హాసికాదత్, మధుమిత, రాజీవా, వినయ్, శ్రీమాన్, సిండ్రాయన్ ప్రధాన తారాగణంగా భీమవరం టాకీస్ బ్యానర్‌పై హాసికా దత్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాత రూపొందుతున్న చిత్రం `కాదంబరి ఇంటి నెంబర్ 150`.ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఒక ఏడాదిలో పదమూడు సినిమాలను నిర్మించి రికార్డ్ నెలకొల్పిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణకు భారత వరల్డ్ రికార్డ్స్ ధృవీకరణ పత్రాన్ని కొనిజేటి రోశయ్య చేతుల మీదుగా అందించింది. రోశయ్యను కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సత్కరించారు. ఈ సందర్భంగా....
తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోశయ్య మాట్లాడుతూ - ``నాకు సినిమా రంగంతో పై పై పరిచయాలే తప్ప, లోతుగా సంబంధాలేమీ లేవు. అయితే రామసత్యనారాయణ తక్కువ ఖర్చుతో మంచి సినిమాలు చేసేవాడని నాకు తెలుస్తూ ఉండేది. దాంతో రామసత్యనారాయణ ఏ సినిమా కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పిలిచినా నాకు వీలునప్పుడల్లా వస్తుండేవాడిని. ఇప్పుడు భారత్ వరల్డ్ రికార్డ్స్ వారు రామసత్యనారాయణను సత్కరించడం అభినందనీయం. ఒక ఏడాదిలో పదమూడు సినిమాలు చేయడమంటే చిన్న విషయం కాదు. ఇలాంటి సాహసాలను రామసత్యనారాయణ మరెన్నింటినో చేయాలి, ఇంకా మంచి సినిమాలు నిర్మించి ఉన్నత శిఖరాలను సాధించాలి. కొత్త రికార్డులు నెలకొల్పాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ - ``రోశయ్యగారితో నాకు ఇరవై సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది. నేను రోశయ్యగారిని పెద్దాయన అని పిలుచుకుంటూ ఉంటాను. ఆయనతో ఉన్న అనుబంధంతో నా తొలి చిత్రంతో ఎస్.పి.సింహాతో ప్రారంభమైంది. ఆ సినిమాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు. ఆ అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక ఏడాదిలో ఎవరైనా పన్నెండు సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్ చేస్తారు కాబట్టి, నేను పదమూడు సినిమాలు చేసి రికార్డ్ చేయాలనే ఆలోచనతోనే సినిమాలు చేశాను. ఈ ప్రయాణంలో నాకు కె.వి.వి.సత్యనారాయణగారు సహా పలువురు మిత్రులు అండగా నిలబడ్డారు`` అన్నారు.
Hashika Dutt Glam gallery from the event
సౌతిండియా ఫిలించాంబర్ సెక్రటరీ కాట్రగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ - ``పన్నెండు నెలల్లో పదమూడు సినిమాలు చేయడమంటే చిన్న విషయం కాదనే సంగతి నాకు తెలుసు. నిర్మాతగా రామసత్యనారాయణ కొత్త రికార్డును క్రియేట్ చేశారు. దీనితోనే రామసత్యనారాయణ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించవచ్చు. ఆ దిశగా రామసత్యనారాయణ ప్రయత్నం చేస్తే బావుంటుంది. ఇప్పటికి తొంబై సినిమాలు చేసిన రామసత్యనారాయణ వంద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
శివాజీ రాజా మాట్లాడుతూ - ``తుమ్మలపల్లి రామసత్యనారాయణగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయన బ్యానర్‌లో నేను హీరోగా ఏడెనిమిది సినిమాల్లో యాక్ట్ చేశాను. ఓ పద్ధతి ప్రకారం సినిమాలను నిర్మిస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి రికార్డులను రామసత్యనారాయణగారు మరెన్నింటినో సాధించాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
చిత్ర హీరోయిన్, దర్శకురాలు హాసికాదత్ మాట్లాడుతూ - ``కాదంబరి ఇంటి నెంబర్ 150 చిత్రాన్ని హర్రర్, కామెడి ప్రధానాంశాలుగా తెరకెక్కించాను. ఈ సినిమాతో పాటు నేను తదుపరి సెప్టెంబర్ 5 అనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ఓ టీచర్ వల్ల ఓ గ్రామం ఎలా అభివృద్ధి చెందిందనే కాన్సెప్ట్‌తో సెప్టెంబర్ 5 సినిమా ఉంటుంది. ఈ సినిమాను కూడా రామసత్యనారాయణగారు తెలుగులో విడుదల చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఈ కార్యక్రమంలో మల్కాపురం శివకుమార్, గజల్ శ్రీనివాస్, భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి రమణ, సాయివెంకట్, కవిత, సి.జె.శోభారాణి, తదితరులు పాల్గొని చిత్ర నిర్మాత రామసత్యనారాయణను అభినందించారు.