To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
21 November 2015
Hyderabad
నవరస భరితమైన వినోదంతో ఉర్రూతలూగించిన తారలు: వైభవంగా ముగిసిన టాంటెక్స్ దీపావళి వేడుకలు
డాలస్/ఫోర్ట్ వర్త్, నవంబరు 14, 2015
టాంటెక్స్ దీపావళి వేడుకలు స్థానిక ఇర్వింగ్ హై స్కూల్ లో శనివారం, 11/14/2015 నాడు అంగరంగ వైభవంగ జరిగాయి. అందరి అంచనాలకు మించి అశేష జనవాహిని తమ పిల్ల పాపలతో, బంధుమిత్రులతో విచ్చేసి, కార్యక్రమానికి ఘనవిజయం చేకూర్చారు. ఈ కార్యక్రమాలలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు స్థానిక కళాకారులు ఇచ్చిన గౌరవం, కళల పట్ల చూపిన మక్కువ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతి కార్యక్రమంలోను తెలుగు తనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే టాంటెక్స్ వారు ఈ సారి మరింత తెలుగుదానాన్ని ప్రోత్శాహించి, కార్యక్రమాలు ఆసాంతం మన సంస్కృతిని ప్రతిబింబించేలా తగు శ్రద్ధ చూపారు. మొదట అమెరికా జాతీయ గీతం, సాంస్కృతిక కార్యదర్శి జ్యోతి వనం గారు స్వాగత సందేశం తో కార్యక్రమం ప్రారంభమైనది. మొదటి భాగంలో స్థానిక కళాకారుల ఆటపాటల నడుమ స్థానిక వ్యాఖ్యాత సంధ్య మద్దూరి చక్కని చలోక్తులతో హుషారుగా కార్యక్రమాలను నడిపించారు. దీపావళి కథను ఒక చక్కని మెలోడీ రూపంలో, విష్ణువుని కీర్తిస్తూ వినరోభాగ్యం విష్ణు కథ అంటూ సంప్రదాయకమైన నృత్య ప్రదర్శన, విష్ణువు సరే మరి నటనకు మూల విరాట్టు అయిన శివుడు లేకపోతే ఎలా ? అందుకే శివాంజలి అంటూ మరొక నృత్య ప్రదర్శన ఆహూతుల మన్ననలు అందుకొన్నాయి.
దేహానికి ఊపిరి ఎంతో సంగీతానికి స్వరములు అంత! ఆ స్వరములను కీర్తిస్తూ స్వరార్చన అనే మరొక చక్కని కూచిపూడి నాట్య ప్రదర్శన జరిగింది. సామాన్య జనం నోటి వెంట మాటలు, పాటలుగా జనపదాలుగా మారి మన సంస్కృతిలో మమేకం అయిపోయాయి, ఒక చక్కని జానపద నృత్యరూపకంతో ఒక్కసారిగా కార్యక్రమాలు కొత్త ఊపునందుకొన్నాయి. సినీ మిశ్రమ గీతాలు ప్రస్తుతం నడుస్తున్న కొత్త ఒరవడి, డల్లాస్ కళాకారులు సినిమా పాటలకు వేసిన స్టెప్ లకు ప్రేక్షకులు అడుగులు జతకలిపారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు తెచ్చుకొన్న ప్రముఖ వ్యాఖ్యాత శ్యామల గారు , తమ హావ భావాలతో , చలోక్తులతో , చక్కని నృత్యాలతో , కడుపుబ్బా నవ్వించే హాస్యం తో, వివిధ పాత్రలు పోషించి , కడు రమ్యంగా కార్యక్రమం ఆసాంతం ఎంతో క్రొత్తగా , చక్కగా నడిపించారు. గుత్తివంకాయ చిచ్చుబుడ్డి హాస్య నాటిక చక్కని నవ్వులు పూయించింది. తెలుగు కళాకారులు భవిరి రవి, దోర్నాల హరిబాబు గార్ల ఆధార్ కార్డు కామెడీ కడుపుబ్బా నవ్వించింది. టాంటెక్స్ వారి త్రై మాసిక పత్రిక "తెలుగు వెలుగు" దీపావళి సంచికను ముఖ్య సంపాదకుడు మరియి సంస్థ సంయుక్త కార్యదర్శి వీర్నపు చిన సత్యం ఆవిష్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గ 2015 రేడియో బృందాన్ని ఘనంగా అభినందన జ్ఞాపికలతో సత్కరించారు. సాంస్కృతిక కార్యదర్శి జ్యోతి వనం గారు నృత్య దర్శకులను ఘనంగా సత్కరించారు.
టాంటెక్స్ అధ్యక్షులు డా. నరసింహారెడ్డి ఊరిమిండి టాంటెక్స్ కొత్త మొబైల్ యాప్ ను విడుదల చేసి , ఈ సంవత్సరం పొడవునా టాంటెక్స్ సంస్థపై, సంస్థ కార్యక్రమాలపై డల్లాస్ నగర వాసులు చూపించిన ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. 2015 సంవత్సరం ఆరంబంలో ప్రకటించిన ‘ప్రగతి పథంలో పది సూత్రాలు’ నిన్నాదంతో ప్రారంభించిన ఆన్నీ కార్యక్రామాలు జయప్రదం అవుతున్నందుకు సంతోషాన్ని వ్యక్త పరిచారు. కార్యక్రమ సమన్వయ కర్త కృష్ణారెడ్డి కోడూరు గారు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు , అధ్యక్షుల వారు , పోషక దాతలను -----ఘనంగా సత్కరించారు. చీకట్లు తొలిగించి చిరునవ్వుల దీపాలు వెలిగించిన టాంటెక్స్ దీపావళి వేడుకలు అందరకూ ఎంతో ఆనందాన్ని మిగిల్చి ఘనంగా ముగిసాయి.
చివరగా దీపావళి వేడుకల సమన్వయకర్త కృష్ణారెడ్డి కోడూరు వందన సమర్పణ చేస్తూ విచ్చేసిన ప్రేక్షక సమూహానికి, “ప్లాటినం” పోషక దాతలకు, “గోల్డ్” పోషకదాతలకు, “సిల్వర్” పొషకదాతలకు, మరియు కార్యక్రమ పోషక దాతలకు మరియు ప్రత్యేక ప్రసార మాధ్యమాలు దేశీప్లాజా, రేడియో ఖుషి, ఇతర ప్రసార మాధ్యమాలు ఏక్ నజర్, మై డీల్స్ హబ్, రేడియో ఖుషి, టివి9, తెలుగు వన్ (టోరి) రేడియో, టివి5, ఐనా టివి, హమౌరా, మరియు అర్వింగ్ హైస్కూల్ యాజమాన్యానికి కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు. భారత జాతీయ గీతంతో అత్యంత వైభవంగా నిర్వహించిన దీపావళి వేడుకలకు తెరపడింది.