మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మిస్తున్న చిత్రం `విజేత`. రజని కొర్రపాటి నిర్మాత. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను హైదరాబాద్ జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్‌లో విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖ, ఎస్.ఎస్.రాజమౌళి, అల్లు అరవింద్, ఎం.ఎం.కీరవాణి, సాయికొర్రపాటి, కల్యాణ్ దేవ్, మాళవికా శర్మ, హర్షవర్ధన్ రామేశ్వర్, సెంథిల్‌కుమార్ సహా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఆడియో సీడీలను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేయగా.. తొలి సీడీని ఎం.ఎం.కీరవాణి అందుకున్నారు. ట్రైలర్‌ను ఎస్.ఎస్.రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా..
బివిఎస్ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ - ``సాయికొర్రపాటి వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం తన బ్యానర్ ద్వారా కొత్త దర్శకులను, హీరోలను పరిచయం చేస్తుంటారు. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు అభినందనలు. సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
డా.కె.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ``సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. కల్యాణ్‌దేవ్ సహా ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు`` అన్నారు.
ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ - ``విజేత సూపర్‌డూపర్ హిట్ కావాలి. కల్యాణ్‌దేవ్‌కి మంచి ప్లాట్‌ఫాం దొరికింది. తను చాలా రిస్క్ ఫీల్డ్‌లోకి వచ్చాడు. తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తనకు ఈ సినిమా మంచి సినిమా కావాలి. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే సాయికి ఈ సినిమా మంచి సెన్సేషనల్ హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ - ``అప్పట్లో చిరంజీవిగారు వరుసగా యాక్షన్ సినిమాలే చేస్తుంటే.. విజేత కథను సినిమాగా ఎందుకు తీయాలని జంధ్యాలగారు సహా ఆలోచించారు. కాస్త భయంగానే ఈ సినిమాను చేసి విడుదల చేశాను. ఫ్యామిలీ డ్రామా అని.. నా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ఈ సినిమాను తీసుకోలేదు. కానీ సినిమ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే పేరుతో మన కల్యాణ్ సినిమా చేయడం చాలా సంతోషం. కొత్త టాలెంట్ ఎక్కడున్నా ప్రోత్సాహం అందించే నిర్మాత సాయి కొర్రపాటిగారు ఇండస్ట్రీకి ఎంతో అవసరం. ఇక కల్యాణ్‌దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో వచ్చినా ఓకే ఒక ధైర్యం. వారి వెనుక మెగాభిమానులు ఉన్నారనే. దానికి వారి టాలెంట్‌ను యాడ్ చేసి ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే కల్యాణ్ తన టాలెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వస్తారని భావిస్తున్నాం`` అన్నారు.
మురళీశర్మ మాట్లాడుతూ - ``నా ఫేవరేట్ సబ్జెక్ట్. నా ఫేవరేట్ క్యారెక్టర్. నాకు శ్రీనివాసరావు అనే తండ్రి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు రాకేశ్ శశి, నిర్మాత సాయిగారికి థాంక్స్. ఈ సినిమాలో నా కొడుకుగా నటించిన కల్యాణ్‌కి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. సినిమా చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేశాను`` అన్నారు.
సెంథిల్ కుమార్ మాట్లాడుతూ - ``సంక్రాంతికి రాజమౌళిగారి ఫామ్‌హౌస్‌కి వెళ్లినప్పుడు సాయిగారు నన్ను కలిసి ఇలా ఓ చిన్న సినిమా ఉంది... చేస్తావా? అని అడిగారు. కచ్చితంగా చేస్తాను సార్ అన్నాను. కథ వినగానే వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేశాను. ఈ సినిమాకు పనిచేయడం ఆనందంగా ఉంది. రాకేశ్‌శశి, మురళీశర్మ సహా మంచి టీం పనిచేసింది. కల్యాణ్ చాలా కష్టపడ్డాడు. మెగా అల్లుడు స్టాండ్‌కు తను పక్కాగా సరిపోతాడు. ప్రేక్షకుల ఆశీస్సులతో సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను`` అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ``ట్రైలర్ చాలా బావుంది. రాకేశ్ శశి, సాయిగారికి కంగ్రాట్స్. చిరంజీవిగారు మంచి డాన్సర్, యాక్టర్, ఫైటర్ అనే సంగతి చాలా మందికి తెలుసు. ఇండస్ట్రీకి మాత్రమే తెలిసిన విషయమేమంటే.. ఓ స్టోరీని జడ్జ్ చేయడంలో ఆయన్ను మించినవారు లేరు. స్టోరీ విన్న వెంటనే అందులో లోపాలేంటి? కరెక్షన్స్ ఏంటి? వేటిని హైలైట్ చేయాలి. వేటిని తగ్గించాలని చెప్పడంలో కరెక్ట్‌గా జడ్జ్ చేస్తారు. మగధీర కథ కూడా నేను ముందుగా చిరంజీవిగారికే చెప్పాను. అలాగే ఈ సినిమా కథను కూడా ముందుగా చిరంజీవిగారే విన్నారు. ఆయన కథ ఓకే చేశారంటే చాలా బావుంటుందని మా నమ్మకం. ఓ కంటెంట్ అందరికీ రీచ్ కావాలంటే క్వాలిటీ ఉండాలి. లేకుంటే రీచ్ కావడం కష్టం. సాయిగారు మేకింగ్‌లో కాంప్రమైజ్ కారు. దీన్ని చిన్న సినిమా అన్నారు కానీ.. టెక్నీషియన్స్ పేరు వింటేనే ఇది పెద్ద సినిమా అని అర్థమైంది. కోడి పాటను విన్నాను. ఫెంటాస్టిక్ సాంగ్. పాటలను నచ్చని మా ఆవిడ కూడా పూర్తి పాట విని బావుందని అంది. అలాగే మా అమ్మాయి.. ఇంట్లో వాళ్లందరూ బావుందని అన్నారు. ప్రెజంటేషన్, లైట్ మేకింగ్ కంబైన్డ్ ఎఫర్ట్ అంతా సినిమాలో కనపడుతుంది.
అప్పటి విజేత హిట్టై చిరంజీవిగారికి ఎంత పేరు తెచ్చిందో.. ఈ విజేత హిట్టై కల్యాణ్‌దేవ్‌కి అంతే పేరు తేవాలి. ఆ విజేత హిట్టై అరవింద్‌గారికి ఎంత డబ్బులు వచ్చాయో.. సాయిగారికి కూడా అంతే డబ్బులు రావాలి`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ మాట్లాడుతూ - ``నాకు అవకాశం ఇచ్చిన రాకేశ్ శశి, సాయికొర్రపాటిగారికి, చిరంజీవిగారికి థాంక్స్. ఇక్కడకు విచ్చేసిన అతిథులకు కూడా థాంక్స్. రామజోగయ్యశాస్త్రి, రెహమాన్‌గారు మంచి పాటలను రాశారు. సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్`` అన్నారు.
మాళవికా నాయర్ మాట్లాడుతూ - ``సెంథిల్‌గారు ప్రతి సీన్‌ను ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. యూనిక్ స్టోరీ ఇది. రాకేశ్ శశి విజనే ఈ సినిమా. నెరేట్ చేసే సమయంలో నాకు నా తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కల్యాణ్‌దేవ్ హార్డ్ వర్కర్, హాంబుల్, డౌన్ టు ఎర్త్ పర్సన్`` అన్నారు.
రాకేశ్ శశి మాట్లాడుతూ - ``లాస్ట్ ఇయర్ సాయిగారు నన్ను పిలిచి ఓ సినిమా చేద్దామని అన్నారు. హీరో ఎవరు సార్? అని అంటే మన కథే హీరోను వెతకాలి అంటూ సమాధానమిచ్చారు. కథను తయారు చేశాను. ఆ కథే మెగాస్టార్ ఇంటికి వెళ్లి.. ఆయన అల్లుడిని హీరోగా తీసుకొచ్చింది. అక్కడే మేం నమ్మిన కథ నిజమవుతుంది. సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ మాకు వచ్చింది. చిరంజీవిగారు ముందు కథ చెప్పినప్పుడు నాలో ఎమోషన్స్ నాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆయన కథ విన్నతీరు కానీ.. ఆయన కథను జడ్జ్ చేసి దాంట్లో ఆయన చెప్పిన విషయాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన ఉన్నారనే ధైర్యమే ఇక్కడి వరకు మమ్మల్ని నడిపించింది. ధైర్యంతో పాటు చిన్న భయం కూడా ఉంది. గొప్ప ఫ్యామిలీ నుండి హీరోను పరిచయం చేస్తున్నప్పుడు ఎంత కేర్ తీసుకోవాలనే విషయాన్ని మా యూనిట్ మెంబర్స్ అంతా ఆలోచించి చేశాం. కల్యాణ్‌కి సినిమాలపై ఉన్న ప్యాషన్, ఎనర్జీనీ ఈ సినిమాలో చూస్తారు. కల్యాణ్ రియల్ లైఫ్‌లో ఉన్న క్యారెక్టర్‌కి, సినిమాలో ఉన్న క్యారెక్టర్‌కి చాలా వేరియేషన్ ఉంటుంది. క్యారెక్టర్‌లో ఆయన ఒదిగిపోయారు. అవన్నీ సినిమాలో చూస్తారు. కథను నమ్మి క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. మంచి హీరోను ఈ సినిమాలో చూస్తారు. మాపై నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిన సాయికొర్రపాటిగారికి థాంక్స్`` అన్నారు.
హీరో కల్యాణ్ దేవ్ మాట్లాడుతూ - ``నేను సినిమా గురించి మాట్లాడటం కంటే.. సినిమా చూసి ప్రేక్షకులు చెబితే బావుంటుంది. నేను వైజాగ్ నుండి షూటింగ్ పూర్తి చేసుకుని రాగానే.. ఒక వారంలో డైరెక్టర్ రాకేశ్ శశిగారు కథను చెప్పారు. సాయి కొర్రపాటిగారు నాతో ఈ సినిమా చేయడానికి ముందుకు రావడం ఆనందంగాఉంది. ఆయన ఎంతో మంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందరూ సక్సెస్ అయ్యారు. వారిలాగానే నేను కూడా సక్సెస్ సాదిస్తానని అనుకుంటున్నాను. నాపై నమ్మకంతో నాకు అవకాశాన్ని ఇచ్చిన అందరికీ థాంక్స్. రాకేశ్ శశిగారు ప్రతి ఫ్రేమ్‌ను క్లారిటీతో చేశారు. ఓ బ్రదర్‌లా ఉంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సెంథిల్‌గారు.. చాలా కూలెస్ట్ సినిమాటోగ్రాఫర్. ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం. హర్షవర్ధన్ రామేశ్వర్‌గారు అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. కార్తీక శ్రీనివాసగారు, రామకృష్ణ, మోనిక, రామజోగయ్యశాస్త్రి, రెహమాన్‌గారికి థాంక్స్. మురళీశర్మగారు, తనికెళ్ళభరణిగారితో పనిచేయడం ఫ్రౌడ్‌గా, కంఫర్ట్‌గా ఫీలయ్యాను. ఎన్నో సలహాలు ఇచ్చారు. నా తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. మాళవికా వండర్ ఫుల్ కో స్టార్. టీమ్‌లో ప్రతి ఒక్కరికీ థాంక్స్`` అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - ``మన హృదయాలను గెలుచుకుని చిరంజీవిగారు శాశ్వత విజేతగా నిలిచిపోయిన విధంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఓ విజేత కావాలని కోరకుంటున్నాను. సాయిగారు మా ఫ్యామిలీ మెంబర్. రామేశ్వర్.. అర్జున్ రెడ్డి సినిమాకు పూర్తి మ్యూజిక్‌ను ప్రోగ్రాం చేసింది ఇతనే. తనంటే చాలా ఇష్టం. పాటలు బావున్నాయి. చికెన్ సాంగ్ నాకు చాలా ఇష్టం. యూనిట్ అందరికీ థాంక్స్`` అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - ``విజేత` అనే టైటిల్ పెట్టగానే నాకు నేను చేసిన విజేత సినిమా గుర్తుకు వచ్చింది. కథాంశం పరంగా ఆ సినిమాకు ఈ సినిమాకు చాలా సారూప్యత ఉంది. రాకేశ్ శశి, సాయిగారు వచ్చి కథను వినమని .. కథను చెప్పారు. తొలిసారి వినగానే నాకు ఇంప్రెసివ్‌గా అనిపించింది. చక్కటి మధ్య తరగతి సినిమా. తండ్రి కొడుకుల మధ్య జరిగే సన్నివేశాలు హృద్యంగా ఉన్నాయి. మనస్సును ఆకట్టుకునేలా, అక్కడక్కడా కన్నీళ్లు పెట్టించేలా ఉన్నాయనిపించింది. నేను ఓకే అన్నాను. నేను చేసిన విజేత కూడా తండ్రి కొడుకు మధ్య ఉండే సంఘర్షణ. ఆనాడు మాస్, యాక్షన్ సినిమాలు ఉధృతంగా చేస్తున్న తరుణంలో అరవింద్‌గారు ఈ కథను నాకు వినిపించినప్పుడు కథ నచ్చినా..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారో లేదో నని బెరుకుగా కూడా అనిపించింది. అప్పట్లో కొత్తదనంతో ఓ మంచి ప్రయత్నం చేశామని, మమ్మల్ని ఆశీర్వదించాలని అప్పట్లో అభిమానులను కోరాను. ఆ సినిమా అంతకంతకు పెద్ద హిట్ సాధించింది. ఇప్పుడు ఎలాంటి ఇమేజ్ లేని కల్యాణ్ దేవ్ ఇలాంటి కథతో వస్తుండటం తనకు అభిమానులతో పాటు మంంచి పేరు తెచ్చిపెడుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల మధ్య సంఘర్షణే. సన్నివేశాలు బావున్నాయి. అప్పటి విజేతలా ఈ విజేతలో కూడా రాకేశ్ కంటతడి పెట్టించే సన్నివేశాలను చేశారు. చాలా సార్లు రాకేశ్ మనకు కనిపిస్తాడు.. వావ్ అనిపిస్తాడు. రాకేశ్‌ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఒకప్పుడు నిర్మాతలు సినిమాలో ఇన్‌వాల్వ్ అయ్యేవారు. సినిమాకు తండ్రి లాంటి నిర్మాత పాత్ర రాను రాను క్యాషియర్‌లా తయారైంది. అలాంటి ఈరోజుల్లో.. సాయికొర్రపాటిగారు పూర్తి ఇన్‌వాల్వ్‌మెంట్‌తో సినిమాలో పార్టిసిపేట్ చేశారు. తనలో తాపత్రయం నాకు కనపడింది. ఆయనలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని అందిస్తుంది. ఆ విజేత అరవింద్‌గారికి ఎలాంటి విజయాన్ని అందించిందో .. ఈ విజేత కూడా సాయిగారికి అంతకంతా డబ్బుల తెచ్చిపెట్టాలని కోరకుంటున్నాను. సెంథిల్‌కుమార్‌గారు ఈ సినిమాకు కెమెరామెన్ అని తెలియగానే.. బాహుబలి వంటి సినిమా చేసిన సెంథిల్‌గారు ఈ సినిమాక పనిచేయం గొప్ప సైన్ అని తెలిసింది. పాజిటివ్‌గా అనిపించింది. సినిమాను చాలా చక్కగా చూపించారు. రామేశ్వర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు కూడా చికెన్ సాంగ్ చాలా నచ్చింది. ప్రేమ్‌రక్షిత్ మంచి డాన్స్ కంపోజ్ చేయించాడు. కల్యాణ్ దేవ్.. కెప్టెన్ కిషన్.. బిజినెస్‌మేన్ తనయుడైనా సరే.. బిజినెస్ వైపు ఆసక్తిని చూపకుండా.. తనకు చిన్నప్పట్నుంచి నటనపై ఉన్న ఆసక్తి గురించి నాకు చెప్పాడు. అయతే మనం ఎంత కష్టపడుతున్నాం.. మనమేం ఇస్తున్నాం అని ఆలోచించాలని చెప్పాను. తనకు ముఖవర్చస్సు బావుంది. గ్లామర్ అన్నీ ఉన్నాయి. తనలో జోష్, తపన ఉన్నాయా? లేవా? అనేది కూడా ముఖ్యమేనని చెప్పాను. ట్రైనింగ్ తీసుకుంటే బావుంటుందని చెప్పాను. నా సలహా మేర సత్యానంద్‌గారి వద్ద ట్రైనింగ్ తీసుకున్నాడు. తనలోని లోపాలను కరెక్ట్ చేసుకుని ఎమోషనల్ సీన్స్‌లో పరిణితి చెందిన నటుడిగా కల్యాణ్ నటించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. శభాష్ అనిపించాడు. డాన్స్‌లో బాగా రాణించాడు. రాకేశ్ డైరెక్టర్‌గా కల్యాణ్ నుండి మంచి నటనను రాబట్టుకున్నాడు. మాళవికా ఇన్‌టెన్స్‌తో నటించింది. తనకు అభినందనలు. మురళీశర్మగారు తండ్రి పాత్రలో ఒదిగిపోయి అత్యద్భుతంగా నటించారు. అలాగే నా మిత్రుడు నాజర్‌గారు సినిమాలో మంచి పాత్ర చేశారు. అలాగే తనికెళ్ళభరణిగారు కూడా మంచి పాత్ర చేశారు. ఇంత మంది నటులతో కల్యాణ్ చేయడం లక్కీ. జూలై 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ చిత్రం జూన్ 6న విడుదలవుతుంది. అదే డేట్‌కి ఈ సినిమా విడుదలవుతుందా? అనే చిన్న టెన్షన్ ఉండేది. అయితే సాయికొర్రపాటిగారు అనవసరమైన పోటీ ఉండకూడదని ఈ సినిమాను జూలై 12న విడుదల చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆ సినిమాతో పాటు ఈ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని.. ప్రేక్షకులు, అభిమానులు నిండు మనసుతో ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను`` అన్నారు.