ఓకే బంగారం విజయం తర్వాత దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో `100 డేస్ ఆఫ్ లవ్` విడుదల చేస్తున్నారు. ఎస్ ఎస్ సీ మూవీస్ సమర్ఫణలో ఎస్. వెంకట్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ రెండు రాష్ట్రాల్లోనూ ఆగస్ట్ 26న విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో....
కాళీ సుధీర్ మాట్లాడుతూ - ''బ్యూటీఫుల్, ఫెంటాస్టిక్ లవ్‌స్టోరీ. దుల్కర్, నిత్యామీనన్‌లు ఈ జనరేషన్‌లో బెస్ట్ పెయిర్‌గా అలరిస్తున్నారు. సినిమాను ఆగస్ట్ 26న విడుదల చేస్తున్నాం. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను విడుదల చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. అలాగే సునీల్‌నారంగ్, సుధాకర్ రెడ్డిగారు సినిమా విడుదలకు ఎంతగానో సహాయం చేశారు, వారికి స్పెషల్ థాంక్స్. సినిమా చూసిన యువతులు దుల్కర్ వంటి బాయ్‌ఫ్రెండ్ కావాలని, యువకులు నిత్యామీనన్ వంటి గర్ల్‌ఫ్రెండ్ కావాలని అనుకుంటారు. ఇందులో హీరో దుల్కర్ పేరు రావుగోపాలరావు, నిత్యామీనన్ పేరు సావిత్రి. అందరినీ అలరించే క్యూట్ లవ్‌స్టోరీ అవుతుంది'' అన్నారు.
వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ - ''ఈ సినిమాతో వెంకట్ నిర్మాతగా మారినందకు ఆనందంగా ఉంది. సినిమా పెద్ద సక్సెస్ అయ్యి తను పెద్ద నిర్మాతగా ఎదగాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
నిర్మాత ఎస్.వెంకటరత్నం మాట్లాడుతూ - ''మేనేజర్‌ను అయిన నేను ఈరోజు నిర్మాతగా మారడానికి కారణం నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్‌లే కారణం. వారికి నా థాంక్స్'' అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ - ''ఓకే బంగారం ప్రమోషన్స్ తర్వాత హైదరాబాద్ సిటీకి రావడం ఇది రెండోసారి. ఇక్కడ చాలా మంచి వాతావరణం కనపడుతుంది. ఉస్తాద్ హోటల్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. అలాగే ఓకే బంగారం చిత్రాన్ని కూడా పెద్ద సక్సెస్ చేశారు. నేను, నిత్యామీనన్ కలిసి చేసిన మరో సినిమా ఇది. ఆగస్ట్ 26న విడుదలవుతున్న ఈ చిత్రం ఇంటెన్సివ్ మూవీలా కాకుండా ఎంటర్‌టైనింగ్ సాగుతూ అందరికీ నచ్చే చిత్రమవుతుంది'' అన్నారు.
నిత్యామీనన్ మాట్లాడుతూ - ''ఉస్తాద్ హోటల్ వంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత నేను, దుల్కర్‌లు ఓకే బంగారంలో నటించాం. ఆ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడు మా కాంబినేషన్‌లో తెలుగులో వస్తున్న మూడో సినిమా. మలయాళంలో సినిమా హిట్ అయిన తర్వాత వెంకట్ తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసుకుంటానని అన్నారు. నేను సరే అన్నాను. ఓకే బంగారం ఇన్‌టెన్‌సివ్ లవ్‌స్టోరీ అయితే ఇది కామెడి ఎంటర్‌టైనర్. ఇందులో రావుగోపాలరావు, సావిత్రి, గుమ్మడి వంటి పేర్లుతోనే పాత్రలు కనపడతాయి. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఈ సినిమా కోసం తెలుగులో హృదయం కన్నుల్లో..అనే పాటను కూడా పాడాను కూడా. ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు విడుదల చేస్తున్నారు. అందుకు వారికి థాంక్స్'' అన్నారు.