pizza
Devadas music party function
'దేవదాస్‌' మ్యూజిక్‌ పార్టీ
You are at idlebrain.com > News > Functions
Follow Us


20 September 2018
Hyderabad

కింగ్‌ నాగార్జున, నేచరల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో వయాకామ్‌ 18 మోషన్‌ పిక్యర్స్‌, వైౖజయంతీ మూవీస్‌ బ్యానర్స్‌పై శ్రీరామ్‌ ఆదిత్య దర్శత్వంలో మెగా మూవీ మేకర్‌ అశ్వినీదత్‌ చలసాని నిర్మించిన బిగ్‌ బడ్జెట్‌ మల్టీస్టారర్‌ 'దేవదాస్‌'. నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ సినిమా మ్యూజిక్‌ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా..

రఘురామరాజు మాట్లాడుతూ - ''అక్కినేనిగారి 'దేవదాసు' ఇండియాలో విడుదలైన అన్ని దేవదాసు చిత్రాలను తలదన్నింది. దాన్ని ఈ 'దేవదాస్‌' తలదన్నదు కానీ.. జూనియర్‌ దేవ, దాసులు ఆ రేంజ్‌ను చేరుకుంటారని భావిస్తున్నాను. నా ప్రియమిత్రుడు అశ్వినీదత్‌గారు మధ్యలో చిన్న గ్యాప్‌ తీసుకున్నా 'మహానటి'తో బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అయ్యారు. ఇప్పుడు 'దేవదాస్‌' మరోసారి మన ముందుకు వస్తున్నారు. తప్పకుండా సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని భావిస్తున్నాను'' అన్నారు.

కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''నాకు దాదాపు 40 సంవత్సరాల నుండి సెప్టెంబర్‌ 20 అంటే పండగరోజు. ఎక్కడున్నా.. నేను కచ్చితంగా హైదరాబాద్‌లో నాగేశ్వరరావుగారిని కలిసేవాడిని. ఆయన నాకు ఎంతో సన్నిహితుడు. ప్రాణమిత్రుడు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. నా గుండెల్లో ఎప్పుడూ ఉండిపోతారు. నాగేశ్వరరావుగారు ఆరవై, డెబ్బై ఏళ్లు నటించినా.. హీరో స్టెప్స్‌ ఎలా వేయాలి? రొమాంటిక్‌ సాంగ్స్‌లో ఎలా నటించాలి? అని నేర్పించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. అదే స్టయిల్‌ను అక్కినేని నాగార్జున ఫాలో అవుతూ తండ్రిని మించిన తనయుడిగా రాణిస్తున్నారు. అశ్వినీదత్‌ మనం గర్వించే నిర్మాత. నలబై ఐదు ఏళ్లుగా సినిమా నిర్మాతగా కొనసాగుతున్నారు. 52 సినిమాలను నిర్మించారు. దాదాపు అందరూ స్టార్‌ హీరోలతో సినిమా చేసిన ఘనత అశ్వినీదత్‌గారిది. రీసెంట్‌గా 'మహానటి' పెద్ద హిట్‌ కొట్టారు. ఆయన స్టార్‌ తిరిగింది. ఆయనకు ఇంకా తిరుగులేదు. ఆనాటి 'దేవదాసు' అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయిందో.. ఈ దేవదాసు కూడా శాశ్వతంగా నిలిచిపోతుంది. మల్టీస్టారర్‌ సినిమాలకు నాంది పలికింది నాగార్జున, అలాగే నాని చూడటానికే నార్మల్‌గా కనపడతాడు. కానీ స్క్రీన్‌పై అద్భుతంగా నటిస్తాడు. ఇలాంటి నాగ్‌, నాని కాంబినేషన్‌లో యువ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ రూపొందించిన దేవదాస్‌ హిట్‌ హిట్‌ హిట్‌.. సూపర్‌హిట్‌.. దీనికి తిరుగులేదు'' అన్నారు.

సమంత అక్కినేని మాట్లాడుతూ - ''బంగార్రాజు 'సొగ్గాడే చిన్ని నాయనా' తర్వాత నాకు ఈ సినిమాపై అంత కాన్ఫిడెన్స్‌ ఉంది. మా మావయ్య చంపేస్తారు. పూర్తిగా నమ్మకం ఉంది. సినిమా ఇంత పాజిటివ్‌ వైబ్స్‌తో ఉంది. నాకు ఇప్పుడే సినిమా చూడాలనిపిస్తుంది. నాగార్జునగారి తర్వాత నా ఫేవరేట్‌ కోస్టార్‌ నాని కూడా ఇందులో నటించడం ఆనందంగా ఉంది. స్క్రీన్‌పైన ఎవరిని చూడాలో తెలియడం లేదు. సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్‌ అవుతుంది. మహానటి తర్వాత వైజయంతీ మూవీస్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ చేరుతుంది'' అన్నారు.

మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ - ''నేను తొలిసారి స్టేజ్‌పై మాట్లాడుతున్నాను. దత్తుగారు నన్ను ఇంట్రడ్యూస్‌ చేసి 20 ఏళ్లు అవుతుంది. నన్ను భరించి ఇంకా కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు అశ్వినీదత్‌గారికి థాంక్స్‌. చాలా రోజుల తర్వాత నాగార్జునగారితో సినిమా చేశాను. అలాగే నానిగారు ఎక్స్‌ట్రార్డినరీగా నటించారు. శ్రీరామ్‌ ఆదిత్య మంచి హార్డ్‌ వర్కింగ్‌ పర్సన్‌. సినిమా తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

ఎ.నాగసుశీల మాట్లాడుతూ - ''మన్మథుడు' సినిమాలో తమ్ముడు ఎలా ఉన్నాడో ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నాడు. నానికి నా మనవరాలు పెద్ద ఫ్యాన్‌. అశ్వినీదత్‌, స్విటీ, స్వప్న, ప్రియాంక, హీరోయిన్స్‌ సహా అందరికీ అభినందనలు'' అన్నారు.

హీరో సుశాంత్‌ మాట్లాడుతూ - ''నాకు మన్మథుడు సినిమానే కాదు.. మాస్‌ సినిమాలోని లుక్‌ గుర్తుకు వస్తుంది. మావయ్యకు ఏజ్‌ పెరగడం లేదు. మాకు మాత్రం వయసు పెరిగిపోతుంది. ఈ జనరేషన్‌లో నాని మోస్ట్‌ వర్సటైల్‌ ఆర్టిస్ట్‌. మాకు చాలా ఇన్‌స్పిరేషన్‌. ఇద్దరి కాంబినేషన్‌ యూనిక్‌గా అనిపిస్తుంది. ఇక దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య, మణిశర్మగారు, ఆకాంక్ష, రష్మిక సహా అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ - ''ఎ.ఎన్‌.ఆర్‌ లివ్స్‌ ఆన్‌. నాగేశ్వరరావుగారి పుట్టినరోజునే ఆయన సినిమా టైటిల్‌ దేవదాస్‌ అనే సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జరగడం ఆయన ఆశీర్వాదమే. ఇక నాని సినిమాలకు నేను అభిమానిని. దత్‌గారు మహానటితో అద్భుతమే కాదు.. ఓ పుస్తకంలాంటి సినిమాను ఇచ్చారు. ఇద్దరు స్టార్స్‌త సినిమా చేయడం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య ఈ విషయంలో సక్సెస్‌ను సాధించారు. రష్మిక, ఆకాంక్షలకు అభినందనలు. స్వప్న, ప్రియాంక సహా సినిమా కోసం పనిచేసిన అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ - ''ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉన్నప్పుడు ఈ సినిమా గురించి చెప్పేవారు. ఈ సినిమాలో 400-500 మంది డ్యాన్సర్లున్నారని మేనేజర్లు వచ్చి చెబితే చాలా ఆనందంగా అనిపించేది. నాగార్జునగారు శివలాంటి సినిమాతో పాత్‌ బ్రేకర్‌. నాని నా ఫేవరేట్‌, నా ఫస్ట్‌ హీరో. నేను ఎవడే, మహానటి సినిమాలు చేసే మధ్యలో నాని 8 సినిమాలు చేశాడు. అవన్నీ హిట్లయ్యాయి. ఆదిత్య ఎలా ఈ సినిమాను చేసి ఉంటాడో నాకు తెలుసు. మంచి సినిమా అవుతుంది'' అన్నారు.

దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ - ''ఎన్నార్‌గారిని స్మరించుకుని ఈ ఫంక్షన్‌ చేసుకుంటున్నారు. ఈ కథకు మూలకథ రాసిన వ్యక్తి నాకు చెప్పారు. చాలా బావుందనిపించింది. దత్తుగారికి గొప్ప హిట్‌ రాబోతుంది. మణిగారి పాటలు బావున్నాయి'' అన్నారు.

చిత్ర నిర్మాత అశ్వినీదత్‌ మాట్లాడుతూ - ''నా అభిమాన హీరో అక్కినేని నాగేశ్వరరావుగారు. ఈ రోజున ఆయన్ని తలచుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మా సంస్థలో అత్యధిక సినిమాలు చేసిన నా ఇంకో అభిమాన హీరో నాగార్జున. ఆయన నాకు చేసిన ఐదో సినిమా ఇది. నా మంచి మిత్రుడు నాని. ఆయన మాతో చేస్తున్న రెరండో సినిమా ఇది. ఈ మధ్య కాలంలో నాగ్‌ అశ్విన్‌, శ్రీరామ్‌, వంశీ పైడిపల్లి, మా క్రిష్‌... ఈ యంగ్‌ డైరక్టర్స్‌ వచ్చి టోటల్‌ ఇండస్ట్రీ ట్రెండ్‌నే మార్చారు. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి. నేను నిమిత్తమాత్రుడిని. గత నాలుగైదేళ్ల నుంచి నా సంస్థను నడిపిస్తున్నది రెండు శక్తులు. నా గ్రేట్‌ వరల్డ్‌ వైడ్‌ పార్ట్‌ నర్‌.. వయాకామ్‌ 18 అజిత్‌గారిని వేదిక మీదకు పిలుస్తున్నాను. అలాగే స్వప్న, ప్రియాంకను కూడా వేదిక మీదకు పిలుస్తున్నాను'' అన్నారు.

వయాకామ్‌ ప్రతినిధి అజిత్‌ మాట్లాడుతూ - ''నాకు మాటలు రావడం లేదు. నేను ఈ పరిసరాల్లో చాలా లెగసీని చూస్తున్నా. ఏఎన్నార్‌ లెగసీని, నాగార్జునని, నానిని చూస్తుంటే నేను బేబీలాగా అనుకుంటున్నా. వైజయంతీ సంస్థలాంటి జెయింట్స్‌ తో నేను కలిసి నడవడం హ్యాపీగా ఉంది. ఒక వ్యక్తికి భాష రాకపోవచ్చు కానీ, హిట్‌ భాష మాత్రం ఇట్టే అర్థమవుతుంది. ముంబై జనాలు ఇక్కడి జనాల నుంచి సినిమా మీద ప్రేమ ఎలా ఉండాలో తెలుసుకోవాలి'' అన్నారు.

యూత్‌ కింగ్‌ అక్కినేని అఖిల్‌ మాట్లాడుతూ - '''అచ్చబాబోయ్‌.. ఏమున్నాడయ్యా బాబూ.. మా నాన్న. ఈ సినిమా హిట్‌ కొట్టబోతున్నామని నాకు ఓ వైబ్‌ వస్తోంది. నాన్నగారు, నాని కలిసి ఓ పెద్ద హిట్‌ కొట్టబోతున్నారని అనిపిస్తోంది. నానిని పదేళ్ల ముందు కలిశాను. ఆయన నేచురల్‌ స్టార్‌ మాత్రమే కాదు, లైకింగ్‌ స్టార్‌. ఇలా చూడగానే అలా నచ్చేస్తారు. తెరమీద అందరూ చాలా బావున్నారు. తాతగారి పుట్టినరోజున అభిమానులతో సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పుట్టినరోజున ఎవరూ బాధగా ఉండకూడదు. అందరూ సెలబ్రేట్‌ చేసుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు ఈ మ్యూజిక్‌ పార్టీని అరేంజ్‌ చేసిన వైజయంతీ సంస్థకు ధన్యవాదాలు'' అన్నారు.

హీరోయిన్‌ ఆకాంక్ష మాట్లాడుతూ - ''నన్ను నేను నాగార్జునగారితో, నాని, రష్మికతో కలిసి స్క్రీన్‌ మీద చూసుకున్న తర్వాత నాకు మాటలు రావడం లేదు. 27 కోసం వెయిట్‌ చేస్తున్నా. నేను ఏడేళ్ల క్రితం వయాకామ్‌తో నా జర్నీని మొదలుపెట్టాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. అశ్వినీదత్‌గారు నన్ను నమ్మినందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.

హీరోయిన్‌ రష్మిక మాట్లాడుతూ - ''ఈ వేదిక మీద ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. చాలా భయంగా ఉంది. ఏదైనా తప్పయితే క్షమించండి. వైజయంతీ మూవీస్‌లో ఓ సినిమా చేశాను. అది చాలా ఆనందంగా అనిపిస్తోంది. నా మూడో సినిమా నాగార్జునగారితో, నానితో కలిసి వైజయంతీ సినిమాను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాగార్జునగారు సూపర్‌. నానిగారితో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. టీమ్‌ అందరూ చాలా బాగా పనిచేశారు. అక్కినేని ఫ్యామిలీని చూస్తుంటే నా దిష్టే తగిలేట్టు ఉంది. ఆకాంక్షతో పనిచేస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. నా కోసం ఎవరైనా సినిమా చూస్తారా? 27 వ తేది ఎంత మంది వస్తారో చూడాలి'' అన్నారు.

దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ - ''ఇవాళ ఈ వేడుక ఏఎన్నార్‌గారి జయంతి రోజున జరగడం చాలా ఆనందంగా అనిపించింది. వైజయంతీ మూవీస్‌లో పనిచేయడం చాలా గౌరవం. నేను వైజయంతీ మూవీస్‌లో అడుగుపెట్టగానే నాకు 'ఇంద్ర' పోస్టర్‌ కనిపించింది. దాన్ని చూడగానే 'అబ్బ... ఇక్కడ సినిమా చేయాలబ్బా' అని అనిపించింది. రూ.150 పెట్టి టిక్కెట్‌ కొనుక్కునేవాళ్ల గురించి ఆలోచించే వ్యక్తి అశ్వనీదత్‌గారు. నాగార్జునగారిని ఐదేళ్ల క్రితం నేను బయట కలిసి నేను ఫొటో తీసుకుని మా అమ్మకు ఫోన్‌ చేసి 'అమ్మా.. బయట కూడా హీరోలాగా ఉన్నారమ్మా' అని అన్నా. వెంటనే మా అమ్మ 'అవునా వెళ్లి కథ చెప్పేయ్‌' అని అన్నారు. ఆ సమయంలో నేను షార్ట్‌ ఫిల్మ్స్‌ తీస్తున్నా. ఆ తర్వాత నాలుగేళ్లు తీసుకుని నేను ఇప్పుడు సినిమా చేస్తున్నా. ఆయన సెట్‌లోకి వచ్చిన వెంటనే ఓ ఆరా ఉంటుంది. అదే ఆరాను ఆడియన్స్‌ థియేటర్లలోనూ ఆస్వాదించవచ్చు. నా వల్ల జరిగిన కొన్ని తప్పులను ఆయన అంగీకరించారు. నాకు నాని అంటే చాలా ఇష్టం. ఐ లవ్‌ హిమ్‌. నాని డైరక్టర్స్‌ ట్రీట్‌. ఎలాంటి ఇబ్బంది అయినా తీర్చడానికి ఆయన ముందుంటారు'' అన్నారు.

నేచరల్‌ స్టార్‌ నాని మాట్లాడుతూ - ''నాగార్జునగారు ఏం తింటారో తెలుసుకోవాలని, ఏం తాగుతున్నారో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉండేది. మా అసిస్టెంట్‌ని పిలిచి ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో తెలుసుకోమని చెప్పేవాడిని. మామూలుగా మనం తినేవే సార్‌.. అని చెప్పేవాడు. అందరూ తినేవి తిని, అందరూ తాగేవి తాగితే ఆయన మాత్రమే అంత అందంగా ఎలా ఉంటున్నారని అనిపించేది. ఆయనతో సినిమా చేశాక తెలిసింది ఏంటంటే ఆయన చాలా సరదా మనిషి. చాలా సరదాగా ఉండేవారు. చాలా ప్యూర్‌గా ఉండేవారు. దేవదాస్‌కి సంబంధించి సినిమా సక్సెస్‌ అయినా, ఇంకోటయినా నాకు బోనసే. లాస్ట్‌ డే షూటింగ్‌కి వెళ్లినప్పుడు నాగార్జునగారు రఫ్‌ ఎడిట్‌ చూసి చెప్పిన మాటలు చాలు. నాకు ఆల్రెడీ సినిమా హిట్‌ అనే ఫీలింగ్‌ వస్తోంది. అందరికీ నచ్చితే అది కంప్లీట్‌ బోనస్‌. మా సినమాలో పనిచేసిన ఇద్దరు హీరోయిన్లు చాలా సరదాగా ఉండేవారు. రష్మిక సెట్‌కి వచ్చిన తర్వాత నేను పెద్దోడిననే ఫీలింగ్‌ వచ్చేది. ఆకాంక్షకి, నాకూ చాలా తక్కువ సీన్లే ఉన్నా... చాలా బాగా ఎంజాయ్‌ చేశాం. వైజయంతీ మూవీస్‌కి సంబంధించి, దత్తుగారు నేనెప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు నేను ఆల్బమ్‌ తీసుకెళ్తే ఆయన 'నీకెందుకు యాక్టింగ్‌. ఇంటికెళ్లి చదువుకో' అని అన్నారు. ఇంతకు ముందు ఎవడే సుబ్రమణ్యం కూడా చేశా. ఇప్పుడు ఈ సినిమాతో దత్తుగారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన ఇప్పటికి కూడా షూటింగ్‌ అంటే చాలా ఆనందంగా ఉంటారు. షూటింగ్‌ నుంచి అరపూట పక్కకి వెళ్లాలన్నా ఆయన చాలా బాధపడిపోతారు. నాకూ, స్వప్నకూ లవ్‌ అండ్‌ హేట్‌ రిలేషన్‌షిప్‌ ఉంటుంది. ఎవడే సుబ్రమణ్యం రిలీజ్‌కి ముందు కొట్టుకున్నాం. సినిమా హిట్‌ అయింది. ఈ సినిమా షూటింగ్‌కి ముందే కొట్టుకున్నాం. సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది. ప్రియాంకకు కూడా చాలా థాంక్స్‌. వాళ్లవల్లే ఇంత ఆర్గనైజ్డ్‌ గా చేయడం సాధ్యమైంది. శ్రీరామ్‌ మా అందరికన్నా చిన్నోడు. ఈ సినిమాను పూర్తి చేసినప్పుడే ఆయన పెద్ద సక్సెస్‌ కొట్టేసినట్టు. శ్యామ్‌గారు విజువల్స్‌ చూసిన తర్వాత డి.ఐ. అయిందా? లేదా? అని అడిగా. ఆయన షూటింగ్‌ చేసిన విధానం చూస్తే డి.ఐ అవసరం లేదనిపించింది. మణిశర్మగారు నా ఫేవరేట్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌. నేను చిన్నప్పుడు డొక్కు వాక్‌మేన్‌ పట్టుకుని యమహానగరి పాట వింటూ నిద్రపోయేవాడిని. జెంటిల్‌మేన్‌ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేశా. ఆ సినిమా పెద్ద హిట్‌ అయింది. ఇవాళ్టికైనా ఎవరైనా మాటల్లో వినిపిస్తే 'తాతయ్య' అని ఎవరైనా అంటే నాకు మా తాతకన్నా ముందు 'ఏఎన్నార్‌' ఫేస్‌ కనిపిస్తుంది. సీతారామయ్యగారి మనవరాలు అంటే నాకు అంత ఇష్టం. ఈ సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కంప్లీట్‌గా రెండున్నర గంటలు ఎంజాయ్‌ చేసే సినిమా అవుతుంది'' అన్నారు.

కింగ్‌ నాగార్జున మాట్లాడుతూ - ''ఇవాళ సెప్టెంబర్‌ 20. నాన్నగారు పుట్టినరోజు. ఏఎన్నార్‌ లివ్స్‌ ఆన్‌. 1953లో 'దేవదాసు' సినిమా విడుదలైంది. మళ్లీ ఇప్పుడు 'దేవదాస్‌' సినిమా విడుదల కాబోతోంది. అదొక్కటి చాలుగా.. ఏఎన్నార్‌ లివ్స్‌ ఆన్‌ అని అనడానికి. అంతేకాదు.. అందరి అభిమానంలో నాన్నగారు లివ్స్‌ ఆన్‌. అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయి సినిమాకు. ఈ సినిమాను నేను మూడు కారణాల కోసం ఒప్పుకున్నా. ఒకటి స్క్రిప్ట్‌, రెండో వైజయంతీ సంస్థ అధినేతి అశ్వనీదత్‌గారూ. మూడోది నాని. స్క్రిప్ట్‌ వినగానే ఏమనిపించిందంటే, ఈ రోల్‌లో నేను పెద్ద యాక్ట్‌ చేయనవసరం అని అనిపించింది. అవతల ఉన్న రోల్‌లో ఎవరని అడిగితే 'నాని' అన్నారు. 'ఇంక అసలు నేను యాక్ట్‌ చేయక్కర్లేదు. పర్ఫెక్ట్‌ గా సూటవుతుంది' అని అన్నా. అశ్వనీదత్‌గారి ట్రాక్‌ రికార్డ్‌ చూసుకోండ 'ఓ సీతకథ' సినిమా అయ్యాక.. ఆయనకు 24 ఏళ్ల వయసు. తెల్లారుజామున నాలుగింటికి వెళ్లి పెద్దాయన ఎన్టీఆర్‌గారి ఇంటి ముందు నిలుచునేవారు. అలా నాలుగు నెలలు నిలుచున్న తర్వాత ఆయన 'ఎదురులేని మనిషి' అని సినిమా ఇచ్చారు. ఆయనే వైజయంతీ మూవీస్‌ అని బ్యానర్‌ పేరు కూడా పెట్టారు. అది ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆయన బొమ్మే ఆ బ్యానర్‌ అందులోనూ ఉంటుంది. నాతో ఇప్పటికి ఐదు సినిమాలు చేశారు అశ్వనీదత్‌గారు. 'ఆఖరి పోరాటం' కోసం శ్రీదేవిని పట్టుకొచ్చారు. ఆ తర్వాత ఒక్క పాట కోసం ఐశ్వర్య రాయ్‌ను తీసుకొచ్చారు. ఆయన సినిమా అంటే ప్రాణం. ఆయన సినిమా కోసం ఏదైనా చేస్తారు. మమ్మల్ని అందరినీ తిట్టినా ఏం చేసినా, ఆయనకు సినిమా బాగా రావాలి. నాకెందుకో నేను అనుకున్నవన్నీ జరుగుతానే ఉంటాయి. చాలా గట్టిగా అనుకున్నవి తప్పకుండా జరుగుతాయి. ఎప్పటినుంచో నానితో సినిమా చేయాలని అనుకున్నా. తన డైలాగ్‌ డెలివరీ చాలా బావుంటుంది. చాలా మంచి వాయిస్‌. వింటే పాట విన్నట్టు ఉంటుంది. నాని నా కోస్టార్‌. తనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సీక్వెల్‌ చేద్దామా? చేద్దాం. థాయిల్యాండ్‌ నుంచి వచ్చినప్పుడు నా పక్కన కూర్చుంది. చాలా హ్యాపీగా నవ్విస్తూ కూర్చుంది. నైట్‌ టైమ్‌ ట్రావెల్‌ చేస్తున్నప్పుడు నాకు బాడీ గార్డ్‌ గా కూడా ఉంది. ఆకాంక్ష చాలా అందంగా ఉంది. చాన్నాళ్ల తర్వాత నా పక్కన ఓ అందమైన అమ్మాయిని వైజయంతీ వాళ్లు తీసుకుని వచ్చారు. తను చాలా మంచి అమ్మాయి. రష్మికకి టూ హిట్స్‌ ఉన్నాయి. తనకి ఇది హ్యాట్రిక్‌ అవుతుంది. ఆకాంక్ష ఈ సినిమాతో స్టార్‌ అవుతుంది. శ్రీరామ్‌ ఆదిత్య లేజీ ఫెలో. రాత్రుళ్లు మేలుకుంటాడు. మాకు చాలా ఈగోలు చాలా చాలా ఉంటాయి. అన్నిటినీ చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. ఈ సినిమా అతన్ని స్టార్‌ చేస్తుంది. శ్యామ్‌ చాలా పెద్ద మ్యాజిక్‌ చేశాడు. మణిశర్మగారు రీరికార్డింగ్‌ హైదరాబాద్‌లో చేయాలి. చాలా మంచి సాంగ్స్‌ ఇచ్చారు. ప్రతి పాటా చాలా బావుంది. ఒక పాటలో నేను లేను. ఆ పాటను సిద్‌ శ్రీరామ్‌ పాడాడు. చాలా బావుంది. అందరికీ ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలి. అందరికీ ధన్యవాదాలు. సుబ్బిరామిరెడ్డిగారు మా అక్కినేని ఫ్యామిలీకి మా నాన్నలాంటివారు. నాకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా గుర్తుకొచ్చేది సుబ్బిరామిరెడ్డిగారే. నాన్నకు, ఆయనకూ ఉన్న అనుబంధం నాకు తెలుసు. ఆ అనుబంధం మా ఇద్దరికీ ఉండాలని కోరుకుంటున్నా. సెప్టెంబర్‌ నెల అంటే మా నెల. మనందరి నెల. నాన్నగారు పుట్టినరోజు ఈ నెల్లోనే ఉంది. ప్రపంచంలో ఎవరిదైనా భార్యాభర్తల సినిమా ఒకేరోజు విడుదలవుతుంది. నేను ఇప్పటిదాకా వినలేదు. రిలీజ్‌ అయి రెండూ బాగా ఆడుతాయా? రెండూ బాగా ఆడాయి. సమంత పొద్దున్నే చాలా ఫీలయింది. శైలజారెడ్డి అల్లుడు రివ్యూలు చూసి చాలా ఫీలయింది. 'ఏం పర్వాలేదమ్మా... సాయంత్రానికి అంతా సరిపోతుంది' అని అన్నా. అలాగే అయింది. మళ్లీ తను 'మామా. నా సినిమాకు రివ్యూలు బాగా వచ్చాయి. కానీ బాక్సాఫీస్‌ గంట మోగలేదు' అని అంది. 'సండేకి అంతా సరిపోతుంది' అని అన్నా. అలాగే సెటిల్‌ అయింది. అందుకే మాకు చాలా సంతోషం. రేపు 27న కూడా ఆయన అందరినీ చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు. మొన్న గణేశ్‌ చవితి జరిగింది. త్వరలో దసరా రాబోతుంది. ఈ నెల 27న దేవదాస్‌ పండుగ. నవ్వులు నవ్వులు.. ఒన్లీ నవ్వులు. వయాకామ్‌కి తెలుగు పరిశ్రమకి ఆహ్వానం పలుకుతున్నాను'' అన్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved