27 January 2017
Hyderabad
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం 'శతమానం భవతి'. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు తనతో తొలి చిత్రం దిల్‌ను డైరెక్ట్ చేసిన వినాయక్‌కు ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సన్మానం చేయించారు. అలాగే దిల్‌రాజు తల్లిదండ్రులను వేదికపై సన్మానించారు. ఈ కార్యక్రమంలో అహోబిల రామాను జీయ్యర్ స్వామి, దేవనాథ రామానుజ స్వామి, చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, ప్రకాష్‌రాజ్, జయసుధ, డా.రవీందర్‌రెడ్డి, తనికెళ్ళభరణి, సిజ్జు, మిక్కి జె.మేయర్, ఇంద్రజ, సమీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా....
'శతమానం భవతి' చాలా మందికి కనువిప్పు కలిగించే చిత్రం
అహోబిల జీయ్యర్ స్వామి మాట్లాడుతూ - టైటిల్ వింటేనే వేదనాదంను విన్నట్టే ఉంది. ఎక్కడో అమెరికాలో దూరంగా ఉంటున్నా, కనీసం తల్లిదండ్రుల కోసం డాలర్స్‌నైనా పంపిస్తున్నారు. కానీ ఇక్కడే ఉంటూ తల్లిదండ్రులను పట్టించుకోనివారు ఉన్నారు. ఎక్కడో అమెరికాలో ఉండేవారికి కాదు, ఇక్కడుండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్చేవారికి కనువిప్పు కలిగించాలని చేసిన సినిమా ఇది. పుట్టిన వ్యక్తి తన ఊరు పట్ల, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో చెప్పిన చిత్రమిది'' అన్నారు.
శర్వానంద్‌కు 'శతమానం భవతి' సక్సెస్..నా బిడ్డకు దక్కిన సక్సెస్‌గా భావిస్తున్నాను
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ''దిల్‌రాజుకు దిల్ అనే పేరుని ఏ ముహుర్తాన ఆయన పేరు ముందు చేర్చారో కానీ అదే తన ఇంటి పేరు, వంటి పేరు అయిపోయి ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. దిల్ అనే పేరులో ఉన్నట్టే దిల్‌రాజు దమ్మున్న, ఆరోగ్యకరమైన, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను, అందరూ ఆలోచించే సినిమాలు తీస్తున్నాడు. ఒక సినిమాకు దర్శక నిర్మాతలు తల్లిదండ్రులతో సమానం. కానీ ఈరోజుల్లో నిర్మాతలంటే క్యాషియర్‌తో సమానమైపోతున్నాడు. అటువంటి ఈరోజుల్లో కథను నమ్మి, అందుకు తగిన విధంగా ఆర్టిస్టులను, టెక్నిషియన్స్‌ను ఎంపిక చేసుకుని ముందుడి నడిపిస్తున్న దిల్‌రాజు నిర్మాతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు.
అందుకనే ఈ తరం హీరోలందరూ దిల్‌రాజు బ్యానర్‌లో సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిని కనపరుస్తుంటారు. మా రాంచరణ్ కూడా దిల్‌రాజుగారి బ్యానర్‌లో చేయాలని అనుకుంటూ ఉంటాడు. తను సినిమా ప్రారంభం నుండి ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకుంటాడు. సినిమా సక్సెస్ కావడానికి తపన పడుతూ ఉంటాడు. అలాగే దిల్‌రాజు సెంటిమెంట్స్ ఉన్న వ్యక్తి. రాజు దిల్‌కు రెండు వైపులా పదునుంది. ఒకవైపు అగ్రెసివ్‌గా ముందుకెళ్ళగలడు. అలాగే మంచి హృదయంతో మంచి సినిమాలు చేస్తున్నాడు. అందుకే తన తొలి సినిమాకు అన్నీ విభాగాల్లో సపోర్ట్ చేసిన దిల్‌రాజు తన మూలాలను మరచిపోలేదు.
వినాయక్ ఎక్కడా ఆధిపత్యాన్ని కనపరచకుండా తనకు కావాల్సిన వర్క్‌ను రాబట్టుకుంటూ ఉంటారు. అందుకే అప్పట్లో నిర్మాతలైన దిల్‌రాజుకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. అప్పటి దిల్ నుండి నేటి ఖైదీ నంబర్ 150 వరకు వినాయక్ ప్రవర్తనలో ఏ మార్పు లేదు. శతమానం భవతి సినిమా ఓ మంచి వెజిటేరియన్ భోజనం చేసినట్టు ఉంది. సాధారణంగా మనం ప్రొఫెషన్ దృష్ట్యా మన తల్లిదండ్రులు, ఫ్యామిలీ గురించి పెద్దగా పట్టించుకోం. అటువంటి వారికి ఇదొక హెచ్చరికలాంటి సినిమా. ఇలాంటి సినిమా చాలా మందికి మోటివేట్ సినిమా. నా ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుక రోజున ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే సినిమా అద్భుతంగా ఆడుతుంది.
యూనిట్‌కు అభినందనలు. చూడాలని ఉంది సినిమా టైంలోనే ప్రకాష్‌రాజ్ సామాన్యుడు కాదు అని చెప్పాను. తన ప్రతిభకు ఎల్లలు లేవు. ఏ పాత్రనైనా చెడుగుడు అడగల నటుడు. అతిశయోక్తి అనుకోకపోతే..రంగారావుగారి తర్వాత నేటి తరంలో అంత గొప్ప పత్రిభా పాటవాలున్న నటుడు ప్రకాష్‌రాజ్ అని నా మనసులో అనుకుంటూ ఉంటాను. అనిపిస్తూ ఉంటుంది. ప్రకాష్‌రాజ్ సమకాలీన నటులమని మనం గర్వంగా చెప్పుకునేంత గొప్ప నటుడు ప్రకాష్‌రాజ్. అలాగే జయసుధగారు ద్రవం వంటి వ్యక్తి. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోతారు. చాలా మందిని ఎడ్యుకేట్ చేసే హెచ్చరిక లాంటి సినిమాను డైరెక్ట్ చేసిన సతీష్‌ను అభినందిస్తున్నాను. మిక్కిజె.మేయర్, సమీర్‌రెడ్డి, తనికెళ్ళభరణి సహా అందరికీ అభినందనలు.
శర్వానంద్ మా ఇంట్లోనే మా చరణ్‌తో పాటు పెరిగాడు. చరణ్‌కు తను మంచి స్నేహితుడు. చాలా సౌమ్యుడు. తను హీరో మెటీరియల్ అయినా తనకి సినిమాలంటే ఆసక్తి ఉందో లేదో అనుకునేవాడిని. తనకు సినిమాలపై ఆసక్తి ఉందని నాకు చెప్పింది మా చరణే. ముందు శర్వా కెమెరా ఫేస్ చేసింది నాతోనే..అయితే అది సినిమాలో కాదు, తను థమ్స్ అప్ యాడ్‌లో నాతో పాటు కలిసి నటించాడు. అలాగే తర్వాత తను ఐదో తారీఖు అనే సినిమా చేస్తున్నప్పుడు కూడా నన్ను కలిసి నా ఆశీర్వాదం తీసుకున్నాడు. చాలా హెల్దీ రొమాంటిక్ క్యారెక్టర్‌ను శతమానం భవతిలో చేశాడు. తనకు దక్కిన ఈ విజయం నా బిడ్డకు దక్కిన విజయంగా భావిస్తున్నాను. ఈ సక్సెస్‌ను అన్నకు లక్ష్మణుడిలా వెనుక ఉన్న శిరీష్‌ను కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను'' అన్నారు.
అమ్మానాన్నలందరికీ 'శతమానం భవతి చిత్రం' అంకితం
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ''సతీష్ నాకు కథ చెప్పగానే దాన్ని నేను సినిమాగా కాకుండా లైఫ్‌గా చూశాను. మాతో సహా అందరి జీవితాలు అందులో కనపడ్డాయి. కథ విన్నప్పుడు నచ్చి సినిమాను టేకాఫ్ చేశాను. మొదటి నుండి ఈ సినిమా టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాలకు కొత్త ఒరవడి అవుతుందనిపించింది. అంతకు ముందు బొమ్మరిల్లుతో ఎలాగైతే కొత్త ఒరవడి మొదలైందో అలాంటి ఒరవడి మొదలవుతుందని ఆకాంక్ష ఉండేది. అది ఈరోజు నేరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. రెండు వారాలైనా ఈ సినిమాను తెలుగుప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఓసారి వినాయక్ మా గుడికి వచ్చినప్పుడు అక్కడి స్వాములు ఆశీర్వదిస్తూ శతమానం భవతి అన్నారు. అప్పుడే నాకు ఈ టైటిల్ తగిలి, దాని గురించి వినాయక్‌కు అప్పుడే చెప్పాను. ఈ కార్యక్రమం సక్సెస్ మీట్ మాత్రమే కాదు, మా కుటుండబానికి, మా శతమానం భవతి చిత్రయూనిట్ , మా బ్యానర్ సెలబ్రేట్ చేసుకునే ఫంక్షన్.
ఎక్కడో పల్లెటూర్లో పుట్టి పెరిగిన మేం 1987-88 బ్రతకడానికి హైదరాబాద్ వచ్చేశాం. అప్పట్లో నాకు కానీ, శిరీష్‌కు కానీ సినిమాలంటే పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అయినా మాకు తెలియకుండానే మా విలేజ్‌లో సింహాపురి సింహం సినిమాను 16 ఎం.ఎంలో ప్రదర్శించాం. అప్పట్లో సినిమాలంటే కూడా పెద్ద అవగాహన ఉండేది కాదు. శిరీష్ టికెట్స్ అమ్మితే, నేను గేట్ దగ్గర నిలబడి అందరినీ లోపలికి పంపాను. ఆ రోజులు నాకు గుర్తుకు వస్తున్నాయి. తర్వాత హైదరాబాద్ రావడం, తర్వాత ఆటోమొబైల్స్ బిజినెస్ స్టార్ట్ చేసి అక్కడ సక్సెస్ అయ్యి, మహేందర్‌రెడ్డిగారితో సినిమా ఫీల్డ్‌లోకి వచ్చాం.
వినాయక్ డైరెక్ట్ చేసిన ఆది సినిమాకు డిస్ట్రిబ్యూటర్స్‌గా ప్రారంభం అయిన మేం అప్పట్లో ప్రసాద్‌ల్యాబ్స్‌లోనే దిల్ సినిమాకు సంబంధించి దర్శకుడు వినాయక్‌కు నెక్ట్స్ సినిమా చేయాలని మూడు లక్షల మూడు వేల రూపాయల చెక్‌ను అడ్వాన్స్‌గా ఇచ్చాం.
తను కొత్త నిర్మాతలమైన మమ్మల్ని నమ్మి సినిమాలో పూర్తిగా ఇన్‌వాల్వ్ చేశాడు. ఒక నిర్మాతలుగా మాకేంతో విలువిచ్చి మొదటి సినిమాకు మేం ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకునేలా చేసింది వినాయక్. ఆ సినిమాతో దిల్ అనే టైటిల్‌ను ఇంటిపేరుగా చేసేశాడు. అమ్మ నాన్నలు జన్మనిస్తే, ఈరోజు సంస్థను ఇక్కడ వరకు తీసుకొచ్చి, మొదటి సక్సెస్‌నిచ్చిన వినాయక్‌కు ఎంత చేసిన తక్కువే. మా సినిమా జనవరి 14న రిలీజైంది. చిరంజీవిగారి సినిమా జనవరి 11న విడుదలై సెన్సేషనల్ హిట్ సాధించింది. ఈ శతమానం భవతి సినిమా రెండు పెద్ద సినిమాల మధ్య పోటీగా విడుదలైంది. విడుదలైన రోజు పెద్దగా టాక్ రాలేదు. ఒకరిద్దరూ తప్ప నాకెవరూ ఫోన్ చేయలేదు.
సినిమా రిలీజ్ అయిన మూడవ రోజు నాకొక కాల్ వచ్చింది. నేను ముందు రిసీవ్ చేసుకోలేదు. తర్వాత కాల్ చేస్తే నేను చిరంజీవిని మాట్లాడుతున్నాను..అని చెప్పి, సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. తన సినిమాతో పాటు విడుదలైన చిన్న సినిమాను సపోర్ట్ చేసినందుకు చిరంజీవిగారికి థాంక్స్. దిల్ నుండి శతమానం భవతి వరకు ఎంతో మంది నటీనటులను, టెక్నిషియన్స్‌ను, 8 మంది కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాం. ఈ శతమానం భవతి చిత్రం అమ్మనాన్నలందరికీ అంకితం.
పరుగు సినిమా టైంలోనే చిరంజీవిగారు మా సంస్థకు రామానాయుడుగారి సంస్థతో, చక్రపాణి, నాగిరెడ్డిగారి సంస్థకు పేరు పెట్టారు. ఆ పేరుని నిలబెట్టడానికి ప్రతి సినిమాను కొత్తగా తీయడానికే ప్రయత్నిస్తాం. అందరి ఆశీస్సులతో ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తామని తెలియజేస్తున్నాం'' అన్నారు.
Glam gallery from the event |
|
|
|
కల నిజమైన రోజు..నిజం కలలాగా అనిపిస్తున్న రోజుది
దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ - ''నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, రైటర్‌గా జన్మనిచ్చిన ముప్పలనేని శివగారికి, దర్శకుడుగా పునర్జన్మనిచ్చిన దిల్‌రాజు, శిరీష్‌గారికి థాంక్స్. ఈరోజు కల నిజమైన రోజు, నిజం కలగా అనిపించే రోజు. ఈ రెండు ఒకేరోజు ఈరోజు కావడం ఎంతో ఆనందంగా ఉంది. రైటర్‌గా వచ్చి, దర్శకుడుగా మారిన కల ఈరోజు నిజమైతే. ఖైదీ సినిమా సమయంలో ఆ సినిమాను తణుకులో ఎన్ని సార్లు చూశానో తెలియదు. అదే చిరంజీవిగారి 150వ సినిమా ఖైదీ నంబర్ 150వ సినిమా విడుదలైన సందర్భంలో నేను డైరెక్ట్ చేసిన సినిమా రిలీజై, చిరంజీవిగారు మా సినిమాను అభినందించడానికి ఇంత దూరం రావడం మరో నిజమైన కలలాగా ఉంది. ఈ రోజు నా జీవితంలో మరచిపోలేను. ఈ సినిమా సక్సెస్‌కు కారణం పిల్లలపై ప్రేమ ఉన్న తల్లిదండ్రులు, అలాగే తల్లిదండ్రులపై గౌరవమున్న పిల్లలదే. ఈ సక్సెస్ మాకు గౌరవాన్నిచ్చింది. ఈ సినిమా చేయడానికి కారణమైన దిల్‌రాజు, శిరీష్‌గారికి థాంక్స్'' అన్నారు.
ఆరోజు దిల్‌రాజులో నాకు నిజాయితీ కనపడింది
డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - ''శతమానం భవతి రిలీజైన తర్వాత ఓరోజు దిల్‌రాజు ఫోన్ చేసి మా సంస్థలో పనిచేసిన దర్శకులందరికీ సన్మానం చేయాలనుకుంటున్నానని అన్నారు. బావుంటుంది..చేయండి అని అన్నాను. కానీ ఈరోజు ఇక్కడకు వచ్చిన తర్వాత అన్నయ్యను చూపించి సన్మానం అంటున్నారు. అన్నయ్య చిరంజీవిగారి ముందు కూర్చొని సన్మానం చేసుకునేంతవాడిని కాను. దిల్‌రాజుగారు నాపై చూపించిన ప్రేమ నాకు చాలు. అప్పుడెప్పుడో జరిగిన ప్రతి చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని దిల్‌రాజుగారు ఈరోజు మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాతో పాటు ట్రావెల్ చేస్తూ, సినిమా గురించి, అందులోని తప్పొప్పుల గురించి మాట్లాడే నిర్మాతలంటే నాకెంతో ఇష్టం. అలా నిజాయితీగా ఉండే నిర్మాతలను నాతో పాటు ట్రావెల్ చేయిస్తుంటాను. ఆ నిజాయితీ ఆరోజు నాకు దిల్‌రాజులో కనపడింది. నేను ఎప్పుడైతే కొత్త కథలు విన్నప్పుడు రాజు దగ్గరకు పంపితే కథ విని అవకాశాలు ఇస్తుంటాడు. ఈ బ్యానర్‌లో వచ్చిన బొమ్మరిల్లు కంటే శతమానం భవతి చిత్రాన్ని ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇంకా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. చరణ్ హృదయానికి దగ్గరైన స్నేహితుడు శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రకాష్ అన్నయ్య క్షమించాలి..ఎందుకంటే, ఈ సినిమా ప్రారంభంలో కథను నాకు వినిపించి ముసలి జంటగా ఎవరైతే బావుంటుందని దిల్‌రాజు నన్ను అడిగితే నేను రాఘవేంద్రరావుగారి పేరుని సూచించాను. మరి రాఘవేంద్రరావుగారేమన్నారో నాకు తెలియదు. అలాగే ఇండస్ట్రీలో శర్వానంద్ అంటే అందరికీ ఇష్టం. తనకు హిట్ రాగానే అందరూ ఆనందపడ్డట్టే చిరంజీవిగారు కూడా ఆనందపడ్డారు. చరణ్‌కు హిట్ వచ్చినట్టే ఆనందపడ్డారు. చరణ్ హృదయానికి దగ్గరైన స్నేహితుడు శర్వానంద్. తనకిది సూపర్‌సక్సెస్ మూవీ. అనుపమ, ఇంద్రజ, సమీర్‌రెడ్డి, మిక్కి జె.మేయర్ అందరికీ అభినందనలు. రాజుగారి బానర్‌లో ఇలాంటి సినిమాలు ఇంకెన్నో రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
జయసుధ మాట్లాడుతూ - ''ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ చాలా సంవత్సరాలు తర్వాత ఆడియెన్స్ రిపీటెడ్‌గా చూస్తున్న చిత్రం శతమానం భవతి'' అన్నారు.
ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ - ''ఈ సినిమా సక్సెస్‌కు కారణం దిల్‌రాజు, సతీష్‌ల నమ్మకమే కారణం. నిజాయితీతో మంచి సినిమాను చేస్తే ప్రేక్షకులు ఎలాంటి సక్సెస్‌ను అందిస్తారోనని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. దిల్‌రాజుతో చాలా కాలంగా ట్రావెల్ అవుతున్నాను. నా కెరీర్‌లో ఖడ్గం, అంత:పురం, ఒక్కడు సహా చాలా మంచి చిత్రాలున్నాయి. వాటిలాగానే శతమానం భవతి సినిమా నా కెరీర్‌లో నిలిచిపోయే చిత్రమవుతుంది'' అన్నారు.
హీరో శర్వానంద్ మాట్లాడుతూ - ''నేను హీరో అవుతాననగానే నా తల్లిదండ్రులు నన్నెంతో సపోర్ట్ చేశారు. నా ఫ్యామిలీ సభ్యులు కూడా నాకెంతో అండగా నిలబడ్డారు. నాకు అండగా నిలబడ్డారు. నాకు ఇంట్రస్ట్ ఉన్నదే చేయమని ప్రోత్సహించారు. నా జీవితంలో మరచిపోలేని రోజుది. అంతా ఒక కలలాగా ఉంది. అన్నింటికీ మంచి నేను అభిమానించిన హీరో చిరంజీవిగారితో ఉండే అవకాశం, ఆయన నన్ను ఈరోజు విష్ చేయడం మరచిపోలేను. ఆయన ఇచ్చిన ఎంకరేజ్ మెంట్ లైఫ్‌లో మరచిపోలేను. హీరో అవుతానని ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిరంజీవిగారు నాకు రెండు సక్సెస్ మంత్రాలు చెప్పారు. దర్శక నిర్మాతల నుండి లైట్‌బాయ్ వరకు అందరినీ ఒకేలా చూడు అని చెప్పిన వ్యక్తి చిరంజీవిగారు. నేను ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాను. శంకర్‌దాదా ఎంబిబిఎస్‌లో దర్శక నిర్మాతలకు నాకు చాన్స్ ఇప్పించారు. నేను నిర్మాతలను కలిశాను కానీ కాల్ రాలేదు. రెండు నెలలు అయిపోయాయి. సరే చాన్స్ పోయిందనుకున్నాను. కానీ రెండు నెలలు తర్వాత నిర్మాతలు కాల్ చేసి అడిగారు. నేను జరిగింది చెప్పాను. చిరంజీవిగారు ఈ అబ్బాయికి ఈ క్యారెక్టర్ చెప్పాను. ఆ క్యారెక్టర్‌కు ఆ అబ్బాయే కరెక్ట్ అని నాకు ఆ క్యారెక్టర్‌ను ఇప్పించారు చిరంజీవిగారు. అదే మెగాస్టార్ చిరంజీవి అంటే...నేను థాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నాదేముందిరా..నీ సంకల్పం గొప్పది. సంకల్పం గొప్పదైనప్పుడు దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడని చెప్పారు. అదెప్పుడూ మరచిపోను. శతమానంభవతి సినిమా విషయానికి వస్తే.. శతమానం భవతి సక్సెస్ చూస్తుంటే లోపల నుండి హిట్ కొట్టాలనే ఎంకరేజ్‌మెంట్ మరచిపోలేను. మాటల్లో చెప్పలేని అనుభూతి. చాలా మందికి తెలియదు..శతమానం భవతి నా 25వ సినిమా. నా 25వ సినిమా ఆడియో అతిథిగా చిరంజీవిగారిని పిలవాలనే కోరిక ఉండేది.
ఆ కోరిక ఈరోజు ఇలా తీరింది. సతీష్‌గారు కథ చెప్పడానికి ముందు ఫ్యామిలీ చిత్రం ఏం చేస్తాననుకున్నాను. అయితే కథ వినగానే రాజుగారికి ఫోన్ చేసి అన్నా..ఎంత మంచి కథను రాయించారన్నా అని అన్నాను. నాలుగు నెలల్లో ఒక కలలాగా సినిమా పూర్తయిపోయింది. సమీర్‌రెడ్డిగారు, మిక్కి జె.మేయర్, సిజ్జుగారు, జయసుధగారు, ప్రకాష్‌రాజుగారు సహా అందరికీ థాంక్స్. నా అన్నీ కోరికలను ఓకే సినిమాలో నేరవేర్చిన దిల్‌రాజన్న, శిరీష్ అన్నకు థాంక్స్. తెలుగు ప్రేక్షకులు మా సినిమాను తమ సినిమాగా చేసుకుని పెద్ద సక్సెస్‌నిచ్చారు. నా జీవితంలో ఆనందకరమైన రోజు ఇది'' అన్నారు.