భీమవారం టాకీస్ పతాకంఫై ప్రొడక్షన్ నెం 90గా పూర్ణ. గీతాంజలి హీరోయిన్లుగా కే.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బళ్ళా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్ "అవంతిక". ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 21న ప్రముఖ దర్శకులు డా. దాసరి నారాయణరావు చేతుల మీదుగా.. పలువురు చిత్ర ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్ణ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి .దాసరి క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "మా భీమవారం టాకీస్ సంస్థలో నిర్మాణమవుతున్న 90వ చిత్రమిది. గురువుగారు దాసరి నారాయణరావుగారి క్లాప్ తో ఈ సినిమా ప్రారంభం కావడం చాల ఆనందంగా వుంది. దర్శకుడు శ్ర్రీ రాజ్ బళ్ళా మీద పూర్తి నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. పూర్ణ నటించిన "అవును, రాజుగారి గది" సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆ కోవలో ఈ "అవంతిక" కూడా పూర్ణతో పాటు మా సంస్థకి కూడా చాలా మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది. కథ మీద నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా భారీగా ఈ సినిమాని మా సంస్థలో నిర్మిస్తున్నాం. 34 రోజుల పాటు చేసే షెడ్యూలుతో షూటింగ్ పూర్తి చేసి.. ఆ తర్వాత 40 రోజులు చేసే పోస్టుప్రొడక్షన్ తో.. సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
చిత్రదర్శకుడు శ్రీ రాజ్ బళ్ళా మాట్లాడుతూ.. "నా మీద నమ్మకంతో దర్శకుడిగా నాకింత మంచి అవకాశం ఇచ్చిన రామ సత్యనారాయణగారికి కృతఙ్ఞతలు. ఈ సినిమా కథ చెప్పగానే నచ్చి ఒకే చేసారు. "అవంతిక" రోల్ కి పూర్ణ హండ్రెడ్ పర్సెంట్ యాప్ట్. ఈ సినిమాలో ఫొటోగ్రఫీకి చాలా ప్రాధాన్యత ఉంది. కర్ణ ఫోటోగ్రఫి ఈ సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా ఉంటుంది. దేవుడికి "బలులు" అర్పిస్తే మంచి జరుగుతుందనే మూఢనమ్మకం పూర్వకాలం నుండి ఉంది. దాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని హారర్ నేపథ్యంలో.. సమాజంలో జరుగుతున్న ఓ బర్నింగ్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కుతుంది. మంచి కాస్టింగ్ తో అద్భుతమైన టెక్నిషియన్స్ తో రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నేను దర్శకత్వం వహించడం ఆనందంగా ఉంది" అన్నారు.
హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ .. "నా కెరీర్ లో టైటిల్ రోల్ లో నటిస్తున్న రెండవ సినిమా ఇది. నా సినిమా దాసరిగారి చేతుల మీదుగా ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఈ "అవంతిక"ను అందరు అనుష్క "అరుంధతి"తో పోల్చడం నా అదృష్టం. తప్పకుండా నా కెరీర్ కు మరో మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది" అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్, రేలంగి నరసింహారావు, సమర్పకుడు కె.ఆర్.ఫణిరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధీరజ అప్పాజీ, హీరోయిన్ గీతాంజలి, కెమెరామెన్ కర్ణ ప్యారసాని మరియి చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.