15 March 2017
Hyderabad
లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. "డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్"తో కలిసి.. స్వీయ రచన మరియు దర్శకత్వంలో డాక్టర్ శివానంద యాలాల తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం "రిజర్వేషన్". తెలుగులో "రిజర్వేషన్" పేరుతొ రిలీజ్ కానున్న ఈ చిత్రం.. హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో "రిజర్వ్ ఏ నేషన్" పేరుతొ విడుదల కానుంది.
కపిల్ చౌదరి-మన్ ప్రీత్ కౌర్, దీపక్ పవార్, ఇమ్రాన్ ఖాన్, డా.సుధాకర్ గౌడ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పోస్టర్ మరియు టీజర్ ను ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన కార్యక్రమంలో.. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. "ఇంతకుముందు తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో.. "పుణ్యభూమి, ధూంధూం" చిత్రాలను నిర్మించిన తన శిష్యుడు శివానంద్ యాలాల తాజాగా రూపొందిస్తున్న "రిజర్వేషన్" టీజర్ చాలా ప్రామిసింగ్ గా ఉందని... ప్రస్తుతం మారుతున్న సామజిక, రాజకీయ నేపధ్యాలలో విద్యా, ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ వ్యవస్థపై ఒక సమగ్ర చర్చను ఈ చిత్రం ప్రేక్షకులకు చూపించనుందని కోదండరాం అన్నారు.
దర్శకనిర్మాత డాక్టర్ శివానంద్ యాలాల మాట్లాడుతూ.. "రిజర్వేషన్స్ ప్రతిభను నిరుత్సాహపరుస్తూ దేశాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తున్నాయనే వాదన ఒక వర్గపు ప్రజల్లో నాటుకుపోగా.. మరోవైపు రిజర్వేషన్స్ పెంచాలని దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. సున్నితమైన ఈ అంశాన్ని రెండు కోణాల్లో చర్చిస్తూ తీసిన సినిమా "రిజర్వేషన్". భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్ జన్మదినం ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నాం" అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వై.వి.మను, విజయ్ కుర్వ, మానవతా రాయ్, పుల్లారావు యాదవ్, డాక్టర్ కృష్ణ, తోట స్వామి, విజయ్ కోటి తదితరులు పాల్గొన్నారు.
ఈక్వెడార్ దేశానికి చెందిన సోలోపాస్కలిన్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నందగోపాల్, ఎడిటర్: వి.జి, కథ: డాక్టర్ బీనవేణి రామ్ షఫర్డ్, సహ నిర్మాత: మనోహర్ అలివేణి, రచన- నిర్మాత-దర్శకత్వం: డాక్టర్ శివానంద్ యాలాల !!