పీపుల్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, సహజ నటి జయసుధ జంటగా నటించిన చిత్రం `హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య`. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. చదలవాడ పద్మావతి నిర్మించిన హెడ్ కానిస్టేబుల్ చిత్రంసెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో....
చిత్ర దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ - ``నాకు ఊహ తెలిసినప్పటి నుంచి 50 ఏళ్లుగా సంక్రాంతి పండుగను చూస్తున్నాను. ఇండస్ట్రీలో సంక్రాంతి అంటే క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈసారి సంక్రాంతికి చరిత్రలో ఇప్పటి వరకు చూడని పోటీ ఏర్పడింది. కోడి పందెల కన్నా ఎక్కువు ఆసక్తి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల పై చూపిస్తున్నారు. పోటీ ఉండాలి... పోటీ ఉంటేనే క్వాలిటీ బాగుంటుంది. ఈ సంక్రాంతికి మా సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య రిలీజ్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నాం`` అన్నారు.
డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ- ``చదలవాడ శ్రీనివాసరావు డైరెక్షన్ కి కొత్త అయినప్పటికీ ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ సినిమాని రూపొందించారు. నారాయణమూర్తిని కొత్తగా చూపించారు. కొత్త డైరెక్టర్ సీనియర్ ఆర్టిస్ట్ ను కొత్తగా చూపిండం అంటే మామూలు విషయం కాదు.ఈ సినిమా కథ విషయానికి వస్తే....డబ్బు అనేదే లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అనేది చూపించాం. ఈ కథను ఇప్పుడు అనుకుని రాసుకుంది కాదు. ఎప్పుడో రాసుకున్న కథ ప్రజెంట్ సిట్యువేషన్ కి కరెక్ట్ గా సరిపోతుంది. ఏదైనా మెసెజ్ ను ఫ్యామిలీ డ్రామాతో కలిపి చెబితే జనాల్లోకి వెళుతుంది. 100% ఈ సినిమా హిట్ అవుతుంది. చిన్న సినిమాలకు ధియేటర్ల దొరకని పరిస్థితి. అందుచేత చిన్న నిర్మాతలను చంపేసేంత పోటీ కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. సినీ పెద్దలు థియేటర్ల సమస్య గురించి పరిష్కారం చూపిస్తే బాగుంటుంది`` అన్నారు.
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ - ``నాకు ఒక గొప్ప పాత్రను చేసే అవకాశం ఇచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. నేను 30 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. మా గురించి సినిమా తీయండి అని పోలీసులు అడుగుతుండేవారు. నాకు పోలీసులు అంటే కోపం లేదు. నా కోపం అంతా వ్యవస్ధ మీదే అని చెప్పేవాడిని. మానవ విలువలను ఆర్ధిక విలువలు డామినేట్ చేస్తున్నాయి. ఈ దశలో డబ్బు లేకుండానే చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన మా డైరెక్టర్ చదలవాడ శ్రీనివాసరావు చెప్పారు. పాయింట్ నచ్చడం...దీనికి తోడు చదలవాడ శ్రీనివాసరావు గారితో ఎప్పటి నుంచో అనుబంధం ఉండడం వలన ఈ సినిమా చేసాను. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నా పై ఇంత ఖర్చు పెడుతున్నారు ఏమిటి అంటే బడ్జెట్ గురించి మీరు ఆలోచించకండి అనేవారు. సావిత్రి గారు తర్వాత నేను అభిమానించే హీరోయిన్ సహజ నటి జయసుధ. ఎంతగానో సహకరించి ఈ చిత్రంలో నటించిన జయసుధ గార్కి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే...ఫస్ట్ టైమ్ నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే...మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ మధ్యలో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్లతో నాకు పోటీ లేదు. అయితే...నా సినిమాకి ఒక థియేటర్ కూడా దొరకని పరిస్థితి. ఒక థియేటర్ కూడా దొరకడం లేదు అంటే ఏడుపు వస్తుంది. కొంత మంది చేతుల్లో థియేటర్స్ ఉండడడం వలన ఇలాంటి పరిస్థితి వచ్చింది. చిన్న సినిమాకి ధియేటర్స్ దొరకకపోవడం అంటే దుర్మార్గం చర్య. చిన్న సినిమాలకు థియేటర్స్ లభించేలా చూడాల్సిన బాధ్యత ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, గవర్నమెంట్ పై ఉంది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవడం కోసం ఒకే సినిమాని అన్ని థియేటర్స్ లో వేస్తున్నారు. చిన్న సినిమాలు పండగ లేనప్పుడు, పెద్ద సినిమాలు లేనప్పుడు రిలీజ్ చేయాలా..? సక్సెస్ ఫెయిల్యూర్ అనేది జనం నిర్ణయిస్తారు. ఇండస్ట్రీ ఏ ఒక్కరిదో కాదు.. అందరిది. చిన్న సినిమాలకు న్యాయం చేయమని కోరుతున్నాను`` అన్నారు.