సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రై.లి బ్యానర్‌పై సప్తగిరి, రోషిణి ప్రకాష్ హీరో హీరోయిన్లుగా అరుణ్ పవార్ దర్శకత్వంలో డా.కె.రవికిరణ్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్'. ఈ సినిమా బ్యానర్‌లోగో, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేర్లపాక గాందీ విడుదల చేశారు. ఈ సందర్భంగా...
మేర్లపాక గాంధీ మాట్లాడుతూ - ''సప్తగిరితో నా జర్నీ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా సమయంలో ప్రారంభం అయ్యింది. తనతో జర్నీ చాలా బావుంటుంది. నా సక్సెస్‌లో తను కూడా ఒక భాగమని నేను అనుకుంటాను. ఈ సినిమాతో సప్తగిరి హీరో కావడం ఆనందంగా ఉంది. సినిమా చేసిన దర్శక నిర్మాతలకు,ఎంటైర్ టీంకు అభినందనలు'' అన్నారు.
మారుతి మాట్లాడుతూ - ''సప్తగిరిని హీరోగ చేయమని చాలా మంది అప్రోచ్ అయ్యేవారు కానీ తన రేంజ్ ఏంటో తనకు బాగా తెలుసు. అందుకే తను ఎప్పుడూ తొందరపడలేదు. మంచి కథ, టీం కోసం వెయిట్ చేసి ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. తిరుడన్-పోలీస్ అనే తమిళ సినిమా మూలకథను తీసుకుని మన తెలుగు నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెలుగులో తీశారు. అరుణ్ విజువల్‌గా మంచి బలం ఉన్న దర్శకుడు. సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. టీం అందరికీ అభినందనలు'' అన్నారు.
సప్తగిరి మాట్లాడుతూ - ''కమెడియన్‌గా ఉన్న నేను ఈ సినిమాతో హీరోగా మారాను. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నన్ను నమ్మి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ప్రేమకథా చిత్రమ్ తర్వాత నేను నటుడిగా చాలా బిజీగా మారాను. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నాను. చాలా మందులు వాడినా తగ్గలేదు. అప్పుడెవరో నాకు హోమియోపతి మెడిసిన్ వాడమని చెప్పమన్నారు. దాంతో నేను మాస్టర్స్ హోమియోపతి నిర్వహిస్తున్న రవికిరణ్‌గారి వద్దకెళ్ళాను. ఆయన నా సమస్యను ఐదురోజుల్లోనే పూర్తి చేసేశారు. తర్వాత నేను చేయబోయే సినిమా గురించి తెలుసుకుని పూర్తిస్థాయిలో సినిమాను రిచ్‌గా తీద్దామని చెప్పి నాకు అండగా నిలబడతానని మాటిచ్చి ఈసినిమాతో నిర్మాతగా మారారు. ఈ సినిమాకు బుల్‌గానిన్ అద్భుతమైన సంగీతాన్నందించారు. సినిమా విడుదల తర్వాత బుల్‌గానిన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకుంటాడు. తమిళ సినిమా తిరుడన్ పోలీస్ సినిమా చూసి నచ్చడంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవంతో ఆ సినిమాకు నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను. ఈ సినిమాను, నన్ను ఎవరు హ్యాండిల్ చేస్తారోనని ఆలోచించాను. అప్పుడు నాకు తోచిన పేరు అరుణ్ పవార్. ఈ సినిమాను అరుణ్ చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమా చూసిన తర్వాత అరుణ్ మంచి డైరెక్టర్ అని ప్రేక్షకులే అనుకుంటారు. తనకు ఈ బ్యానర్‌లోనే నెక్ట్స్ మూవీకి దర్శకుడిగా అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు. హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ సినిమాను తీశామని చెప్పగలను'' అన్నారు.
దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ - ''మాస్ ఆడియెన్స్ పల్స్ తెలిసిన నటుడు సప్తగిరిగారు. ఏ సీన్ ఎలా చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. నన్ను పిలిచి దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చారు. సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అందులో ఒకరు సప్తగిరి గారు అయితే మరొకరు సినిమాటోగ్రాఫర్ రాంస్రాద్‌గారు. ఆయన తన అనుభవంతో ఒక సీన్‌ను నేను చేయాలనుకన్న దానికంటే ఎంతో అద్భుతంగా ఎలా చేయాలో చెప్పేవారు. ఇలా ఒక హిట్ సినిమాకు దర్శకత్వం చేసే అవకాశమే కాదు, దర్శకత్వంలో మెళుకువలు కూడా నేర్చుకున్నాను. అలాగే ఈ సినిమాకు రవికిరణ్‌గారి రూపంలో బెస్ట్ ప్రొడ్యూసర్‌గారు దొరికారు. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్'' అన్నారు.
నిర్మాత డా.కె.రవికిరణ్ మాట్లాడుతూ - ''నేను ఇప్పుడు డాక్టరు అయినా చిన్నప్పట్నుంచి సినిమాలంటే మంచి ఆసక్తి. సినిమా ఎలా ఉండాలనే దానిపై మిత్రులతో చర్చిస్తుండేవాడిని. డాక్టరుగా మారిన తర్వాత బిజీ అయిపోయాను. సప్తగిరిగారు కలిసిన తర్వాత నేను నిర్మాతగా మారాను. తమిళ సినిమాను తెలుగు నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి తండ్రి కొడుకుల మధ్య అనుబంధం, పోలీస్ వ్యవస్థకు కొన్ని విషయాలను ఈ సినిమాలో చూపిస్తున్నాం. సినిమా ప్రేమికుడుగా సినిమా ఎలా ఉండాలో అని ముందు డిస్కస్ చేసేవాడిని అయితే ఓ సినిమా కోసం 24 శాఖలకు చెందినవారు ఎంతకష్టపడతారో నాకు తెలిసింది. ఈ సినిమాలో ఎక్కడా అశ్లీలత కనపడదు. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది'' అన్నారు.
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ సి.రాంప్రసాద్, అజయ్‌ఘోష్ తదితరులు పాల్గొన్నారు.