To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
29 April 2015
Hyderabad
డాల్లస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వనితా వేదిక కార్యక్రమం ఈ నెల ఆదివారం ఏప్రిల్ 26న, క్యారల్టన్ నగరంలోని రుచి ప్యాలస్ లో వనితా వేదిక సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో ముందుగా సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి తమ కార్యవర్గ సభ్యులను పరిచయంచేసి వినోదమే కాకుండా విఙ్ఞానం ప్రధానంగా ఉండేలా తమ బృందం కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు .ఆ ప్రణాళికలో భాగంగా ఈ సంవత్సరం మొదటి వనితా వేదిక కార్యక్రామాన్ని' విదేశీ కమ్మ్యూనిటీ' తో కలిసి 'బోన్ మారో దానం' పై అవగాహన కలిగిస్తూ అపోహలను తొలగించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
విదేశీ కమ్మ్యూనిటీ అధినేత వెంకటేశ్వర చిన్ని మాట్లాడుతూ బోన్ మారో దాతలలో భారతీయులు కేవలం రెండు శాతం మాత్రమే ముందుకు రావడం విచారకరమని, ఎక్కువ మంది అవగాహనను పెంచాలని కోరారు. బోన్ మారో దానంలొ తమ అనుభవాలను పంచుకునేందుకు పలువురు ముందుకు వచ్చారు.
మొదట ఒక తల్లి మాట్లాడుతూ, మూడు సంవత్సరాల వయసులో తన కొడుకు బ్లడ్ క్యాన్సర్ వల్ల బ్రతకడు అని చెప్పినా ఆశ వదలకుండా తాను బోన్ మారో దాతకోసం పడిన ఇక్కట్లు, దాత దొరికిన తరువాయి అనుభవాలు సభతో పంచుకుంటూ, “ఇదిగో నా కొడుకు, ఈ నాడు పదమూడేండ్లు. చిన్న చిన్న ఇబ్బందులు పడినా ఇదిగో నా కళ్ళెదురుగా ఉన్నాడు, ఒక దాత పెద్ద మనసుతో చేసిన బోన్ మారో దానం వల్ల అని” చెప్పిన వైనం కంటతడి పెట్టించింది.
బోన్ మారో దానం పొందిన ఒక వ్యక్తి భార్య మాట్లాడుతూ తన జాతిలో దాత దొరకనందువల్ల ఒక జర్మన్ దాత బోన్ మారో ఇచ్చినప్పటికీ, తననూ, తన 4 మరియు 5 సంవత్సరముల పిల్లలను అనాధలుగా వదిలి తన భర్త మరణించాడనీ, తన జాతి వారిలో దాతలు ఎక్కువ ఉండి ఉంటే, ఏమో తన భర్త బ్రతికి ఉండేవాడేమొ అని చెప్పిన తీరు హృదయ విదారకం.
మరో బోన్ మారో దాత సోదరి, పాలూరి సుజన తన అనుభవాలు పంచుకుంటూ, ఒక వ్యక్తి ప్రాణాలను నిలబెట్టే ప్రక్రియలో దాతగా పొందే మానసిక ఆనందం ముందు, దాతగా ఒకరు పడే ఇబ్బందులు పెద్ద విషయాలు కావని తన సోదరుడు అన్నట్లు చెబుతూ, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కొన్ని రోజులు లేదా గంటల్లో తిరిగి ఉత్పత్తి చేయగలిగిన రక్త దానము, బోన్ మారో దానం కి కూడా మన వాళ్ళు పేరు నమోదు చేసుకోకపోవడం బాధాకరమైన నిజం అన్నారు.
వేదికకు విచ్చేసిన క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. వెన్నం వినయ, డా. ఉసిరికల మాధురి, 'స్టెం సెల్ ' దానం మరియు 'బోన్ మారో ' దానం కు తేడా ఏమిటి, దాత కి ఏమీ విశ్రాంతి అవసరం కూడా ఉండదు అని, ఫ్లూ ఇంజెక్షన్ పాటి అసౌకర్యం కలుగుతుంది లాంటి వివరాలు తెలియచేసారు. చివరగా 'డంబ్ షరేడ్స్ ' ఆటతో అంతా కలిసి వాతావరణాన్ని తేలిక పరుస్తూ వనితా వేదిక కార్యక్రమాన్ని ముగించారు. సభకు విచ్చేసిన ఆహూతులకు టాంటెక్స్ వారు పకోడీ, సమోసా, తేనీరు తో చక్కని అల్పాహారం అందచేసారు.
అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ “వనితల సమతుల్య జీవనం కోసం వనితలచే సభ్యులకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం వనితా వేదిక ముఖ్య ఉద్దేశ్యం. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొని అవగాహన పెంచుకొని సమాజానికి ఉపయోగపడాలని, దాతలు, వైద్యులు తమ విలువైన కాలాన్ని ఇలా పదిమందికి ఉపయోగపడే కార్యక్రమాలకి వినియోగించడం ఎంతో అభినందనీయం” అన్నారు. ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వనితా వేదిక అంటే కుట్లు అల్లికలు కాకుండా, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టిన బృందాన్ని అభినందించారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహ రెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, సమన్వయ కర్త మండిగ శ్రీలక్ష్మి, వనితా వేదిక బృందం సభలో ప్రసంగించిన వారిని పుష్పగుచ్చములతో సత్కరించారు. సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి వనితా వేదిక విజయవంతంగా జరగడం ఎంతో సంతోషంగా ఉంది అని, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతివారికి, వేదికను అందించిన రుచి ప్యాలస్ వారికి, విదేశీ కమ్మ్యూనిటీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీలకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. టాంటెక్స్ కార్యవర్గం రొడ్డ రామకృష్ణారెడ్డి, వీర్నపు చినసత్యం, శీలం కృష్ణవేణి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.