
To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
26 June 2018
USA
అమెరికాలో సాహిత్య, సంగీత, సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసి , ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేసే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు శీలం కృష్ణవేణి గారి అధ్యక్షతన ఆదివారం నాడు స్థానిక ఎస్.పి.ఆర్ . బాంక్వెట్ హాల్ లో , కార్టూన్ వర్క్ షాప్ నిర్వహించింది. ప్రముఖ కార్టూనిస్ట్ టి.వి.ఆర్.కే.మూర్తి (విశ్వపతి) దీనిని నిర్వహించారు.
విశ్వపతి పేరుతొ ప్రసిద్ధులైన మూర్తి ఇండియన్ ఎక్స్ప్రెస్ లో 1984 నుంచి 1990 దాకా SUMFUN అనే శీర్షిక లో కార్టూన్స్ వేశారు...ఆంధ్ర ప్రభ, ఆంధ్ర జ్యోతి వంటి ప్రముఖ పత్రికలలో అయిదు వేలకు పైగా కార్టూన్లు వేశారు.
ముఖ్య అతిథిని సంస్థ పూర్వాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సభకు పరిచయం చేయగా, విశ్వపతి గారు పాల్గొన్న వారందరికీ కార్టూన్స్ గురించి తన అనుభవాలు జోడిస్తూ, రక రకాల బొమ్మలు ఎలా గీయ వచ్చో తెలుపుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. పాల్గొన్న వారందరూ స్వయంగా విశ్వపతి గారు వేసిన బొమ్మలను అనుకరించి నేర్చుకోవడానికి , చక్కగా తమ వంతు కృషి చేసారు. విశ్వపతి గారు ప్రతి ఒక్కరితో సంభాషిస్తూ, కార్టూన్లు గీయడం లో మెళకువలను వివరించారు.
విశ్వపతిగారు ఆబాలగోపాలాన్ని తన కార్టూన్ల సదస్సుతో అలరించారు చిలికి చిలికి గాలివాన అయినట్లుగా ఎవరో ఒకరిద్దరు ప్రేరితమై కార్టూన్లు ప్రయత్నిస్తారేమో అనుకున్న సందర్భములో, విశ్వమూర్తిగారు చిన్ని చిన్ని గీతలతో పెద్ద పెద్ద భావాలను అతి సునాయాసంగా వెలికితీస్తుంటే, చేరిన పిన్నాపెద్దా ప్రేరితులై మునుపెన్నడూ కార్టూన్లు గీయని వారితో సహా అందరూ తమలో దాగియున్న కళాత్మకతను విశ్వపతిగారి ద్వారా కనుగొని కృతజ్ఞులయ్యారు.
పాల్గొన్న వారిలో అత్త్యుత్తమంగా బొమ్మలు గీచిన ముగ్గురికి తను వ్రాసిన “Sincerely Yours“ పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. ముఖ్య అతిథి తను స్వయంగా గీచిన కొందరి ప్రముఖుల వ్యంగ చిత్రాలను (caricatures) పాల్గొన్న టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు బహుమతిగా ప్రధానం చేసారు.
రోజంతా రసవత్తరంగా, హాస్యభరితంగా సాగిన ఈ కార్యక్రమంలో 7 సం. ల చిన్న పిల్లల నుంచి 70 సం.ల పెద్దవారి దాకా ఎంతో మంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
అటు పిమ్మట, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలు శీలం క్రిష్ణవేణి మరియు ఉత్తరాధ్యక్షుడు వీర్నపు చినసత్యం టి .వి .ఆర్ .కే .మూర్తి (విశ్వపతి) గారిని శాలువతో మరియు సంస్థ కార్యవర్గ సభ్యులు జ్ఞాపికతో సత్కరించారు. అధ్యక్షురాలు శీలం క్రిష్ణవేణి మాట్లాడుతూ విన్నూత్నంగా టాంటెక్స్ మొదటి సారిగా చేపట్టిన ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం గావించిన వారికి, డ్రాయింగ్ పుస్తకాలను అందించిన కృష్ణ జ్యూవెలర్స్ వారికి, ఎస్.పి.ఆర్ . బాంక్వెట్ హాల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన ఫన్ ఏషియా, టీవీ 9, టీవీ 5, iTV Asia, టి.ఎన్.ఐ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.
కార్యక్రమంలో టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు కోడూరు క్రిష్ణారెడ్డి, కార్యదర్శి మండిగ శ్రీలక్ష్మి, కోశాధికారి పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు బండారు సతీష్, ఇల్లెందుల సమీర పాల్గొన్నారు.






