ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నందమూరి కల్యాణ్ రామ్, తమన్నా జంటగా నటించిన చిత్రం `నా నువ్వే`. జయేంద్ర దర్శకత్వంలో కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా జూన్ 14న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.
నందమూరి తారక రామారావు మాట్లాడుతూ - ``నాకు అన్నను చూస్తుంటే మూడేళ్ల క్రితం నేను పడ్డ టెన్షనే ఆయనలో కనపడుతుంది. `నాన్నకు ప్రేమతో` సినిమా చేసే సమయంలో కొత్త గెటప్ చేశాను. అప్పటి వరకు నేను చేసిన సినిమాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనుకున్నాను. ఎందుకుంటే ప్రతి నటుడు స్టీరియో టైప్ సినిమాలు చేసుకుంటూ వెళితే.. ఆ హీరో సినిమాలు చూసే ప్రేక్షకులు, అభిమానులకు ఆసక్తి ఉండదు. సాధారణంగా సినిమా పెద్ద హిట్ అయ్యిందనే దాని కంటే ఆ నటుడు చక్కగా నటించాడనే అప్రిషియేషన్స్ ఎంతో ముఖ్యం. ఆరోజు `నాన్నకుప్రేమతో` సినిమా చేసేటప్పుడు నేనెలా ఫీల్ అయ్యానో.. అన్నయ్య ముఖం చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. కానీ తప్పదు. ఈ టెన్షన్స్, ప్రయాణం నటుడికి సర్వసాధారణం. కానీ మీరు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ప్రేక్షకులకు, అభిమానులకు పెద్ద మనసు. నిజంగాకష్టడితే ఆ చిత్రానికి పెద్ద పీట వేయడమనేది తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తేం కాదు. అలాంటి చిత్రాలకు చెందిన కోవలో నా నువ్వే కూడా నిలుస్తుందని నా ప్రగాడ నమ్మకం. అన్నయ్య పడ్డ కష్టం, టెన్షన్ వృథా పోదు. ఓ నటుడికి కొత్తగా చూపించాలంటే ఓ డైరెక్టర్‌కి చాలా గట్స్ ఉండాలి. ఆ గట్స్ జయేంద్రగారిలో ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఛాలెంజ్‌గా తీసుకుని, కల్యాణ్ అన్నను కొత్తగా చూపించారు. ఆయన తనను నమ్మడమే కాదు.. నా సోదరుడిపై నమ్మకంతో తను కొత్తగా ప్రెజెంట్ చేశారు. శరత్‌గారు సంగీతం అందించిన మ్యూజిక్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్‌గా నిలబడుతుంది. రిజల్ట్ గురించి ఆలోచించకుండా కొత్త సినిమా చేయాలనే నిర్ణయం తీసుకోవాల్సింది నిర్మాతలే. వాళ్ల ద్వారా దర్శకుడు సహా అందరికీ ఆ నమ్మకం సాగుతుంది. నిర్మాతలు కిరణ్, విజయ్, మహేశ్‌లకు అభినందనలు. వారి కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు అభినందనలు. మా అన్న కల్యాణ్ అన్న కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవడమే కాదు.. ఇలాంటి ఇంకెన్నో కొత్త చిత్రాలు, ప్రయోగాలు చేయాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ - ``ఇప్పటికే సినిమా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. శరత్‌గారు నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. ఆయనతో సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా టైటిల్ సాంగ్ నన్ను హంట్ చేస్తుంది. జయేంద్రగారు నాకు కథ చెప్పినప్పుడు, స్క్రిప్ట్ నచ్చింది. తర్వాత నేను ఈ సినిమాకు ఎలా సరిపోతాను అని ఆయన్నుముందుగా ప్రశ్నించాను. ఎందుకంటే నేను కమర్షియల్ సినిమాలే చేస్తూ వచ్చాను. ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ మూవీ ఇది. నేను ఇది వరకు ఎప్పుడూ చేయలేదు. రొమాంటిక్ ఇమేజ్ ఉన్న హీరోతో రొమాంటిక్ సినిమా చేస్తే ఆడియన్స్‌కు ఏం కొత్తగా ఉంటుంది. అలాంటి మీరు చేయని జోనర్‌లో మీరు చేసి సినిమా ఆదరణ పొందితే.. అదే నాకు పెద్ద సక్సెస్ అని అన్నారు. ఆయన నమ్మకంగా చెప్పిన ఆ మాటల వల్లే నేను ఈ సినిమా చేయడానికి ఓకే అన్నాను. ఎందుకంటే ఏ సినిమాకైనా దర్శకుడే కెప్టెన్. యూనిట్ అంతా ఆయన డైరెక్షన్‌లోనే నడుస్తుంటుంది. అలాంటి ఆయనకే నమ్మకం లేకపోతే సినిమా చేయలేం. ఆరోజు జయేంద్రగారు నాకు గొప్ప నమ్మకాన్ని ఇచ్చారు. నా మేకోవర్ కొత్తగా ఉంటుంది. తమన్నా చాలా ఫ్రెష్ లుక్‌తో కనపడుతుంది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్‌గారి నమ్మకమే. అలాగే ఈ విజువల్స్‌ను ఇంత అందంగా చూపించింది పి.సి.శ్రీరామ్‌గారు. జయేంద్రగారు, పిసి.శ్రీరామ్‌గారు..వంటి గొప్ప టెక్నిషియన్స్‌తో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. నాకు కొత్త జోనర్ సినిమాను ఇవ్వడమే కాకుండా పెద్ద హీరోయిన్, పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌తో సినిమా చేసిన నిర్మాతలకు ఈ సందర్భంగా థాంక్స్. మేకింగ్‌లో నిర్మాతలు కిరణ్, విజయ్, మహేశ్‌గారు కాంప్రమైజ్ కాలేదు. నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుండి కొత్తగా ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉన్నాను. అయితే నాకు అవుటాఫ్‌ది బాక్స్‌లాంటి సినిమా ఇది. నా కెరీర్‌లో చేయని ఓ ప్రయత్నమిది. దీన్ని అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది. జూన్ 14 తర్వాత ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుతాను`` అన్నారు.
డైరెక్టర్ జయేంద్ర మాట్లాడుతూ - ``కిరణ్‌గారు, విజయ్‌గారు లాస్ ఏంజిల్స్‌లో ఈ స్క్రిప్ట్ విన్నారు. వారికి బాగా నచ్చింది. సినిమా చేయాలనుకున్నారు. ఈ ప్రయాణం చాలా కాలం కొనసాగింది. కథ విన్న కల్యాణ్‌గారు ఆయనకు బాగా నచ్చింది. నాపై పెద్ద నమ్మకం ఉంచి ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చిన కల్యాణ్ ఈ సినిమాతో రొమాంటిక్ జోనర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జూన్ 14న కల్యాణ్ రామ్‌లోని రొమాంటిక్ కుర్రాడిని చూడబోతున్నాం. ఈ సినిమా కోసం కల్యాణ్ మేకోవర్, ఆయన పాత్రను క్యారీ చేసిన విధానం అందరికీ చాలా కొత్తగా అనిపిస్తుంది. స్టార్ హీరోయిన్ అయిన తమన్నా ఓ కొత్త హీరోయిన్‌లా ఈ సినిమాకోసం వర్క్ చేసింది. మీర పాత్రను అద్భుతంగా చేసింది. వీరిద్దరూ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇస్తారు. శరత్ గొప్ప సంగీతాన్ని అందించారు. రొమాంటిక్ సినిమా అని యూత్ ప్రేక్షకులు మాత్రమే చూసేలా ఉంటుందని అనుకోవద్దు. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి కథ రన్ అవుతుంటుంది. గొప్ప టెక్నికల్ టీంతో పనిచేశాను. పి.సి.శ్రీరామ్ కెమెరా, శరత్ మ్యూజిక్, సెల్వ ఆర్ట్ వర్క్, బృంద ఎక్సలెంట్ కొరియోగ్రఫీ అన్ని అద్భుతంగా కుదిరాయి. చిత్ర సమర్పకుడు మహేశ్ కొనేరుకి థాంక్స్. జూన్ 14న సినిమాను ప్రేమించేలా ఉంటుంది`` అన్నారు.
నిర్మాత మహేశ్ కొనేరు మాట్లాడుతూ - ``ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నిర్మాతగా నా తొలి చిత్రం. బ్రాండ్ న్యూ కల్యాణ్ రామ్‌గారు ఈ సినిమాలో కనపడతారు. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న కల్యాణ్ రామ్‌గారు ఈ సినిమాతో క్లాస్ ఆడియెన్స్‌కు దగ్గరవుతారని చాలా నమ్మకంగా ఉంది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. సినిమా విడుదలైన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం`` అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శరత్ మాట్లాడుతూ - ``తెలుగులో ఇది నా నాలుగో చిత్రం. కలవరమాయ మదిలో, 180, దృశ్యం సినిమాల తర్వాత చేస్తున్న చిత్రమిది. నా దృష్టిలో సంగీతాన్ని క్రియేట్ చేసేది ఆ భగవంతుడే. నా దర్శకుడు జయేంద్ర, నిర్మాతలు, కల్యాణ్‌రామ్, తమన్నా సహా ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్`` అన్నారు.
పిడివి ప్రసాద్ మాట్లాడుతూ - ``కిరణ్ ఒక ఏడాది క్రితం నా దగ్గరకు వచ్చి ఓ ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ విన్నాం అని చెప్పాడు. దర్శకుడు చాలా గొప్పగా చెప్పాడు. మంచి నిర్మాతలు. కల్యాణ్‌గారు నటుడు కాకముందు నుండి నాతో మంచి పరిచయం ఉంది. దర్శకుడు, నిర్మాతలు సహా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
విజయ్ చిల్లా మాట్లాడుతూ - ``నేను, కిరణ్ చిన్నప్పట్నుంచి మంచి మిత్రులం. కిరణ్ ఈ సినిమాను చాలా కమిట్‌మెంట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాతో తనకు మంచి సక్సెస్ రావాలి. జయేంద్రగారు, పిసిశ్రీరామ్‌గారు గురించి చెప్పేంత వాడిని కాను. ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు`` అన్నారు.