pizza
Tholi Kiranam music launch
 ‘తొలికిరణం’ ఆడియో రిలీజ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

06 February 2017
Hyderaba
d

 

ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తి భావం తొణికిసలాడింది. ప్రభువును కీర్తిస్తూ భక్తులు గీతాలు ఆలపించారు. లోక రక్షకుడైన ప్రభువును ప్రార్ధించారు. అనేకమంది సంఘసేవకులు గుమికూడిన ఆ వేడుక రెగ్యులర్‌గా జరిగే సినిమా ఆడియో ఫంక్షన్‌లా కాకుండా వైవిధ్యంగా జరిగింది. ఇటీవల ప్రసాద్‌ ల్యాబ్స్‌లో సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై జె.జాన్‌బాబు దర్వకత్వంలో టి.సుధాకర్‌ నిర్మించిన ‘తొలికిరణం’ ఆడియో వేడుక ఆత్మీయుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. పలువురు ఆరాధకుల పాస్టర్స్‌, సంఘసేవకులు ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభమయింది. ప్రముఖ నటుడు భానుచందర్‌ ఆవిష్కరించి తొలి సిడిని ప్రభు భక్తుడు లీరూత్‌కు అందజేశాడు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ మాట్లాడుతూ.. ‘జాన్‌బాబు, సుధాకర్‌ జీసస్‌ క్రీస్తు మీద సినిమా తీస్తున్నాం మీరు సంగీతం చేయాలన్నప్పుడు వెంటనే అంగీకరించాను. నాకు ఒక స్వార్ధం ఉంది. ఇలాంటి ఆధ్యాత్మిక చిత్రాలకు చేస్తే అందులోని పాటలు తరువాత తరం వారు కూడా ఆస్వాదిస్తూ గుర్తుంచుకుంటారని ఆశించి మనసు పెట్టి పని చేశాను. చంద్రబోస్‌, బాలాజీ, విజయ్‌ తదితరులు రాసిన పాటలు ఒకదాన్ని మంచి ఒకటి గొప్పగా వచ్చాయి. బాలసుబ్రహ్మణ్యం పాడిన సిలువ పాట చిరకాలం గుర్తుండిపోవడమే కాక గుడ్‌ఫ్రైడే, క్రిస్టమస్‌ లాంటి ప్రత్యేక సందర్భాల్లో దీన్ని ఆలపిస్తారు. శాంతి దూతగా వెలసిన ప్రభువును స్మరించేందుకు ఇలాంటి పాటలు ఎన్నో దోహదపడతాయని నాకు అనిపిస్తుంది. తేలిగ్గా అర్ధమయ్యే వాడుక పదాలనే ఉపయోగించే అవకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు. ప్రముఖ నటుడు భానుచందర్‌ మాట్లాడుతూ.. ‘దర్శకుడు జాన్‌బాబుగారిలో ఒక కమిట్‌మెంట్‌ ఉంది. హ్యుమన్‌ వాల్యూస్ ఉన్నాయి. సర్వీస్‌ మోటివేషన్‌ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయణ్ణి దేవునిదూతగా చెప్పవచ్చు. తను ఈ క్యారెక్టర్‌ను నాకు బాగా నారేట్‌ చేసినప్పుడే దర్శకుడిలో ప్రతిభ ఉందని
అర్ధమయింది. మా కోసం వాడిన ఆర్నమెంట్స్‌, దుస్తులు నాటి గ్రీకు కాలానికి సరిపోయేలా ఉంచడం ఎంతో గొప్ప విషయం. యేసు ప్రభువు చనిపోయిన 3వ రోజున లేచిన తరువాత 45 రోజులు జీవించి ఎలాంటి మిరాకిల్స్‌ సృష్టించారో ఈ చిత్రంలో చూపించారు. మా అబ్బాయిని హీరోగా చేస్తూ ‘ఓ నేస్తమా’ అనే పేరుతో జాన్‌బాబుగారి దర్శకత్వంలో నా పర్యవేక్షణలో నిర్మించబోతున్నానని ప్రకటించినపుడు సభికు కరతాళ ధ్వనులు చేశారు. ‘తొలికిరణం’ చిత్రాన్ని సబ్‌ టైటిల్‌తో ప్రపంచంలోని అన్ని దేశాల్లో విడుదల చేయగలిగేంత మంచి చిత్రం రూపొందడం హర్షణీయం’ అన్నారు.

దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా చేసే ముందు భయపడ్డాను. నేను ఎన్నుకున్న ఆర్టిస్టులుగానీ, టెక్నీషియన్స్‌ గానీ అందరూ గొప్పవారు. వారి సహకారంతోనే అనుకున్నది అనుకున్నదానికన్నా బాగా తీయగలిగాను. నాకు పాటలంటే పిచ్చి. చిన్నతనంలో మా అమ్మ నాచేత చాలా పాటలు పాడించింది. ఈ చిత్రంలోని పాటలు భావితరాలు కూడా ఆస్వాదించేలా ఉండేలా అనుకున్నాను. దానికి తగ్గట్టు సంగీతదర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌ అలాగే చేశారు. బాలు గారు పాడిన పాటను అక్కడే ఉండి వింటున్న మాకు కళ్ళు చెమర్చాయి. ఈ సినిమాను గుడ్‌ఫ్రైడే సందర్భంగా విడుదల చేయదలిచాము’ అన్నారు.

హీరోయిన్‌ అభినయ మాట్లాడుతూ.. ‘తొలికిరణం’లో మేరిమాతగా నటించే అవకాశం రావడం నా పూర్వజన్మ సకృతంగా భావిస్తున్నాను. అవకాశం ఇచ్చిన జాన్‌బాబుగారిని జీవితాంతం గుర్తుంచుకుంటాను. ఇలాంటి అవవాశాలు చాలా అరుదుగా లభిస్తాయి. ఈ చిత్రంలోని మెసేజ్‌ అందరికి చేరువ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో పి.డి.రాజు మాట్లాడుతూ.. ‘కళాకారుడిగా పుట్టడమే ఒక అదృష్టం. కళాకారుడిగా పుట్టి దేవుడి క్యారెక్టర్‌ చేయడం మరింత అదృష్టం. జీసస్‌ క్యారెక్టర్‌ చేసే అవకాశమిచ్చిన జాన్‌బాబుగారికి ఎంతో రుణపడి ఉంటాను. ఈ క్యారెక్టర్‌ ఇచ్చేముందు ఆయన ఎంతో ముంది చర్చి ఫాదర్స్ ఆయన మిత్రులకు చూపించి వారు ఓకె అన్నాకే నాకు అవకాశమిచ్చారు. నటుడిగా ఏం చేశావని ఎవరైనా అడిగితే జీసస్‌ పాత్ర చేశానని గర్వంగా చెప్పకోగలుగుతాను. సిలువ సాంగ్‌ నా మనసును తాకింది. ఈ చిత్రం విజయం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత టి.సుధాకర్‌ మాట్లాడుతూ.. ‘ఈ కథకు దృశ్య రూపం ఇచ్చిన దర్శకుడు జాన్‌బాబు గారికి చక్కని శబ్ధ రూపం ఇచ్చిన సంగీతదర్శకుడు ఆర్‌.పి.పట్నాయక్‌గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. మరిన్ని సినిమాలు చేసేందుకు ప్రోత్సాహకంగా రూపొందింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే జాన్‌బాబు దర్శకత్వంలో మరో చిత్రం చేస్తానని ప్రకటించారు.

మాటల రచయిత రెవరెండ్‌ ప్రభుకిరణ్‌, నటుడు ఆకెళ్ళ మాట్లాడుతూ.. ‘ఆధ్యాత్మికమైన ఈ కథకు అనుగుణంగా రాగాలాపన చేయించిన సంగీతదర్శకుడి ప్రతిభ కనపడిరది. పాటల్లో దైవత్వం ఉంది. ఈ పాటలు ప్రతి ఇంటికీ, ప్రతీ చర్చికి చేరతాయనే నమ్మకం, ఆశ కలుగుతుందని’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, సామ్రాట్‌ అశోక్‌కుమార్‌, రాళ్ళ జోసఫ్‌, పవన్‌, ఎంఆర్‌సినాయుడు, నీరూథ్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. బేబి మేరి విజయ సమర్పణలో తయారైన ‘తొలికిరణం’ చిత్రం గుడ్‌ఫ్రైడే సందర్భంగా విడుదలవుతుందని ప్రకటించారు.

 

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved