రానా, తాప్సీ, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్, పివిపి సినిమా సంయుక్తంగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందిన `ఘాజీ` తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదలయింది. ఈ సందర్భంగా పోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
రానా మాట్లాడుతూ ``ఈ సినిమా చాలా కొత్త అటెంప్ట్. వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. ఈ సినిమాకు ఘాజీ అని పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. మనలో చాలా మందికి ఆ ఘటన గురించి తెలియదు. నెట్‌లో చూసి కొందరిని అడిగినప్పుడు ఘాజీ అనే పేరును గుర్తుపట్టారు. కనీసం వాళ్లకైనా తెలిసేలా పేరు పెట్టాలని ఈ చిత్రానికి ఘాజీ అని పేరు పెట్టాం. మా దర్శకుడు తాను నమ్మిన కథను చెప్పడానికి సిద్ధమయ్యాడు. ప్రతిరోజూ సెట్లో కేకేమీనన్‌గారి దగ్గర చాలా నేర్చుకునేవాడిని. అతుల్‌గారిని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆయన జుట్టు రంగు మారిందే తప్ప మనిషి ఏమీ మారలేదు`` అని అన్నారు.
అతుల్ కులకర్ణి మాట్లాడుతూ ``ఘాజీ చాలా బాగా కుదిరింది. ఇలాంటి చిత్రాలు తీయడం కష్టం. కానీ ఈ నిర్మాతలు ధైర్యం చేసి తీశారు. మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరించేవారు ఈ సినిమాను కూడా ఆదరించినందుకు ఆనందంగా ఉంది. భారతీయ సినిమాకు తెలుగు సినిమా అంటే ఇది అని సగర్వంగా చెప్పుకోదగ్గ చిత్రమవుతుంది`` అని తెలిపారు.
పీవీపీ మాట్లాడుతూ ``తెలుగు సినిమా చరిత్రలో రాజీలేనిపేజీ ఘాజీ అని అందరూ పొగుడుతుంటే ఆనందంగా ఉంది. మా దర్శకుడితో ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాను విడుదల చేయడానికి ముందు ప్రతి ఒక్కరం ఒకటికి నాలుగు సార్లు చూసుకుని విడుదల చేశాం. ప్రేక్షకులు ఆదరించారు`` అని చెప్పారు.
సంకల్ప్ మాట్లాడుతూ ``మా సినిమాకు అందరూ చాలా మంచి రివ్యూలు ఇచ్చారు. నన్ను ఆదరించినవారందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో భవిష్యత్తులో మరింత బాధ్యతతో పనిచేస్తాను`` అని చెప్పారు.