pizza
TANTEX - Telugu Sahitya Vedika - Nela Nela Telugu Vennela - 6th Anniversary
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

26 September 2013
Hyderabad

అత్యంత వైభవంగా ముగిసిన టాంటెక్స్ సాహిత్య వేదిక 6 వార్షికోత్సవం:
సంగీత సాహిత్య నృత్య సమ్మేళనంతో కోలాహలం


సెప్టెంబర్ 22, 2013, డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తెలుగు సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 6వ వార్షికోత్సవం సెప్టెంబర్ 22, 2013 తేది స్థానిక సెయింట్ మేరీస్ మలంకార ఆర్థోడాక్స్ చర్చిలో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 74 నెలల పాటు ఆరు వార్షికోత్సవాలు అత్యంత ఘనంగా  ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు, సంగీత, కూచిపూడి, జానపద నృత్య కళాకారులు అధిక సంఖ్యలో, అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో నెల నెలా తెలుగు వెన్నెల 6వ వార్షికోత్సవ కార్యక్రమానికి, ముఖ్య అతిథులకి, ప్రేక్షకులందరికీ ఘనంగా స్వాగతం పలికారు.

టాంటెక్స్ కార్యదర్శి మరియు సాహిత్యవేదిక కార్యవర్గ సభ్యుడు శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారి శతజయంతి సందర్భంగా “ఈయన ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు,  తెలుగు పదాలతో శివతాండవం ఆడించిన కవి” అని గుర్తు చేసారు.

టాంటెక్స్ కార్యవర్గ బృందం మరియు అతిథుల మధ్య జరిగిన జ్యోతి ప్రజ్వలనలో, “సరస్వతీ పుత్ర” శ్రీ పుట్టపర్తి నారాయణ చార్యుల గారికి నమస్సుమాంజలి అర్పిస్తూ శ్రీమతి జ్యోతి సాధు మరియు చిన్నారులు మహిత జంగేటి, నేహ ధర్మపురం, శ్రియ వాస్కర్ల దేశభక్తి గీతంతో సభను ప్రారంభించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు  శ్రీ మండువ సురేష్ తమ సందేశంలో “తెలుగు భాషా సాహిత్య సంస్కృతికి నిలయమైన డాలస్ నగరంలో టాంటెక్స్ సంస్థ నిర్వహిస్తున్న  కార్యక్రమాలు అత్యంత ఆదరణ పొందుతున్నందుకు తమకు గర్వంగా ఉందని, ఈ నిరంతర ప్రక్రియను భావితరాలకు అందించే దిశగా ప్రయాణించాలని” కోరారు.   అనంతరం సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద “తెలుగు తేజస్సును ఖండాంతరాలలో విస్తరింపజేస్తూ,  కేవలం స్వదేశములోని ఆంధ్ర సాంస్కృతిక సాహితీ ముర్తులనే కాకుండా, దేశ విదేశాల్లోని, ఆంధ్ర సారస్వత మూర్తులందరినీ ఈ వేదిక పై సత్కరించి తరించాలనేదే నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య వేదిక సంకల్పం” అన్నారు.

సాహిత్యవేదిక మొదటి భాగం ఆంధ్ర సాహిత్యానికే కలికుతురాయిగా భాసిల్లుతున్న అష్టావధానం కార్యక్రమము డా॥  నరాల రామారెడ్డి గారు, సంధాత  డా. పూదూరు జగదీశ్వరన్, పృచ్ఛకులు డా॥ నందమూరి లక్ష్మి పార్వతి గారు, డా॥ జువ్వాడి రమణ, శ్రీ  మద్దుకూరి చంద్రహాస్, శ్రీ అనంత్ మల్లవరపు, శ్రీ కాజ సురేష్, శ్రీమతి పాలూరి సుజన, శ్రీ చుక్కయ్య,  డా. చింతపల్లి గిరిజా శంకర్ తో కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ రాయవరం భాస్కర్ లేఖకులుగా వ్యవహరించారు.

ముఖ్యఅతిథి అష్టావధాని డా॥  నరాల రామారెడ్డి  గారిని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు  శ్రీ మండువ సురేష్  మరియు పాలక మండలి అధిపతి శ్రీ లావు రామకృష్ణ దుశ్శాలువతో మరియు కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం 'అవధాన కౌస్తుభ అనే' బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు శ్రీ అజయ్ రెడ్డి, డా. సి ఆర్ రావు, తక్షణ పూర్వాధ్యక్షులు శ్రీమతి దమ్మన్న గీత, ఉత్తరాధ్యక్షుడు శ్రీ కాకర్ల విజయమోహన్, ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీ ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు శ్రీ నేలకంటి సుభాష్, శ్రీ మల్లవరపు అనంత్, శ్రీ వీర్ణపు చినసత్యం, శ్రీ చామకూర బాల్కి, శ్రీ కనపర్తి శశి, శ్రీమతి వనం జ్యోతి, శ్రీమతి శీలం కృష్ణవేణి ,  కోశాధికారి శ్రీమతి మందాడి ఇందురెడ్డి, సంయుక్త కోశాధికారి శ్రీ చిట్టిమల్ల రఘు, తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు, శ్రీమతి సింగిరెడ్డి శారద, శ్రీ రొడ్డ రామకృష్ణ రెడ్డి, శ్రీ పున్నం సతీష్, శ్రీ ఆయులూరి బస్వి, శ్రీ కౌతా అశ్విన్, పృచ్ఛకులు, లేఖకులు పాల్గొన్నారు.

నాట్యాంజలి కూచిపూడి స్కూల్ శ్రీమతి శ్రీలత సూరి శిష్య బృందం ఊత్తుక్కాడు వెంకటకవి రాసిన 'బ్రందావన నిలయే'  నృత్య ప్రదర్శన తో ప్రేక్షకుల నేత్రాలకి  రాధాకృష్ణుల బృందావన అందాన్ని వేదికపై చూపించారు. అదిశంకరాచార్యుల నారయణ స్తోత్రంపై వారి నృత్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి నేటి విశేష అతిథి, ఉపన్యాస కోకిల డా॥ నందమూరి లక్ష్మి పార్వతి గారిని సభకు పరిచయం చేస్తూ “ఏడేళ్ళ ప్రాయంనుండే కవిత్వం  వ్రాయడంలో ప్రతిభ కనపరచి, నాగార్జున విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ, తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్ మరియు డాక్టరేట్ పట్టాలను పుచ్చుకుని, సంస్కృతాంధ్ర అధ్యాపకులుగా ఒక దశాబ్ద కాలం పాటు ఉత్తమ సేవలందించి,  “శ్రమణకం” “నేతాజీ” నవలలద్వారా సృజనాత్మక రచయిత్రిగా, “వెలుగు దారులు” ధారావాహిక ద్వారా మానవ విలువలను విశదీకరిస్తూ “ఎదురు లేని మనిషి” ఎన్.టి.ఆర్  సహధర్మచారిణిగా  సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాభివృద్ధికి  విశేష సేవలందించారని” అభినందనాపూర్వకంగా  స్వాగతించారు.

నాట్యాంజలి కూచిపూడి సంస్థ అధినేత్రి, “నాట్య కళా చూడామణి” శ్రీమతి శ్రీలత సూరి పుష్పగుచ్చంతో డా. లక్ష్మీ పార్వతిని  గౌరవించారు. “తెలుగు భాషా వైదుష్యం” ప్రధాన అంశంగా ప్రసంగిస్తూ, తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలను, ఔన్నత్యాన్ని, భాషలో ఇమిడియున్న  విశేష సంపదను అభివర్ణిస్తూ,  హిమాలయాల లాంటి తేనెతుట్టె లోని ప్రతి బొట్టూ తెలుగు భాష మాధుర్యాన్ని సూచిస్తుందంటూ సాగిన ప్రసంగం అందరినీ విశేషంగా ఆకట్టుకొంది.  సన్మాన కార్యక్రమంలో భాగంగా శ్రీమతి సింగిరెడ్డి శారద మరియు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి సంయుక్తంగా దుశ్శాలువతో మరియు  డా. ఊరిమిండి నరసింహా రెడ్డి “ తెలుగు ఐశ్వర్య శిరోమణి”  బిరుదుతో డా. లక్ష్మీ పార్వతి గారికి జ్ఞాపికను అందించారు.

శ్రీమతి సింగిరెడ్డి శారద ప్రముఖ పల్లెపదాల జానపద గాయకుడు శ్రీ చాకటి రవిని సభకు పరిచయం చేస్తూ “అతి చిన్న వయసులోనే జానపదాలను పల్లెటూరు నుండి పట్టణానికి మోసుకొచ్చి, అటు అదిలాబాదు నుండి ఇటు అమెరికా వరకు జానపద సంగీత నృత్యాలతో అందరి హృదయాలను దోచుకొని, అదీవాసుల ఖజానా అందచందాలు, అలంకరణలు, వాస్తవిక జీవితానుభవాలను చిందులు వేస్తూ జనబాహుళ్యానికి  పంచిపెట్టి,  బుల్లితెర నిర్వహించిన పలు పోటీలలో ఎన్నో ఉత్తమ పురస్కారాలు అందుకొని, పల్లె పదాల అందాలకు మెరుగులు దిద్దుతూ,  తెలుగు మరియు  గోండీ భాష జానపద సంగీత, నృత్య కళకు  విశేష సేవలందించారని” కొనియాడారు. రేలా రే రేలా శ్రీ చాకటి రవి జాన పద గేయాలతో, చక్కటి పల్లె పదాలతో  ప్రేక్షకుల హృదయాలలో వుత్సహాన్ని నింపారు.  వరికోత లాంటి దృశ్యాల వైపు ప్రేక్షకుల మనసును మళ్ళించి, పల్లెటూరి అందాలను వేదిక పై చూపించగా, శ్రీమతి శాంతి నూతి బృందము జాన పద నృత్యాలతో కార్యక్రమాన్ని ఆనందభరితం  చేసారు. శ్రీ చాకటి రవిని టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు  శ్రీ కాకర్ల విజయమోహన్ మరియు శ్రీమతి సింగిరెడ్డి శారద దు శాలువతో సత్కరించారు సంస్థ అధ్యక్షుడు  శ్రీ మండువ సురేష్ జ్ఞాపికతో సన్మానించారు.  

ఈ మధ్యే  విడుదలై, జనాదరణ పొందిన సినిమా సంభాషణలను  సోదాహరణంగా వివరిస్తూ, సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యుడు శ్రీ అయులూరి బస్వి ప్రముఖ మాటల రచయిత శ్రీ కోన వెంకట్ ను సభకు పరిచయం చేస్తూ “రాజకీయ కుటుంబంలో జన్మించి, యాదృచ్ఛికంగా చలన చిత్రరంగంలో నిర్మాతగా ప్రవేశించి, నటుడుగా, దర్శకుడుగా విభిన్న పాత్రలు పోషించినప్పటికీ, దాదాపు ముప్పై చిత్రాలకు హాస్య సంభాషణల రచయితగా చెరగని ముద్ర వేసి, కోట్లాది తెలుగువారి హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకొని,  ప్రముఖ దర్శకుల జాబితాలో  వినూత్నమైన పాత్రలకు సరికొత్త శైలిలో మాటలను జతపరచి, ఉత్తమ రచయితగా ఎన్నో పురస్కారాలతో విజయ ఢంకా మోగించారని” అభివర్ణించారు.  “సినీ సంభాషణలు – ప్రస్తుత పోకడలు” అంశం పై శతజయంతి జరుపుకున్ను భారతీయ చలనచిత్ర రంగం లోని ప్రధాన ఘట్టాలను వివరించారు. శ్రీ కోన వెంకట్ గారు సినీ మాటలు ముచ్చటించగా స్థానిక  చిన్నారులు జంగేటి మహిత, ధర్మపురం నేహ, పోలవరం ధ్యుతి, వాస్కర్ల శ్రియ “మా తెలుగు  తల్లికి  మల్లెపూదండ” గానాన్ని వినిపించి ప్రేక్షకుల ప్రశంసలను అందుకొన్నారు. ముఖ్య అతిథి శ్రీ కోన వెంకట్ గారిని కార్య వర్గ సభ్యులు శ్రీ చామకూర బాల్కి మరియు శ్రీ ఆదిభట్ల మహేష్ సంయుక్తంగా దుశ్శాలువతో మరియు శ్రీ మల్లవరపు అనంత్   జ్ఞాపికలతో సత్కరించారు.

తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి నెల నెలా తెలుగు వెన్నెల 6వ వార్షికోత్సవం సదస్సులో పాల్గొన్న  ముఖ్య అతిథులకు, స్థానిక కళాకారులకు  కృతఙ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమం పోషక దాతలు శ్రీ అజయ్ రెడ్డి, శ్రీమతి సింగిరెడ్డి శారద, మన సంస్థకు ఆర్హ్దిక సహాయం అందిస్తున్న ప్లాటినం స్పాన్సర్స్  (బావర్చి బిర్యాని పాయింట్, మయూరి ఇండియన్ రెస్టారెంటు, మై టాక్స్ ఫైలర్), గోల్డ్ స్పాన్సర్స్ (హోరైజాన్ ట్రావెల్స్, ప్యారడైజ్ బిత్యాని పాయింట్, పసంద్ ఇండియన్ క్విజీన్, సౌత్ ఫోర్క్ డెంటల్, డిస్కవర్ ట్రావెల్, విష్ పాలెపు టాక్స్ సర్వీసు), సిల్వర్ స్పాన్సర్ (యునికాన్ ట్రావెల్), అల్ఫాహారం, తేనీరు సరఫరా చేసిన స్వగృహ ఇండియన్ రెస్టారెంట్ కు కృతఙ్ఞతలు తెలియ జేశారు.

కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన సెయింట్ మేరీస్ మలంకార ఆర్థోడాక్స్ చర్చి యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన దేసిప్లాజా (డా. పుట్టపర్తి కృష్ణ మోహన్, శ్రీ మనోహర్ నిమ్మగడ్డ), ఏక్ నజర్,  రెడియోఖుషి , టీవీ9(శ్రీ ముల్లుకుట్ల వెంకట్), తెలుగువన్ “టోరి” రేడియో, టీవీ5 (శ్రీ నసీం షేక్), ఎంకన్నెక్ట్ లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved