30 January 2017
                            Hyderabad
                          అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టిస్తూ.. అత్యంత జుగుప్సాకరమైన కధ, కథనాలు, రోత పుట్టించే సన్నివేశాలతో కూడిన సినిమాలకు "క్లీన్ సర్టిఫికెట్స్" జారీ చేసే సెన్సార్ బోర్డ్.. 
                          యువతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్ టైనర్ గా.. ఎంతో నిబద్ధతతో.. నిజాయితీతో రూపొందించిన తమ "శరణం గచ్ఛామి" సినిమాకు మోకాలడ్డుతుండడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోందని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్.
                          సహేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని.. సెన్సార్ బోర్డ్ పక్షపాత ధోరణిని, ఒంటెత్తు పోకడలను ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
                          తమ వాదనలో నిజముందని.. తమకు జరుగుతున్నది కచ్చితంగా అన్యాయమేనని భావిస్తే.. మీడియా మిత్రులు తమకు చేయూతనందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
                          బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్వతహా ఎన్. ఆర్.ఐ అయిన బొమ్మకు మురళి.. ఈ చిత్రానికి తనే స్వయంగా కథ-స్క్రీన్ ప్లే అందించారు. 
                          నవీన్ సంజయ్, తనిష్క్ తివారి, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్ రెడ్డి, కాశీ విశ్వనాధ్, సుధ, సత్యకృష్ణ, దేశపతి శ్రీనివాస్, సుబ్బారాయశర్మ, మరియు బి.సి. సంఘ నాయకులు-శాసనసభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి.. సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సామి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, సంగీతం: రవి కళ్యాణ్, సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ-జర్నలిస్ట్ సతీష్ చంద్ర, సమర్పణ: బొమ్మకు హిమమాల మురళి,  స్టోరీ-స్క్రీన్ ప్లే- ప్రొడ్యూసర్: బొమ్మకు మురళి, డైలాగ్స్ & డైరెక్షన్: ప్రేమ్ రాజ్ !
                          
                          