జి.ఆర్కే ఫిలింస్ సమర్పణలో డికొండ దుష్యంత్ కుమార్ , జి.రామకృష్ణ నిర్మాతలుగా ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ దర్శకత్వంలోరూపొందిన చిత్రం `గీతాపురి కాలనీ`. రామ్ చరణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ తొలి సీడీ ఆవిష్కరించారు.
అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ...``పాటలన్నీ ముందే విన్నాను. నాకు రెండు పాటలు విపరీతంగా నచ్చాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్య విలువలు కూడా ఉన్నాయి. పాటలు విన్నాక, ట్రైలర్ చూశాక సినిమా కథ ఊహించని విధంగా అనిపించింది. కచ్చితంగా చూడాలన్న ఉత్సుకత కలిగింది. ఈ యూనిట్ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా ఘన విజయం సాధించాల``న్నారు.
జి.ఆర్కే ఫిలింస్ అధినేత రామకృష్ణ మాట్లాడుతూ...``నేను గతంలో చేసిన `గంగపుత్రులు` చిత్రానికి నంది, జాతీయ పురస్కారాలు లభించాయి. దాని తర్వాత రెండో సినిమాగా `రిపోర్టర్` అనే సినిమా చేస్తున్నా.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో `గీతాపురి కాలనీ` చిత్ర దర్శకుడు నా దగ్గర మంచి కథ ఉంది వినండి అంటూ కలిశాడు. కానీ నేను ఆల్ రెడీ సినిమా చేస్తున్నా అని చెప్పాను. ఓసారి కథ వినమన్నాడు. సరే అని విన్నా. ఫస్ట్ సిట్టింగ్ లోనే నాకు కథ బాగా నచ్చింది. ముఖ్యంగా తల్లిదండ్రలు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే పిల్లల భవిష్యత్ మాత్రమే పాడపోవడం కాకుండా మొత్తం దేశమే పాడైపోతుందన్న అంశం నాకు బాగా నచ్చింది. అందుకే నా బేనర్ లో చేసుకొమ్మని దర్శక నిర్మతలతో చెప్పాను. మా అబ్బాయి కూడా ఈ సినిమాలో మంచి పాత్ర చేశాడు. దర్శకుడు, నిర్మాత ఈ సినిమా కోసం ఎంతో శ్రమించారు. వారి శ్రమకు తగ్గ ఫలితం కచ్చితంగా లభిస్తుంది. సంగీత దర్శకుడు రామ్ చరణ్ అద్భుతమైన పాటలిచ్చాడన్నారు.
`బందూక్ `చిత్ర దర్శకుడు లక్ష్మణ్ చౌదరి మాట్లాడుతూ..``నేను డైరక్ట్ చేసిన `బందూక్` సినిమాలో దుష్యంత్ మంచి పాత్ర చేశాడు. అప్పటి నుంచి తనతో రిలేషన్ ఏర్పడింది. ఈ సినిమాలో తను కూడా ఓ కీలక పాత్రలో నటిస్తూ.. నిర్మించడం విశేషం. పాటలు, ట్రైలర్స్ బావున్నాయి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు.
చిత్ర నిర్మాత డికొండ దుష్యంత్ కుమార్ మాట్లాడుతూ...``నేను `బందూక్` సినిమాలో తొలిసారిగా నటించా. నటనలో మా నాన్నగారే నాకు ఇనిస్పిరేషన్. మా అమ్మగారి పూర్తి సహకారంతో ఈ సినిమా నిర్మించగలిగాను. అలాగే రాంకీ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు. ఎప్పటికప్పుడు సినిమా గురించి అడిగి తెలుసుకుంటూ... సకాలంలో సినిమా పూర్తవడానికి హెల్పయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే మా సినిమాకు బ్యాక్ బోన్ గా రాంకీ గారు నిలిచారు. సినిమా అంటే నాకెంత పిచ్చి, కసి ఉన్నాయో మా డైరక్టర్ లో కూడా అవి కనిపించడంతో ఈ సినిమా చేసే బాధ్యత తన చేతిలో పెట్టాను. సినిమా పట్ల పాషన్ ఉన్నటెక్నీషియన్స్ , ఆర్టిస్టులను తీసుకుని ఈ సినిమా చేశాం. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. అందుకే ఇంత మంచి పాటలొచ్చాయన్నారు.
దర్శకుడు ఘరలకంఠ మద్దేటి శ్రీనివాస్ మాట్లాడుతూ...``నిర్మాత దుష్యంత్ గారు లేకుంటే ఈ సినిమా లేదు. దర్శకత్వ శాఖలో ఎవరి దగ్గర పని చేయకున్నా నా మీద, నా కథ మీద నమ్మకంతో ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే...` గీతాపురి కాలనీ`లో జరిగే ఐదు కథల సమాహారమే ఈ చిత్రం. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక చోట తారసపడ్డ పాత్రలే ఇందులో ఉంటాయి. ఐదుగురి పిల్లల్లో రాంకీ గారి అబ్బాయి కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. భద్రాచలం, పాల్వంచ ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. కెమెరా పనితనం, సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ అవకాశం కల్పించిన మా నిర్మాతకు కృతజ్ఞతల``న్నారు.
సంగీత దర్శకుడు రామ్ చరణ్ మాట్లాడుతూ...``పాటలు నేనే రాసి సంగీతం చేశాను. ఇంత మంచి పాటలు ఇవ్వగలిగానంటే దర్శకుడు ఇచ్చిన సందర్భాలు, నిర్మాత ఇచ్చిన స్వేచ్ఛ కారణం. పాటలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకం ఉందన్నారు.