విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం `వెళ్లిపోమాకే`. సుప్రజ, శ్వేత నాయికలు. యాకూబ్ అలీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో శనివారం జరిగింది. దర్శకుడు సతీశ్ వేగేశ్న పాటలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా... దిల్‌రాజు మాట్లాడుతూ ``నా స్నేహితుడు హరి ఈ సినిమా ట్రైలర్ పంపారు. ట్రైలర్ చూశాక నాకు బాగా నచ్చింది. సినిమా చూసి బాగా కనెక్ట్ అయ్యాను. దిల్ చిత్రం విడుదలై ఇంకో రెండు నెలలకు 14 ఏళ్లు పూర్తవుతాయి. ఈ 14 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నాను. మంచి సినిమాలను రూపొందిస్తున్నాననే ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నా 14 ఏళ్ల అనుభవం `వెళ్లిపోమాకే` వంటి మంచి సినిమాకు ఉపయోగపడుతున్నందుకు ఆనందంగా ఉంది. కొత్తవారు చేసిన ఫ్రయత్నాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతోనే ఈ సినిమాలో భాగమయ్యాను. ప్రేక్షకులు అదే అనుభూతికి లోనవుతారనే నమ్మకం ఉంది. కొత్తగా సినిమా చేయాలనుకునేవారికి ఇది ఒక లైబ్రరీ అవుతుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో తీశారు ఈ చిత్రాన్ని. ఈ సినిమాలో హీరోలు, హీరోయిన్లు ఉండరు. పక్కింటి అబ్బాయిలు, అమ్మాయిల తరహా పాత్రలే ఉంటాయి. ఇలాంటి సినిమాలను ఆదరిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి`` అని అన్నారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి మాట్లాడుతూ ``నేను ఎ.ఆర్.రెహమాన్ దగ్గర పనిచేశాను. క్లాసికల్, వెస్టర్న్ కలిసిన పాటలు మెప్పిస్తాయి`` అని చెప్పారు.
హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ``అనుపమఖేర్ ఇన్‌స్టిట్యూట్‌తో శిక్షణ చేసుకున్నా. మా సినిమాతో దిల్‌రాజు గారు మమేకం కావడం చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
హీరోయిన్లు సుప్రజ, శ్వేత మాట్లాడుతూ ``ఇంత చక్కటి సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది`` అని తెలిపారు.
దర్శకుడు యాకూబ్ అలీ మాట్లాడుతూ ``వండర్‌ఫుల్ టీమ్‌తో చేశాం. ఎవరికీ పరిశ్రమతో టచ్ లేకపోయినా బాగా చేశాం. దిల్‌రాజు గారిని నచ్చుతుందని అనుకోలేదు. ఈ సినిమాలోకామెడీ ఉండదు. కాకపోతే ఇష్టపడి, కష్టపడి చేశాను. మంచి సినిమాను చూడాలంటే మంచి ఆడియన్ అయి ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత దిల్‌రాజుగారు అలాంటి ఆడియన్ అని అనిపించింది. క్షణం, పెళ్లి చూపులు వంటి సినిమాల తర్వాత చిన్న సినిమాలకు తెలుగులో ఆదరణ పెరుగుతోంది`` అని చెప్పారు.