శ్రీ దొడ్ల రమణ పోతన భావతంలోని పద్యాలను రాగయుక్తంగా ఆలపించి, సభలోని వారి అందరిచేత ఔరా అనిపించుకున్నారు. అంతే కాకుండా శ్రీ దొడ్ల రమణ గారు, అన్నీ సాధ్యమే అనే రీతిలో, తెలుగు భక్తి సామ్రాజ్యానికి తిరుగులేని రాజైన పోతన విరచిత భాగవతము నుండి మధురమైన కొన్ని పద్యాలను తొమ్మిది మంది బాల బాలికలకు శిక్షణ ఇచ్చి, వారిలో పద్యంఫై అవగాహన పెంపొందించి, అనతి కాలంలోనే పిల్లలలో ప్రతిభను వెలికితీసి, "పోతన పద్య పరిమళము" రూపొందించి, ఏంతో రమ్యంగా ఆలపించేట్లు తీర్చిదిద్దిన రమణ గారిని, పిల్లలను అందరూ కొనియాడారు. ముఖ్యంగా మూడేళ్ళ మాడ సమన్విత, నాలుగేళ్ళ రిషికేష్ సిద్ధార్థ రాగ భావయుక్తముగా చదివిన తీరు ఆహుతులని మంత్రముగ్దులని చేసింది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ చిన్నారులు భక్తితో, స్పష్ఠమైన ఉచ్ఛారణతో చేసిన ఈ పద్యపఠనం అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, తెలుగు సాహిత్య భక్తి సంపదలు పదిలంగా దాచుకొని పెంపొందిచగల సామర్థ్యం తరువాతి తరానికి ఉందని ఋజువు చేశారు. విలక్షణ అతిధి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు రాయభారం పద్యాలను శ్రీ కృష్ణుడు వేషములో ఆలపించి అందరిని పద్య నాటకపు రోజులలోకి తీసుకువెళ్ళారు. చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే ఎరుంగని పద్యాలకు సభ దద్దరిల్లింది. విశిష్ఠ అతిధి డా.కేతు విశ్వనాథరెడ్డి గారు “మన తెలుగు మనం” అంశంపై ప్రసంగిస్తూ సాహిత్యం భాషలో ఒక భాగమే కాని సాహిత్యం మాత్రమే భాష కాదని, శుధ్ధ భాష అంటూ ప్రత్యేకం గా ఉండదని, మాండలికాలు వేరైనా భాష అంతా ఒకటేనని భాషా దురభిమానము తగదని హితవు చెప్పారు. డా. కలవగుంట సుధ సమర్పణలో తెలుగు భాషా, సాహిత్యం, సంగీతం, సంస్కృతి సంప్రదాయాలకు అద్వితీయమైన సేవలందించిన ప్రముఖ తెలుగు వాగ్గేయకారులను స్మరించుకుంటూ తెలుగు సాహిత్య వేదిక సభ్యులు మరియు లాస్యసుధ నృత్య అకాడమీ శిష్య బృందం సమన్వయంగా "తెలుగు వాగ్గేయకారులు" నృత్య రూపకాన్ని కన్నుల పండువగా ప్రదర్శించారు. అన్నమయ్య, త్యాగయ్య, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి, క్షేత్రయ్య, నారయణ తీర్థులు, రామదాసు వంటి వాగ్గేయకారులు శృంగారం, భక్తి వగైరాలే కాక ఆనాటి సాంఘిక పరిస్థితులను స్పష్టం చేస్తూ పదాలు రచించారు. వారు లోకాన్ని దర్శించిన ప్రఙ్ఞ, సంగీత, సాహిత్యాలను కరతలామలకం చేసుకోగలిగిన నిష్ఠ, దాన్ని ప్రభోదాత్మకంగా, రంజకంగా, నవనవోన్మేషంగా పునః సృష్టి చేసిన తీరును నృత్యరూపకం ద్వారా చక్కగా వివరించారు. ఈ నృత్యరూపకంలో త్యాగయ్యగా ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం, సాహిత్య వేదిక సభ్యులు సుబ్బు దామిరెడ్డి గురువుగా, అన్నమయ్యగా నాగ సురేష్ సుగ్గల, మునిపల్లె సుబ్రమణ్య కవిగా వరిగొండ శ్యాం, రాముడి పాత్రలో జలసూత్రం చంద్రశేఖర్, నారాయణ తీర్ధులుగా బసాబత్తిన శ్రీ, సంయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం శ్రీ రామదాసు పాత్రలలో అలరించారు.

అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ, సంవత్సర ప్రధమార్ధంలో నిర్దేశించిన "ప్రగతి పధములో పది సూత్రాలు" ఒక్కొక్కటి క్రమంగా కార్యరూపం దాల్చడం, నెరవేర్చడం చాల సంతోషంగా వుందన్నారు. టాంటెక్స్ ప్రత్యేక కార్యక్రం ఈ. టీవి. వారి స్వరాభిషేకం ఆగష్టు 29న ఆలెన్ ఈవెంట్ సెంటర్లో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చురుకుగా సాగుతున్నాయని, అందరు విచ్చేసి జయప్రదం చేయమని కోరారు. నెల నెలా తెలుగు వెన్నెల వందవ మైలురాయి చేరుతున్న సందర్భంలో శత సదస్సు "100వ నెల నెలా తెలుగు వెన్నెల" నవంబర్ 14న ఘనంగా జరుపడానికి సన్నాహాలు మొదలుపెట్టారని, అధిక సంఖ్యలో పాల్గొని భాషాభిమానాన్ని చాటిచెప్పమన్నారు.

ముఖ్య అతిథి హాస్య బ్రహ్మ శ్రీ శంకర నారాయణ గారి హాస్యావధానంలో తన ప్రతి మాటలో హాస్యాన్ని కురిపిస్తూ సభికులని నవ్వుల్లో ముంచారు. భార్య లాండ్ లైన్, గర్ల్ ఫ్రెండ్ సెల్ ఫోన్ అంటూ వారు చెప్పిన పోలికలకు అందరూ కడుపుబ్బా నవ్వారు. స్కూలు తగలపడిపోతోందనీ, కానీ ఉపాధ్యాయులందరూ బయట ఉన్నారని వాపోయిన ఒక పిల్లవాడి గురించి చెప్పినపుడు సభికులు హర్షద్వానాలు చేసారు. కీర్తి శేషులు జంధ్యాల గారు చెప్పిన అప్పగింతలు గురించి మాట్లాడుతూ "అప్పగింతల సమయలో అమ్మాయి ఏడుపు ఆఖరి ఏడుపు అలాగే అబ్బాయి నవ్వు కూడా ఆఖరిదే" అన్నారు. హాస్య ప్రసంగం తదుపరి శ్రీ పూదూర్ జగదీశ్వరన్ సంధాత గా వ్యవహరించగా, డా. ఆళ్ళ శ్రీనివాస్రెడ్డి, శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ, శ్రీ ప్రభల శ్రీనివాస్, శ్రీ జలసూత్రం చంద్రశేఖర్, శ్రీ రాయవరం భాస్కర్, శ్రీమతి మల్లాది పద్మజ, శ్రీ మాడ దయాకర్ పృచ్చకులుగా హాస్యావధానంలో పాల్గొన్నారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు సుభద్రపై పద్యం చదవమనగా శంకర నారాయణ గారు చక్కగా పద్యాన్ని కూర్చి ఆలపించారు. హనుమంతుని తోక పెద్దదా? లేక ద్రౌపది కోక పెద్దదా అన్న చిలిపి ప్రశ్నకి హనుమంతుని తోకే పెద్దదని సమధానమిచ్చారు. ఈ మధ్యనే విడుదల అయిన బాహుబలి చిత్రంలోని కాలకేయుడి భాష గురించి రాయవరం భాస్కర్ గారు ప్రశ్నించగా సరదాగా జవాబిచ్చారు. మగవారి గొప్పదనం గురించి ఆడవాళ్ళు చెప్పుకుంటారా? అన్న జలసూత్రం చంద్రశేఖర్ గారి ప్రశ్నకు ఇచ్చిన జవాబు సభికులని నవ్వుల్లో ముంచింది. మల్లాది పద్మజ గారు, విశ్వనాధ సత్యనారాయణ గారు ఈరోజుల్లో ఉంటే సెల్ ఫోనులో ఏమి మాట్లాడేవారని అడిగిన ప్రశ్నకు కూడా ఎంతో తెలివిగా సమధానమిచ్చి మళ్ళీ సభికుల్ని కడుపుబ్బా నవ్వించారు. మీ పేరులో శంకరుడున్నాడు, నారాయణుడున్నాడు, వీరిద్దరిలో మీరెవరిని ఎంచుకుంటారు, అని ప్రభల శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్నకు సరదాగా బదులిచ్చారు. పృచ్చకుల నుండే కాకుండా సభలోని వారు కూడా హాస్యావధాని శంకర్ నారాయణ గారిని అడిగిన ప్రశ్నలకు హాస్యంతో బదులిచ్చి అందరినీ నవ్వించారు.

అట్లూరి స్వర్ణ గారు సభా ప్రాంగణాన్ని అలంకరణ చేసిన తీరు, అన్ని అంశాలను మంచి ఆలోచనతో కూర్పు చేసిన పూర్వ సాహిత్య కార్యక్రమ చాయా చిత్రాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు ఉప్పలపాటి క్రష్ణారెడ్డి, కార్యదర్శి మహేష్ ఆదిత్య ఆదిభట్ల, కోశాధికారి శీలం క్రష్ణవేణి, పాలకమండలి సభ్యులు రొడ్డ రామక్రష్ణా రెడ్డి, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం సింగిరెడ్డి శారద, బిళ్ళ ప్రవీణ్, వనం జ్యోతి, గోవాడ అజయ్, పాలేటి లక్ష్మి, వీర్నపు చినసత్యం, పావులూరి వేణు ముఖ్య అతిధి శ్రీ తురిమెళ్ళ శంకర నారాయణ గారిని , విలక్షణ అతిధి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని, విశిష్ట అతిధి డా. కేతు విశ్వనాథరెడ్డి గారిని, ప్రత్యేక అతిధి శ్రీమతి అమల్లదిన్నె పద్మజ గారిని, చలనచిత్ర నటులు శ్రీ నందమూరి తారకరత్న గారిని, సంగీత దర్శకులు శ్రీ నేమాని పార్థసారథి గారిని పుష్పగుచ్చ్చం, శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయ కర్త దండ వెంకట్ మాట్లాడుతూ 96 నెలలు ఒక యజ్ఞంలా 'నెల నెలా తెలుగు వెన్నెల' కార్యక్రం నిరాటంకంగా సాగడానికి కారకులైన సభ్యులకు, కార్యకర్తలకు, భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు, పోశకదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved