కాకినాడ అమ్మాయి ప్రేమలో పడిన కరీంనగర్ కుర్రాడి కథగా రూపొందిన "జయమ్ము నిశ్చయమ్ము రా".. "కాకినాడ సుబ్బయ్య హోటల్ భోజనం లాంటి, కరీంనగర్ గీతాభవన్ లాంటి మంచి సినిమా" అని దర్శకులుగా మారిన ప్రముఖ యువ రచయితలు బి.వి.ఎస్.రవి, రాజసింహ అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా ఎస్.ఆర్.ఎఫ్ పతాకంపై సతీష్ కనుమూరితో కలిసి స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మించిన "జయమ్ము నిశ్చయమ్ము రా" నవంబర్ 25న విడుదలై విశేష స్పందనతో విజయపధంలో పయనిస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, హైద్రాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో చిత్ర బృందం విజయోత్సవం నిర్వహించింది.
బి.వి.ఎస్.రవి, రాజసింహ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న ఈ వేడుకలో- హీరోహీరోయిన్లు శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ, శివరాజ్ కనుమూరి, సతీష్ కనుమూరి, చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన కృష్ణభగవాన్, రవివర్మ, కృష్ణుడు, మీనా, ఈ చిత్రంలో "ఓ రంగుల చిలుక" పాటను ఆలపించిన వర్ధమాన గాయని స్పందన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన కార్తీక్ రోడ్రిగిజ్, గుర్రం రామకృష్ణ, సుబ్బరాజు తదితరులు పాలుపంచుకొన్నారు.
"జయమ్ము నిశ్చయమ్ము రా" లాంటి గొప్ప సినిమాలో హీరోగా నటించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని శ్రీనివాస్ రెడ్డి పేర్కొనగా.. మణిరత్నం వంటి గొప్ప దర్శకుడిగా శివరాజ్ ఎదుగుతాడని పూర్ణ అభిప్రాయపడింది.
Poorna Glam gallery from the event
కిటికీలోంచి ఓ మున్సిపల్ ఆఫీసును చూస్తున్న అనుభూతిని కలిగించే సినిమాగా "జయమ్ము నిశ్చయమ్ము రా" చిత్రాన్ని కృష్ణభగవాన్ అభివర్ణించారు. చాలా గ్యాప్ తర్వాత ఈ చిత్రంలో తను పోషించిన "అడపా ప్రసాద్" పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందని తెలుపుతూ దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరికి కృతజ్ణతలు తెలిపారు.
కెరీర్ బిగినింగ్ లోనే "జయమ్ము నిశ్చయమ్ము రా" వంటి అద్భుతమైన సినిమాకు ఆర్.ఆర్ చేసే అవకాశం రావడం పట్ల కార్తీక్ రోడ్రిగిజ్ ఆనందం వ్యక్తం చేశారు.
శివరాజ్ ఓ తపస్సులా ఈ సినిమాను తెరకెక్కించారని, ప్రతి క్యారెక్టర్ ను మైన్యూట్ డీటైల్స్ తో బ్యూటీఫుల్ గా డిజైన్ చేశారని కృష్ణుడు, రవివర్మ అన్నారు.
చిన్న సినిమాగా విడుదలైన "జయమ్ము నిశ్చయమ్ము రా" చాలా పెద్ద విజయం సాధించే దిశగా పయనిస్తుండడం చాలా సంతోషాన్నిస్తోందని, శివరాజ్ ను చూసి తాను ఎంతో గర్వపడుతున్నానని చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు అన్నారు.
ఈ ఘన విజయానికి కారకులైన తన కుటుంబ సభ్యులకు, టీమ్ మెంబర్స్ కు, మీడియాకు కృతజ్ణతలు తెలిపిన శివరాజ్ కనుమూరి- సర్వమంగళం అనే పిరికివాడు క్రమంగా ధైర్యాన్ని కూడగట్టుకొని సర్వేష్ గా రూపాంతరం చెందడాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తుండడం తనకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోందని అన్నారు. స్క్రీన్ ప్లే పరంగా తనకు ఎంతగానో సహకరించిన పరమ్ సూర్యాన్షుకు కృతజ్ణతలు తెలిపారు.
స్పందన "ఓ రంగుల చిలుక" గీతాలాపనతో మొదలైన ఈ వేడుక.. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ ఛలోక్తులతో, చతురోక్తులతో ఆద్యంతం అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. "జయమ్ము నిశ్చయమ్ము రా" చిత్రం తనను ఎంతగానో కదిలించిందని- శివరాజ్ కనుమూరికి తాను అభిమానిగా మారిపోయానని ఝాన్సీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు!