పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. చదలవాడ పద్మావతి నిర్మించిన హెడ్ కానిస్టేబుల్ చిత్రంసెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
చిత్ర దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - సినిమా రిలీజ్ వరకు నేను మాట్లాడకూడదని అనుకున్నాను. రిలీజ్ తర్వాతే మాట్లాడతానని అన్నాను.ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను బావుండాలి, అందరూ బావుండాలనుకునేవాడు ఉత్తముడు అయితే, నేను మాత్రం బావుండాలనుకునేవాడిని కూడా సరే అనుకోవచ్చు. కానీ నేను మాత్రమే బావుండాలి. నా చుట్టు పక్కల వారు ఏమైనా పర్లేదు అనుకునేవాడిని ఏమనాలి. ఇప్పుడు చిన్న సినిమాల విషయంలో మనం అలాంటి పరిస్థితులనే చూస్తున్నాం. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకని దౌర్భాగ్యం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ఈ సినిమా విడుదలకు నైజాంలో 23 థియేటర్స్ దొరికాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క థియేటర్ కూడా దొరకలేదు. స్క్రీన్‌పై కాకుండా అనుకున్న సమయంలో, చెప్పిన సమయంలో సినిమాను విడుదల చేసిన నేను రియల్‌హీరోగా ఫీలవుతున్నాను. నాకు పెద్ద హీరోలతో సినిమాలు తీసే సత్తా ఉన్నా, నేను చిన్న సినిమాలనే తీయాలనుకుంటాను. కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నప్పుడు అక్కడ షూటింగ్ చేయడానికి అందరూ భయపడుతుంటే, మేం మా యూనిట్‌తో వెళ్లి అక్కడ రోజ్ గార్డెన్ అనే సినిమాను పూర్తి చేశాం. నలభై ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతూ వస్తున్నాను. నా లాంటి నిర్మాతల సినిమాలకే థియేటర్స్ దొరకకపోతే ఎలా. ఫిలించాంబర్ సహా అందరూ చిన్న సినిమాలకు థియటర్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలి`` అన్నారు.
పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ``నేను ముప్పై ఏళ్లుగా సినిమాలు తీస్తూ వస్తున్నాను. పదిహేనేళ్లుగా అనేక గాయాలతో ఈ సినిమా సాగరాన్ని ఎదురీదుతూ వస్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య విషయానికి వస్తే, సాధారణంగా నా సినిమా అంటే మినిమమ్ బడ్జెట్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేలా ఉంటాయి. అయితే చదలవాడ శ్రీనివాసరావుగారు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. నిజాయితీ గల వ్యక్తిని ఆర్ధిక బంధాలు ఎలా డామినేట్ చేశాయి. అయినా ఆ వ్యక్తి ఎలా ఎదిరించి నిలిచాడనే పాయింట్‌తో ఈ సినిమాను చదలవాడశ శ్రీనివాసరావుగారు చక్కగా తెరకెక్కించారు. ఆంధ్రకు వెళ్లినప్పుడు రాజమండ్రిలో కొందరు మిత్రులు నన్ను కలిసి సినిమా టాక్ బావుందన్నా కానీ థియేటర్స్‌లో సినిమా లేని కారణంగా సినిమా చూడలేదని అనడం నన్నెంతో బాధకు గురి చేసింది. హెడ్ కానిస్టేబుల్ సినిమా ప్రారంభం రోజునే నిర్మాతగారు సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తానని అన్నారు. అలా ఆయన అనడం ఆయన తప్పా.. చిన్న సినిమాలకు థియేటర్స్ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ నిర్ణయం తీసుకుంటేనే చిన్న సినిమాలు బ్రతుకుతాయి. సంక్రాంతి బరిలోకి వచ్చిన కొన్ని సినిమాలకే థియేటర్స్‌ను కేటాయించకుండా, అన్నీ సినిమాలకు న్యాయం జరిగేలా చూడాలి`` అన్నారు.
చలపతిరావు మాట్లాడుతూ - ``ఈ సంక్రాంతి అంటే కోళ్ళ పందేలు గుర్తుకు వస్తాయి. అలా ఈ సంక్రాంతికి విడుదలైన నాలుగు పందెం కోళ్ల వంటి సినిమాల్లో మా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా ఒకటి. సినిమాలోనారాయణమూర్తిగారు కొత్తగా కనిపించారు. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి ఇంకా పెద్ద విజయాన్ని సాధించాలి. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్`` అన్నారు.
జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ - ``సినిమాలో ఇప్పటి వరకు నారాయణమూర్తి కనిపించని విధంగా, కొత్త క్యారెక్టర్‌లో చేయడం బావుంది. చదలవాడగారు దర్శకుడుగా తనెంటో ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధించాలి`` అన్నారు.
టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ - ``సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ఖైదీలో చిరంజీవిగారు రైతు దళారి సమస్యను పొగొట్టాలని పోరాటం చేశారు కానీ నిజానికి చిన్న సినిమాల విషయంలో వారే దళారిల్లాగా వ్యవహరించి చిన్న సినిమాలకు థియేటర్స్ దొరక్కుండా చేస్తున్నారు. చిన్న సినిమాలకు థియేటర్స్ విషయంలో అందరూ న్యాయం జరిగేలా చూడాలి`` అన్నారు.
ఈ కార్యక్రమంలో అజయ్, సంగిశెట్టి దశరథ్ సహా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.