శ్రీలక్ష్మి నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కృష్ణచైతన్య, భానుచందర్, భానుప్రియ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న కొత్త చిత్రం శనివారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కొరటమద్ది దేవి సమర్పణలో కె.ఎల్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రవికిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి భానుచందర్ క్లాప్ కొట్టగా, సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. దేవీప్రసాద్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా....
భానుచందర్ మాట్లాడుతూ - ``నా రియల్ లైఫ్‌కు బాగా దగ్గరైన సినిమా. సాధారణంగా ఇప్పటి యువత చదువుకోమని పంపితే, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారు. అలా డ్రగ్స్‌కు బానిసైన యువకుడిని ఓ గురువు ఎలా దారిలో పెట్టాడనే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. నేను కూడా చిన్నప్పుడు డ్రగ్స్‌కు బానిస అయితే మా అన్నగారు నన్ను మార్షల్ ఆర్ట్స్‌లో జాయిన్ చేశారు. దాంతో నేను డ్రగ్స్‌కు దూరమయ్యాను. ఈ సినిమాలో మంచి గురువు పాత్రలో కనపడతాను`` అన్నారు.
దర్శకుడు రవికిరణ్ మాట్లాడుతూ - ``ముందు స్టూడెంట్ నెం.1 అనే టైటిల్ పెట్టడానికి ఆలోచించాం. అయితే కథకు యాప్ట్ అయ్యే టైటిల్ కావడంతో ఈ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథాంశం ఉంటుంది. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. హీరో తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ భానుప్రియగారు నటిస్తున్నారు. ఈ నెల 28 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సింగిల్ షెడ్యూల్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం. జనవరికంతా సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నాం`` అన్నారు.
నిర్మాత కె.ఎల్.యన్.ప్రసాద్ మాట్లాడుతూ - ``దర్శకుడు రవికిరణ్ చెప్పిన కథ నచ్చింది. ఇప్పటి యువతలో డ్రగ్స్‌కు బానిసవుతున్న వారి గురించి ఈ కథాంశం ఉంటుంది. మంచి టీంతో చేస్తున్నాం. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
హీరో కృష్ణచైతన్య మాట్లాడుతూ - ``నేను ఎన్టీఆర్‌గారికి పెద్ద అభిమానిని. నేను హీరోగా చేస్తున్న సినిమాకు ఆయన టైటిల్‌ను పెట్టడం ఆనందంగా ఉంది`` అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.