శ్రీమతి స్వప్న సమర్పణలో స్వాజిత్ మూవీస్ బ్యానర్ లో నాగశౌర్య, బేబి షామిలి జంటగా కె.ఆర్ సహ నిర్మాతగా రాజేష్ నిర్మిస్తోన్న చిత్రం `అమ్మమ్మగారిల్లు`. సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. మే 25న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
నాగశౌర్య మాట్లాడుతూ ```అమ్మమ్మగారిల్లు` చాలా మంచి సినిమా. రావు రమేశ్‌గారు చాలా మంచి, మన ఇంట్లో కనపడే క్యారెక్టర్‌లో కనపడతారు. సుమిత్రగారు అమ్మమ్మగారి పాత్రకు అతికినట్లు సరిపోయారు. సుందర్‌గారు మంచి కథ చెప్పడమే కాదు.. చెప్పినట్లు తీశారు కూడా. మంచి ప్రొడక్షన్ వేల్యూస్‌తో సినిమాను తెరకెక్కించారు. మే 25న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా చూస్తే కచ్చితంగా అమ్మమ్మ గుర్తకు వస్తుంది. రాజేశ్‌గారు, కుమార్‌గారు, సుందర్‌గారు ఇంకా ఎన్నో మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటున్నాను. రసూల్‌గారు సినిమాను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. ఆయనతో ఒకరికి ఒకరు లాంటి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. షామిలి అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. తను నటించిన సినిమాలు చూశాను`` అన్నారు.
డైరెక్టర్ సుందర్ సూర్య మాట్లాడుతూ - ``ఎంతో మంది ఎక్స్‌పీరియెన్స్ ఉన్న నటీనటులు ఈ సినిమా కోసం బాగా కష్టపడి చేశారు. అందరూ చక్కటి సహకారం అందించారు. షామిలిగారిని అప్రోచ్ అయ్యి స్టోరీ చెప్పాను. ఆమెకు నచ్చడంతో ఏ మాత్రం ఆలోచించకుండా సినిమా చేస్తాను అన్నారు. నాగశౌర్యగారు లేకపోతే ఈ సినిమా లేదు. రెండేళ్ల పాటు ఈ స్క్రిప్ట్‌ను తయారు చేశాం. హీరో నాగశౌర్యను కలిశాం. కథ వినగానే పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రం కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా చేస్తానని చెప్పారు. అలాగే రసూల్‌గారు మాట కన్నా పనే ఎక్కువ మాట్లాడుతుంది. కల్యాణ్‌మాలిక్‌గారు సినిమాలో రెండు సాంగ్స్ ఇచ్చారు. అలాగే సాయికార్తీక్‌గారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ సినిమాకు బిగ్గెస్ట్ క్యాస్ట్ పనిచేశారు. సాయికార్తీక్ అద్భుతమైన థీమ్ మ్యూజిక్ అందించారు. మా డైరెక్షన్ టీం సహకారం ఉండబట్టే సినిమాను అనుకున్న విధంగా చక్కగా తెరకెక్కించాం. సపోర్ట్ చేసిన అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు`` అన్నారు.
నిర్మాత రాజేశ్ మాట్లాడుతూ - ``ఇంత మంచి సినిమా చేశామంటే కారణం నాగశౌర్య, షామిలి సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు అందించిన సహాయమే. సినిమా బాగా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. మే 25న సినిమాను విడుదల చేస్తున్నాం`` అన్నారు.
మధుమని మాట్లాడుతూ - ``మా అమ్మమ్మగారే మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. ఈ సినిమాను సినిమాగా భావించలేదు. మాకు ఎంతో దగ్గరైన సినిమా ఇది. సుమిత్ర, సుధగారితో సంతోషం సినిమా తర్వాత కలిసి నటించాను. శివాజీ రాజా మంచి స్నేహితుడు. రావు రమేశ్‌గారి భార్య పాత్రలో నటించాను. అంటే పెద్ద కోడలి పాత్రలో కనపడతాను. అద్భుతమైన పాత్రలు చేశాం. ఇంత మంచి సినిమా అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్`` అన్నారు.
హేమ మాట్లాడుతూ - ``నేను 14 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చేశాను. కాబట్టి మా అమ్మమ్మగారిల్లు మిస్ అయ్యాననే ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాతో ఆ బాధ కొంత తీరింది. నాగశౌర్య చక్కగా నటించాడు. షామిలి మంచి పాత్రలో నటించింది. వేసవిలో అమ్మమ్మగారింటికి వెళదామనుకునే ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది`` అన్నారు.
హీరోయిన్ షామిలి మాట్లాడుతూ - ``ఈ సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. మంచి సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ సుందర్ సూర్యగారికి థాంక్స్. మంచి ఎనర్జితో యూనిట్ సభ్యులందరినీ మోటివేట్ చేస్తూ అందరి నుండి పని రాబట్టుకున్నారు. నిర్మాతలు కుమార్, రాజేశ్‌గారికి, నాగశౌర్యకి థాంక్స్. మా అమ్మమ్మగారితో మంచి అనుబంధం ఉంది. అదే వాతావరణాన్ని ఈ సినిమా షూటింగ్ సమయంలో చూశాను`` అన్నారు.
సాయికార్తీక్ మాట్లాడుతూ - ``అమ్మమ్మగారిల్లు` అనేది అందరికీ గుర్తుండే ఉంటుంది. సాయికార్తీక్ అంటే కమర్షియల్ సినిమాల సంగీత దర్శకుడనే అందరికీ గుర్తుంటుంది. కానీ నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సుందర్ సూర్య, నిర్మాత రాజేశ్‌గారికి థాంక్స్. ఫుల్ లెంగ్త్ మెలోడీ మ్యూజిక్ అందించే అవకాశం కలిగింది. సినిమాపై మంచి నమ్మకం ఉంది. అందరూ ఈ సినిమాను చూసి మా యూనిట్‌ను ఆశీర్వదించాలని కోరుతున్నాను`` అన్నారు.