8 February 2017
Hyderabad
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని ఫిలించాంబరలో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాసయాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరీని ఆవిష్కరించి తొలి డైరీని సీనియర్ జర్నలిస్, అసోసియేషన్ అడ్వైజర్ పసుపులేటి రామారావుకు అందించారు. ఈ సందర్భంగా...
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు,బి.ఎ.రాజు మాట్లాడుతూ - ``తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీని తలసాని శ్రీనివాసయాదవ్‌గారు ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. తలసానిగారి ఆధ్వర్యంలో ఫిలిం జర్నలిస్ట్ ఆసోసియేషన్ ఇంకా ముందు కెళుతుందని ఆశిస్తున్నాను`` అన్నారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయులు కె.నారాయణరాజు మాట్లాడుతూ - ``అక్రిడేషన్, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాలను సినిమా జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే బావుంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ప్రకటనలను తెలుగు పత్రికలను ఇస్తే వారికి ఆర్ధికంగా సపోర్ట్ చేసినట్టు అవుతుంది`` అన్నారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాదమ్ రఘు మాట్లాడుతూ - ``తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ డైరీని సినిమాలంటే ఆసక్తి, అభిమానం ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్‌గారు ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఫిలిం జర్నలిస్టులకు ఉన్న సమస్యలను మంత్రిగారు పరిష్కరిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అడ్వైజర్ సురేష్ కొండేటి మాట్లాడుతూ - ``తలసానిగారికి జర్నలిస్టులంటే ముందు నుండి ఎంతో మర్యాద. ఆయన్ను ఈ వేడుకకు ఆహ్వానించగానే తన కార్యక్రమాలను పక్కకు పెట్టి తన అమ్యూలమైన సమయాన్ని కేటాయించి వచ్చారు`` అన్నారు
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అడ్వైజర్ పసుపులేటి రామారావు మాట్లాడుతూ - ``నేను 45 ఏళ్ళుగా సినీ జర్నలిస్టుగానే ఉన్నాను. జర్నలిస్ట్ హెల్త్ కార్డులు, అక్రిడేషన్స్, స్థలాలు ఇస్తే బావుంటుందని మంత్రిగారిని కోరుతున్నాం`` అన్నారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ - ``సినిమా ఇండస్ట్రీకి జర్నలిస్టులెంతో కీలకం. సినిమా రంగం అభివృద్ధిలో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టులకు ప్రభుత్వం తరపునుండి అందే ప్రోత్సాహకాలను అందేలా చర్యలు చేపడతాం. జర్నలిస్టులకు ప్రభుత్వం 100 కోట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తప్పకుండా సీనియర్ జర్నలిస్టులు పించన్లు, కల్యాణ్ లక్ష్మి పథకం అమలు అయ్యేలా, అక్రిడేషన్, హెల్త్‌కార్డులు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులందరూ కూర్చొని మాట్లాడుకుని ఒక సీనియారిటీ లిస్టును తయారు చేస్తాం. అలాగే థియేటర్స్ సమస్యను పరిష్కరించడానికి ఐదో ఆటను ప్రదర్శించేలా చర్యలు చేపడుతున్నాం. తప్పకుండా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం`` అన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ పాల్గొన్నారు.