నందమూరి బాలకృష్ణ హీరోగా, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రతిష్టాత్మకమైన బాలకృష్ణ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలుగా జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా రూపొందుతోంది. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 12న విడుదల చేయనున్నారు. సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని ఆల్ ఇండియా ఎన్.బి.కె.ఫ్యాన్స్ భారతదేశంలో 1116 శివాలయాల్లో మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ మహారుద్రాభిషేక కార్యక్రమం సోమవారం ఫిలింనగర్ దైవసన్నిధానమ్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్; చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్, నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా....
దర్శకుడు జాగర్లమూడి క్రిష్ మాట్లాడుతూ - ``శక పురుషుడు, తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పిన శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణిపై జీవిత చరిత్రపై సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. 33 భాగాలుగా ఉన్న భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించిన తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆయన వల్లనే తెలుగువారు ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. శాతకర్ణి తల్లి గౌతమి కరీంనగర్‌లోని కోటిలింగాల ప్రాంతాలోనే జన్మించారు. శాతకర్ణి అమరావతిని రాజధానిగా చేసుకుని పరిపాలనా కొనసాగించారు. ఇలాంటి గొప్ప చరిత్రను బాలకృష్ణ వందో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ కోసం ఆల్ ఇండియా ఎన్.బి.కె.ఫ్యాన్స్ మహారుద్రాభిషేకం కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉంది. సినిమాను డిస్ట్రిబ్యూటర్స్, ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. సినిమా ఆడియో విడుదలను డిసెంబర్ 16న తిరుపతిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే సినిమాను జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. సీజీ వర్క్ జరుగుతుంది. సీజీ వర్క్ మొదటి వెర్షన్ పూర్తయ్యింది. మొరాకోలో షూటింగ్ పూర్తి కాగానే జూన్, జూలైలోనే సీజీ వర్క్‌స్టార్ట్ చేశాం. డిసెంబర్ చివరి వారంలో సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోనున్నాం. సినిమా వ్యవథి రెండు గంటల పన్నెండు నిమిషాలుంటుంది. అలాగే ఈ సినిమాను 79 రోజుల్లో చిత్రీకరించాం. బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఎగ్జయిటింగ్‌గా సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్‌గారు ఎన్నో గొప్ప పాత్రలు వేసినా గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రను బాలకృష్ణగారి కోసం చేయనట్టున్నారు. బాలకృష్ణగారు తప్ప మరెవరూ ఈ పాత్రను చేయలేరు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా ఆశలు, ఆశయాలతో చేసిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం`` అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడతూ - ``గౌతమిపుత్ర శాతకర్ణి విజయవంతం కోసం నందమూరి అభిమానులు ఫిలిం దైవ సన్నిధానంలో మహారుద్రాభిషేకం చేయడం ఆనందంగా ఉంది. ఈ బృహత్ కార్యక్రమం ఇలా చేయడం దైవ సంకల్పంగా భావిస్తున్నాం. తెలుగు ప్రజల గొప్పతనాన్ని తెలియజేసిన చక్రవర్తి గౌతమిపుత్రుని గురించిన చరిత్ర అతి తక్కువగా ఉంది. అటువంటి చరిత్రను సినిమా తెరకెక్కించడానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారు కరీంనగర్ జిల్లాలో కోటిలింగాలప్రాంతంలో జన్మించారు. ఆమె తనయుడైన శాతకర్ణి భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంగా పాలించారు. అలా మనకు ఓ వారసత్వాన్నిచ్చిన వీర గాథ గౌతమిపుత్ర శాతకర్ణి. నందమూరి వారసుడిగా ఇంత గొప్ప సినిమాను చేయడం నా అదృష్టంగా, దైవేచ్చగా భావిస్తున్నాను. సినిమాను దర్శకుడు క్రిష్ మొరాకో, జార్జియా, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. నటీనటుందరి వద్ద దర్శకుడు మంచి నటనను రాబట్టుకున్నారు. డిసెంబర్ 16న ఆడియో విడుదల చేస్తున్నాం. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి`` అన్నారు.
ఆల్ ఇండియా ఎన్.బి.కె.ఫ్యాన్స్ ప్రతినిధి సతీష్ మాట్లాడుతూ - మా నందమూరి బాలకృష్ణగారు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పెద్ద విజయం సాధించాలని మేం నిర్వహించిన మహారుద్రాభిషేక కార్యక్రమానికి సపోర్ట్‌చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.