To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
17 June 2015
Hyderabad
హ్యుస్టన్ జూన్ 13, 2015: జూన్ రెండవ వారాంతంలో హ్యుస్టన్ లోని సుగర్లాండ్ అష్ట లక్ష్మి దేవాలయ ప్రాంగణం లో తెలుగు వికాసం వెల్లి విరిసింది. సిలికానాంధ్ర మనబడి నిర్వహించిన తెలుగు మాట్లాట పోటీలలో 40 మంది కి పైగా చిన్నారులు పాల్గొని అలరించారు. రకరకాల విభాగాలలో తెలుగు భాషా/విషయ జ్ఞానాలని పరీక్షించే “తిరకాటం”, తెలుగు పదాలలో సరైన అక్షరాలు వ్రాయడాన్ని పరీక్షించే “పదరంగం” ఆటల పోటీలు జరిగాయి. పిల్లల సరదాకోసం ఆడించిన “ఒక నిమిషం మాత్రమే (ఒనిమా)”, తిరకాటం పోటీలలో పిల్లలు చెప్పిన సమాధానాలకు ప్రేక్షకుల నుంచి విశేష ప్రతిస్పందన వచ్చింది. కరతాళ ధ్వనులతో ప్రాంగణం హోరెత్తింది.
ఈ పోటిలకు ముఖ్య నిర్వాహకులైన గోపాల కృష్ణ గూడపాటి , నారని రమేశ్ గార్లు మాట్లాడుతూ, “మొదటి సారిగా హ్యుస్టన్ లో జరుగుతున్న ఈ తెలుగు మాట్లాట ప్రాంతీయ స్థాయి ఆటల పోటీలలో పిల్లలు ఊహించని విధంగా పెద్ద ఎత్తున పాల్గొని ఉల్లాసంగా ఆడారు. వచ్చే సంవత్సరం కూడా ఇలానే ఇంకా ఎక్కువ సంఖ్య లో పాల్గొని జాతీయ పోటీలలో ఆసక్తికరమైన పోటీ ఇస్తారని ఆశిస్తున్నాము” అని తెలిపారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలు గా అమెరికా హాస్య బ్రహ్మ బిరుదాంకితులు , ప్రముఖ సాహితీ వేత్త వంగూరి చిట్టెన్ రాజు గారు మరియు చిన్మయ మిషన్ తెలుగు ఉపాధ్యాయులు వీర కంబాల గారు వ్యవహరించారు.
మనబడి కార్యక్రమంలో హ్యుస్టన్ మహానగరంలో మొత్తం 100 మంది కి పైగా పిల్లలు ఐదు తరగతుల పాఠ్యప్రణాళిక లో వారం వారం తెలుగు నేర్చుకుంటున్నారు. ఈ పోటీలకి హ్యుస్టన్ మహా నగరం లోని అన్ని తెలుగు బడుల నుంచి పిల్లలు పాల్గొనటం ఒక విశేషం అయితే, హ్యుస్టన్ సాహితీ లోకం సభ్యులు ఈ పోటీలను చివరిదాకా ఉండి, సంపూర్ణంగా ఆస్వాదించటం మరొక విశేషం.
ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ పోటీలలో గెలుపొందిన బాలబాలికల వివరాలు:
బుడతలు (5-9 సంవత్సరాల వయసు)
తిరకాటం: (1) లాస్య ధూళిపాళ (2) ప్రీతిక పవిరాల
పదరంగం: (1) శ్రావణి పోలూరి (2) లాస్య ధూళిపాళ
సిసింద్రీలు (10-13 సంవత్సరాల వయసు)
తిరకాటం: (1) సాయి ప్రణతి గూడపాటి (2) సచిత చలికి
పదరంగం: (1) సచిత చలికి (2) ప్రణవ్ కూరపాటి
ఈ పోటీలలో గెలుపొందిన పిల్లలకు వంగూరి చిట్టెన్ రాజు గారు , స్థానిక తెలుగు సాంస్కృతిక సమితి అధ్యక్షులు రాజ్ పసల గారు , హ్యుస్టన్ సాహితీ లోకం ప్రముఖులు బాల మురళి కృష్ణ గోపరాజు గార్లు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమాలకు ప్రసన్న మేడిశెట్టి , కృష్ణ వేణి భాగవతుల , లక్ష్మి కలగ , సుబ్రహ్మణ్యం ముక్కవల్లి , సిద్దేశ్వర్ గుబ్బ , గోపాల్ కూరపాటి , రాధాకృష్ణ మైనేని, శ్రీనివాస రావు గుమ్మడి , చంద్ర శేఖర్ కొత్తూరి, మానస, సతీష్ వెలగలేటి ఇంకా అనేక మంది భాషా సైనికులు కృషి చేసారు. సిలికానాంధ్ర మనబడి ఊనికతో ప్రవాసంలో తెలుగు పై మమకారం, ఆసక్తి ఇంకా మరెంతో పెంపొందాలని ఈ కార్యక్రమాలకు హాజరైన అనేక మంది పిల్లల తల్లిదండ్రులు, తెలుగు వారు ఆకాంక్షించారు.