నారా రోహిత్, శ్రీ విష్ణు నటించిన `అప్పట్లో ఒకడుండేవాడు` సినిమా సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో గురువారం ఉదయం జరిగింది. నారా రోహిత్ సమర్పించారు. అరన్ మీడియా పతాకంపై రూపొందించారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మాతలు. సాయికార్తిక్ సంగీతాన్ని సమకూర్చారు.
దాసరి నారాయణరావు మాట్లాడుతూ ``5-10 శాతం తప్ప మిగిలిన సినిమాలన్నిటినీ నేను చూస్తుంటాను. అప్‌డేట్ అయ్యే ప్రాసెస్‌లో ఇదీ ఒక భాగం.గత రెండేళ్ల క్రితం తెలుగు సినిమా పరిస్థితి చూసి జాలిపడ్డాను. చాలా దిగజారుడుగా అనిపించింది. కానీ ఇప్పుడు చాలా బావుంది. చిన్న సినిమాలే పరిశ్రమకు ఊపిరి. చిన్న సినిమా అనేది తల్లిగర్భం లాంటిది. నాకు రోహిత్ చిన్నప్పటి నుంచి తెలుసు. మంచి కథలతో ముందుకెళ్తున్నాడు. శ్రీవిష్ణు చాలా చక్కగా చేశాడు. ఇలాంటి సినిమాలకు మీడియా సపోర్ట్ చేయడం ఆనందంగా ఉంది. అయితే అక్కడ కూడా ఒకటీ రెండు చీడపురుగులు ఉన్నాయి. డబ్బుల కోసం రేటింగులతో బ్లాక్ మెయిల్ చేయడం సరికాదు. అలా చేస్తూ పోతే ఎవరూ ఎంతో కాలం భరించరు. రేటింగుల మీద చాలా మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్నప్పుడు బాధ్యతతో రాయాలి. ఓవర్సీస్‌లో వీటి ప్రభావం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. ఈ విషయాలను నేను సదుద్దేశంతోనే అంటున్నాను. గుడ్ ఫిల్మ్ ప్రమోటర్స్ అని త్వరలోనే ఓ ఆరుగురితో టీమ్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను`` అని అన్నారు.
నారా రోహిత్ మాట్లాడుతూ ``ఈ సినిమా జర్నీ నాకు చాలా మెమరబుల్. శ్రీ విష్ణు బాణం నుంచి నాతోనే ఉన్నాడు. ఈ కథను తను నాకన్నా బాగా నమ్మాడు. మా నమ్మకం నిజమైంది. జనవరి 6న విడుదల చేస్తే మాకు కేవలం 5 రోజులే ఉంటాయని ముందుగానే విడుదల చేశాం. కంటెంట్ ను నమ్ముకుని అలా చేశాం. ప్రపంచవ్యాప్తంగా మరో 100 థియేటర్లను పెంచుతున్నాం. 2016లో హిట్లూ, ఫ్లాప్‌లూ, యావరేజ్‌లు ఉన్నాయి. అయతే ఈ చిత్రం మెమరబుల్‌గా ఉంది`` అని చెప్పారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ ``చిన్న చిత్రంగా మొదలుపెట్టాం. తక్కువ థియేటర్లలో విడుదల చేశాం. ఈ వారం నుంచి థియేటర్లు పెరుగుతున్నాయి`` అని అన్నారు.
నిర్మాత విజయ్ మాట్లాడుతూ ``ముందు డిసెంబర్ 30న వద్దనుకున్నాం. కానీ ధైర్యం చేసి రిలీజ్ చేశాం. ఇప్పుడు థియేటర్లు రెట్టింపు కావడం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
దర్శకుడు సాగర్ చంద్ర మాట్లాడుతూ ``ఈ సక్సెస్‌ని మర్చిపోలేను రోహిత్‌గారిని మర్చిపోలేను. శ్రీవిష్ణు అన్ని ఎమోషన్స్ ని పండించారు. ఆయనతో చేస్తుంటే రాజేంద్రప్రసాద్‌గారితో చేసిన ఫీలింగ్ వచ్చింది`` అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు రాజీవ్ కనకాల, ప్రశాంతి, రవివర్మ, నవీన్ యాదవ్, సురేశ్ బొబ్బిలి, గిరి, శశాంక్ మౌళి, డీఎంకే, ఎంవీకేరెడ్డి తదితరులు పాల్గొన్నారు.