To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
30 June 2015
Hyderabad
ఈ నెల జూన్ 20వ తేదీన, డాల్లస్ నగరంలోని దేశీ ప్లాజా స్టూడియోలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్), లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ, మరియు ఢిల్లీ తెలుగు సంఘం సమన్వయంగా నిర్వహించిన “స్వరమాధురి” కార్యక్రమం ప్రేక్షకులను ఆనంద సాగరంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడెమీ కార్యదర్శి శ్రీ. ఎన్ వి.ఎల్. నాగరాజు, వారి సతీమణి శ్రీమతి. లక్ష్మి, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. సింగిరెడ్డి శారద మరియు బృందం, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు, అతిథులు సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమన్ని ప్రారంభించారు.
సంగీతం ఓ సంపద! రాగం ఒక భోగం అన్నారు పెద్దలు. శ్రవణానందభరితమైన రాగాలాపన వింటే బాధలను మర్చిపోయి ఎన్నో భావాలు మనలో ఉద్భవిస్తాయి. సాహిత్యం ఒక సంబరమైతే దానికి సంగీతం తోడై మధురమైన గానంతో, నిత్తేజపరులను సైతం ఉత్తేజపరుస్తుంది. స్వరానికి ఎన్నో రాగాలు మేళవింపు జేసి తమ గానామృతాన్ని లోకానికి వినిపించిన మహానుభావులెందరో! ఎందరెందరో!
భావానికి తగిన రాగాన్ని జోడించి భావప్రకటితం చేస్తూ గానాలాపన చేసే సంగీత గాయకుడు డా. కోమండూరి రామాచారి గారు మధురగాయకునిగా అనతికాలంలోనే పేరు ప్రఖ్యాతలు గడించారు. ‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ’ ని స్థాపించి ఇటు భారదేశంలోనే కాకుండా అమెరిక, ఆస్ట్రేలియా, యూరప్ వంటి పాశ్చాత్యదేశాల్లో ఎంతో మంది శిష్యులకు శిక్షణనిచ్చి వారిచేత ప్రదర్శనలు ఇప్పిస్తూ యావత్ ప్రపంచాన్ని సంగీత సాగరంగా చేసి ఎందరో ప్రముఖుల చేత మన్ననలను పొందారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి సభనుద్దేశించి మాట్లాడుతూ డా. కోమండూరి రామాచారి గారితో టాంటెక్స్ సంస్థకున్న ఐదు సంవత్సరాల అనుబంధాన్ని, స్థానిక చిన్నారులకు సంస్థ అందిస్తున్న ప్రోత్సాహాన్ని, మరియు 18 సంవత్సరాలకు పైబడ్డ స్థానిక గాయనీగాయకలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న “స్వరమంజరి” కార్యక్రమాన్ని వివరించారు. ఢిల్లీ తెలుగు అకాడెమీ గత ముప్పై సంవత్సరాలుగా తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు చేస్తున్న అనేక కార్యక్రమాలను, మరియు శ్రీ NVL నాగరాజు గారి నిస్స్వార్ధ సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమలో డా. కోమండూరి రామాచారి గారి శిష్యులైన సూపర్ సింగర్స్, ప్లే బాక్ సింగర్స్, సత్యయామిని, నిహారిక, కశ్యప్ మనోజ్, కౌత అశ్విన్ మనోహరంగా తమ గానాన్ని సినిమాల్లోని పాత-కొత్త పాటలకు సమంగా ప్రాధాన్యతనిస్తూ శ్రుతినీవు గతినీవు, ఆనతి నీయర, నీనీల పాడెద, కొంతకాలం, రామచక్కని సీతకు, వంటి పాటలతో ప్రేక్షకులను ఆనంద డోలికల్లో విహరింపజేసారు. వీరితో పాటు డా. కోమండూరి రామాచారి గారి శిష్యులైన డాల్లస్ నివాసులు పూనూరు సంజన, కస్తూరి ప్రణవ్, జంగేటి మహిత, ధర్మపురం స్నేహ, వాస్కర్ల శ్రియ, వట్టికుట్టి వెన్నెల, పటేల్ ఆనికా, పండుగు శ్రీయ, సుంకిరెడ్డి అవని, పూజిత కొమ్మెర, కౌత రితి,కౌత శ్రీలక్ష్మి,కౌత అన్విత్ కూడా వారు స్వర పరచిన సరిగమ పదని స్వరాలే, సారే జహాన్ కొ ప్యారా హిందూస్తాన్ హమారా,ఒక రాగం పలకాలంటే వంటి పాటలకు భావరాగాలను జతకట్టి తమ గానంతో ప్రతిభను చాటుకున్నరు.
ఢిల్లీ తెలుగు సంఘం శ్రీ.ఎన్ వి.ఎల్. నాగరాజు, వారి సతీమణి లక్ష్మి 30 సంవత్సరాలుగా కళలపైనున్న మక్కువతో ఎంతోమంది కళాకారులను, కళాపోషకులను, కూడా ప్రోత్సహించి వారి కళాదరణను చాటారు. ‘స్వరమాధురి’ కార్యక్రమంలో వారు హ్యుస్టన్ నుండి స్వచ్ఛంద సేవకులు శ్రీ.బంగారు రెడ్డి, నృత్య కళాకారిణి శ్రీమతి. కోసూరి ఉమాభారతి, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ నుండి శ్రీమతి. సింగిరెడ్డి శారద మరియు శ్రీ పూనూరు కమలాకర్, నాటా ప్రాంతీయ ఉపాధ్యక్షుడు శ్రీ.దర్గా రెడ్డి, కార్యక్రమం పోషకదాత జి అండ్ సి శ్రీ.మల్లిక్, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, పాలక మండలి అధిపతి శ్రీ. అజయ్ రెడ్డి లకు ప్రవాస తెలుగువారికి చేస్తున్న నిస్వార్ధ సేవలకు గుర్తింపుగా ఙ్ఞాపికను బహూకరించి, దుశ్శాలువాలతో సత్కరించారు.
ఉత్తర టెక్సాస తెలుగు సంఘం అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి , ఉత్తరాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఆదిత్య ఆదిభట్ల మహేష్, కోశాధికారి శీలం కృష్ణవేణి, కార్యవర్గ సభ్యులు పాలేటి లక్ష్మి, బిల్లా ప్రవీణ్, గజ్జల రఘు, పాలకమండలి సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, శ్రీమతి రుమల్ల శ్యామ, శ్రీ NVL నాగరాజు గారికి, శ్రీమతి లక్ష్మి గారికి పుష్ప గుచ్చాలతో, దుస్సాలువాలతో సంప్రాదాయ బద్దంగా సన్మానించారు.
ప్రత్యేక కార్యక్రమాల సమన్వయకర్త శ్రీమతి. సింగిరెడ్డి శారద వందన సమర్పణ చేస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి చేయూత నిచ్చిన తమ జట్టు సభ్యులు సుంకిరెడ్డి నరేష్, దిన్డుకుర్తి నగేష్ బాబు, పంచార్పుల ఇంద్రాణి, తోటకూర పల్లవి, తెలకలపల్లి జయ, సుంకిరెడ్డి మాధవి, దండెబోయిన నాగరాజు, గంగాధర పవన్, మార్తినేని మమత లకు కృతఙ్ఞతలు తెలియజేసారు. నేపధ్యగాయనీమణులైన సత్య యామిని, నీహారిక, మనోజ్ కశ్యప్ మరియు స్థానిక చిన్నారులను అభినందించారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సీవీఆర్ టీవీ, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.