రొమాంటిక్ లవ్ స్టోరీలు.. క్రైమ్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో గౌతమ్‌మీనన్‌ని కొట్టేవాళ్లే లేరు! గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా వస్తోంది అంటే హీరో ఎవరు? అన్నదాంతో సంబంధం లేకుండా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మార్క్ క్లాస్ టచ్.. పోయెటిక్ ఎప్రోచ్‌తో మనసు దోచే స్టైలిష్ ఎంటర్‌టైనర్లు చూడాలన్న క్యూరియాసిటీ జనాల్లో ఉంటుంది. అటు తమిళ్, ఇటు తెలుగు రెండు చోట్లా ఆయనకంటూ ప్రత్యేకించి అభిమానులున్నారు. చెలి, ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాఘవన్, ఏమాయ చేశావే, ఎంతవాడు గానీ, ఎటో వెళ్లిపోయింది మనసు, .. లేటెస్టుగా `సాహసం శ్వాసగా సాగిపో` .. ఇవన్నీ క్లాసిక్ హిట్స్‌గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచాయి.
అంతటి స్టార్ డైరెక్టర్ మెచ్చిన తమిళ చిత్రం `మెట్రో` ఇప్పుడు తెలుగులోనూ అనువాదమై రిలీజవుతోంది. `ప్రేమిస్తే`, `జర్నీ`, `షాపింగ్‌మాల్`, `పిజ్జా` వంటి బ్లాక్ బస్టర్లను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి సమర్పణలో ఆర్-4 ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రజని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. హైదరాబాద్‌లో `మోట్రో` తెలుగు ట్రైలర్‌ని లాంచ్ చేశారు గౌతమ్ మీనన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -``మెట్రో ఫెంటాస్టిక్ మూవీ. తమిళంలో రిలీజైన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. తెలుగులో అంతకుమించిన విజయం సాధిస్తుంది. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన న్యూ ఏజ్ సినిమా. నవతరానికి బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి పనిచేసిన టీమ్‌కి మంచి పేరొచ్చింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- రజనీ తాళ్లూరికి నా బెస్ట్ విషెస్`` అన్నారు.
నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ -``డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి వస్తోంది. గౌతమ్ మీనన్ అంతటి స్టార్ డైరెక్టర్ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసి, సినిమా తెలుగువారికి నచ్చుతుందని ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది`` అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -``ఏ నిర్మాత అయినా.. ఆయన కాల్షీట్లు ఇస్తే తనతో సినిమా తీయాలనుకుంటారు. అంత గొప్ప స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఆయన మెట్రో ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా నాకెంతో నచ్చిన సినిమా అని గౌతమ్ మీనన్ చెప్పారంటే విజయంపై మా నమ్మకం మరింత రెట్టింపైంది. గౌతమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నిర్మించిన `జర్నీ` సినిమాని మించి `మెట్రో` విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా`` అన్నారు.