23 February 2017
                            Hyderabad
                          ఎమ్.ఎస్.ఆర్. ప్రొడక్షన్స్ పతాకంపై విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్ర ఆధారంగా మరో చిత్రం తెరకెక్కనుంది. మంచాల సాయిసుధాకర్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'రణరంగం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మంచాల సాయిసుధాకర్ మాట్లాడుతూ..'ప్రజల అభిష్టం మేరకు ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. విజయవాడలోని ఒక ప్రజానాయకుడి జీవిత చరిత్రను, ఆయన గొప్పతనాన్ని ఈ చిత్రంలో చూపనున్నాం. ఈ చిత్రం పేరు 'రణరంగం'. ఈ చిత్రం షూటింగ్‌ని ఆంధ్రా, తెలంగాణలతో పాటు విదేశాల్లో కూడా షూటింగ్ జరపనున్నాం. దీనికి కారణం ఏమిటంటే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆ అభిమానుల కోరిక మేరకే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాము. అలాగే ఈ చిత్రంలోని ఒక ప్రత్యేకమైన గీతాన్ని విజయవాడలో వేలాదిమంది అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నాము. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులను, సాంకేతిక నిపుణులను విజయవాడ సభలో వెల్లడించనున్నాము..అని అన్నారు. 
                          రైటర్ మరుధూరి రాజా మాట్లాడుతూ..'నాకు 14 యేట నుండి పేపరు చదివే అలవాటుంది. అప్పటి విజయవాడ రాజకీయ నేపథ్యాన్ని ఆకలింపు చేసుకుని, సినిమాగా రాయాలని అనుకున్నాను. విజయవాడ, అనంతపురం రాజకీయ నేపథ్యాలతో నా ఆధ్వర్యంలో ఓ సినిమా ఉండాలని కోరిక ఉండేది. అది ఇన్నాళ్లకు నెరవేరబోతుంది...అని అన్నారు. 
                          ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు జితేందర్, సంగీత దర్శకుడు ఆర్.బి. షా తదితరులు పాల్గొన్నారు.