25 September 2018
Hyderabad
లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ఏస్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందిన భారీ మల్టీస్టారర్ `నవాబ్`. అరవింద స్వామి, జ్యోతిక, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, అరుణ్ విజయ్, ఐశ్వర్య రాజేశ్, త్యాగరాజన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలోసెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. విడుదల ముందుగా సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
అరవింద్ స్వామి మాట్లాడుతూ ``రోజాలో `రిషి`, ధ్రువలో `సిద్ధార్థ్ అభిమన్యు`ను తెలుగువారు ఆదరించారు. నవాబ్‌లోని `వరద` క్యారక్టర్‌ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నా జర్నీని మణిరత్నంగారితో మొదలుపెట్టాను. సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు కూడా ఆయనే నన్ను మరలా తీసుకొచ్చారు. దాదాపు 28 ఏళ్ల ప్రయాణం మాది. 8 సినిమాలు ఆయనతో అసోసియేట్ అయ్యాను. ఈ సినిమా మొదటి నుంచీ చాలా స్పెషల్ నాకు. ఆయనతో ప్రతి సినిమా స్పెషలే. ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే ఆ స్టోరీని చెప్పిన విధానం, అందులోని నటీనటులు.. ఇవన్నీ నాకు నచ్చాయి. రెహమాన్‌గారూ, సంతోష్‌గారితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం`` అని తెలిపారు.
డయానా మాట్లాడుతూ ``ఇది నేను కలగన్న డెబ్యూ. నన్ను నమ్మి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తమిళ సినిమా లెజండరీ వ్యక్తి నన్ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఇంత మందితో కలిసి పనిచేయడం అద్భుతమైన అవకాశం`` అని చెప్పారు.
అరుణ్ విజయ్ మాట్లాడుతూ ``మణిరత్నంగారి డైరక్షన్‌లో నటించడం అనేది ప్రతి ఒక్కరి కల. ఇవాళ నా కల నిజమైంది. అందుకు చాలా ఆనందిస్తున్నాను. అరవింద్‌స్వామిగారితో పాటు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరితోనూ పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. రెహమాన్‌గారి సంగీతానికి ఇప్పటికే మంచి ఆదరణ వస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే బాగా ఉంటుంది. తెలుగు ఆడియన్స్ కి కూడా తప్పకుండా నచ్చుతుంది. అద్భుతమైన భావన కలుగుతోంది. త్యాగు అనే పాత్ర నాకు చాలా ఇష్టం. ఈ పాత్ర నా కెరీర్‌లో మైల్‌స్టోన్ అవుతుంది. చాలా ఇష్టంగా నటించాను. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను చూడండి`` అని అన్నారు.
ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ``నేను తెలుగు అమ్మాయిని. చెన్నైలో సెటిల్ అయ్యాం. మణిరత్నంగారి సినిమాలో నటించడం అందరికీ ఓ కల. నాక్కూడా అలాగే అనిపించింది. బాధ్యత కూడా ఉంది. అంతకన్నా మించిన భయం ఉంది. నేను తమిళ్ 20 సినిమాల్లో నటించాను. మణిగారి డైరక్షన్‌లో నటించినంత కంఫర్టబుల్‌గా ఇంకెక్కడా చేయలేదు. మనం నటించాలే గానీ, ఆయన లడ్డూలాగా వాడుకుంటారు. నేను ఆయన దగ్గర చాలా కంఫర్టబుల్‌గా చేశాను. చిన్న పిల్లలకు కూడా ఆయన నేర్పించే నటన అర్థమవుతుంది. నా కెరీర్‌లో ఇది చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నా. మణిగారికి, రెహమాన్‌గారికి, అరుణ్ విజయ్‌గారికి, సంతోష్‌గారికి, అదితి, జ్యోతికగారికి, శింబుకి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాలో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది`` అని అన్నారు.
మణిరత్నం మాట్లాడుతూ ``ఈ సినిమా పూర్తిగా టీమ్ వర్క్. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. సీతారామశాస్త్రిగారు, రాఖీ పాటలు రాశారు. రాఖీ రెండు పాటలు రాశారు. రెహమాన్‌కు ధన్యవాదాలు. నా కథ మంచి ఆర్టిస్టులను, స్టార్స్ ను డిమాండ్ చేసింది. అందుకే వాళ్లతో కలిసి పనిచేశాను. వాళ్లందరూ చాలా సరదాగా చేశారు. చాలా సులువుగానే చేశాను`` అని అన్నారు.
ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ``తెలుగులో మాట్లాడుతున్నప్పుడు వినడానికి చాలా సొంపుగా ఉంది.వినేకొద్దీ వినాలనిపిస్తోంది. చాలా మంచి లాంగ్వేజ్ ఇది. మా గురువుగారు మణిరత్నంగారు ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేసేటప్పుడు పనిలా అనిపించదు. మేమిద్దరం కలిసి కూర్చుంటే టైమ్ గురించి పట్టించుకోను. తమిళ్‌లో తొలి పాటను విడుదల చేయడానికి ముందు నేను ఒక పాటనే చేసిచ్చాను. ఆ తర్వాత మరో పాటను చేశాను. నేను యు.ఎస్. ట్రిప్‌లో ఉండగా ఓ రూమ్ తీసుకుని అక్కడ ఎక్విప్‌మెంట్‌ను అమర్చుకుని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశాను. మణిరత్నంగారు నమ్మారు.. కావాలంటే అసిస్టెంట్‌ని పంపిస్తానని చెప్పారు. కాదు.. నేను పని చేస్తున్నానని అక్కడ వీడియో తీసి చూపించేవాడిని. ఆయన నన్ను నమ్మారు. ఆశీస్సులు అందించారు. `నవాబ్` అనేది మణిరత్నంగారి పూర్తి స్థాయిగా ఉంటుంది. నేను పాటల విషయంలో చిన్న ఛాన్ప్ కూడా తీసుకోదలచుకోలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఇంకో పాటను పెడదామనిపించింది. అప్పుడు ఇంకో పాటను చేసి నేను రాఖీ చేత రాయించాను. మణిరత్నంగారు లిరిక్స్ విని ఎవరు రాశారని అడిగారు. నేను అప్పుడు చెప్తే రాఖీ అని అన్నారు. సీతారామశాస్త్రిగారు చాలా మంచి సాహిత్యాన్నిచ్చారు`` అని చెప్పారు.
తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న అశోక్ వల్లభనేని మాట్లాడుతూ ``నా 15-16 ఏళ్లప్పుడు.. అంటే అప్పుడే నిక్కర్ల నుంచి ప్యాంట్‌లలోకి మారుతున్న సమయం అది. ఆయనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన్ని కలవడమే కష్టం అని అనుకుంటుంటే.. అలాంటిది సార్ పక్కనే కూర్చుని, ఆయన సినిమా తెలుగు వర్షన్‌కి నేను నిర్మాత కావడం నా అదృష్టం. ఇది నాకు అశీర్వాదం. రెహమాన్‌గారు ఎంత ప్రముఖులో అందరికీ తెలుసు. ఆయనతో సినిమా చేయకపోయినా, ఆయన సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటం చాలా ఆనందగా ఉంది. నేను `నాయకుడు`ని ఇప్పటికి 30 సార్లు చూశా. ఆ సినిమా చూసి స్మగ్లర్ అయిపోదామని అనుకున్నా. దొంగ దొంగ సినిమా చూస్తే దొంగతనాలు చేయాలని అనిపించేది. ఇప్పుడు ఆయన పక్కన ఉంటే గుండె దడదడగా కొట్టుకుంటోంది. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఇలాగే జర్నీని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నా. మణిరత్నం సార్ ఇచ్చిన ధైర్యంతో, ఈ సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేనే విడుదల చేస్తున్నా. అలాగే అరవింద్ స్వామిగారి రోజా, బొంబాయి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన మెయిన్ లీడ్ రోల్ అనే నేను సినిమాను ఓన్ రిలీజ్ చేయడానికి ముందుకొచ్చాను. అందరి సహకారంతో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నా`` అని చెప్పారు.
జీవిత మాట్లాడుతూ ``అశోక్ వల్లభనేనిగారు మాకు బాగా తెలుసు. ఆయనకు సినిమా పరిశ్రమకు రావాలని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నారు. మంచి సినిమా ఉంటే అనువాదం చేస్తానని చాలా సార్లు చెప్పారు. ఈ సినిమాతో ఆయన నిర్మాతగా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను తప్పకుండా తొలి రోజు, తొలి షో చూస్తాను`` అని అన్నారు.
చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ `` మిత్రుడు అశోక్ నాయకుడు చూసి స్మగ్లర్, దొంగ దొంగ చూసి దొంగ కావాలని అనుకున్నారు. కానీ కాకపోవడం సంతోషం. ఈ సినిమాను నిర్మాత కావడం చాలా ఆనందంగా ఉంది. రెహమాన్‌గారి సంగీతానికి విశ్వవ్యాప్తంగా అభిమానులున్నారు. ఆయనతో ఎప్పుడో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాను. నవాబ్ ఆడియో వేదిక మీద ఆయనతో నిలుచుని మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ అశోక్ ఈ సినిమాతో పెద్ద నిర్మాత కావాలి`` అని అన్నారు.
తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ``ఈ సినిమా మీద నమ్మకంతో వల్లభనేని అశోక్ ఓన్ రిలీజ్‌కి వెళ్తున్నారు. ఇక్కడ థియేటర్స్ మాఫియా థియేటర్లు ఇవ్వనన్నప్పుడు కూడా ఆయన ధైర్యాన్ని వదల్లేదు. రెహమాన్, మణిరత్నం, సీతారామశాస్త్రిగారు, శ్రీకర్ ప్రసాద్, సంతోష్ శివన్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన సినిమా ఇది. రెండు గంటల 23 నిమిషాల్లో నవాబ్ తీశారు మణిరత్నంగారు. వల్లభనేని అశోక్‌గారు పెట్టుకున్న నమ్మకం, ఈ టెక్నీషియన్ల కష్టం ఫలించి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి`` అని అన్నారు.