అక్కినేని నాగచైతన్య, నిధీ అగర్వాల్ జంటగా నటించిన సినిమా 'సవ్యసాచి'. చందూ మొండేటి దర్శకుడు. 'ప్రేమమ్' తరవాత నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి (సీవీయం) నిర్మించారు. యం.యం. కీరవాణి సంగీతం అందించారు. నవంబర్ 2వ తేదీన విడుదలవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు కొరటాల శివ, హీరో విజయ్ దేవరకొండ ఈ ఫంక్షన్‌కి అతిథులుగా విచ్చేశారు. ఇందులో 'సవ్యసాచి' బిగ్ టికెట్‌ను విజయ్ దేవరకొండ లక్ష రూపాయలు పెట్టి కొన్నారు.
పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ "అమ్మ మీద ఎవరు అన్ని పాటలు రాసినా... ఎన్ని రకాలుగా రాసినా... అద్భుతంగా, అమృతంలా ఉంటాయి. అలాంటి అమ్మ పాట ఈ సినిమాలో రాసే అవకాశం నాకు దక్కింది. దర్శకుడు చందు అమ్మ పాట రాయాలని చెబితే చాలా సంతోషించాను. నా మటుకు నాకు ఎక్కువ అమ్మ పాటలు రాసిన గుర్తు లేదు. కథకు కీలకమైన, మూలమైన సందర్భంలో వచ్చే అమ్మ పాట రాశా. గురుతుల్యులు కీరవాణిగారు అద్భుతంగా స్వరపరిచారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా" అన్నారు.
పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ "సవ్యసాచి అందుకోబోతున్న విజయానికి సాక్ష్యులుగా నిలిచిన ఈనాటి ప్రేక్షకులకు నా నమస్కారం. 'సవ్యసాచి' గొప్ప పేరు. అర్జునుడి పేరు. రెండు చేతులతో సమాన స్థాయిలో బాణాలు వేయగలిగిన అర్జునుడిని సవ్యసాచి అంటారు. అంత మంచి పేరున్న ఈ సవ్యసాచికి పని చేయడం ఎంత అదృష్టమో. ఈ సినిమాలో నేను కలిసి పని చేసిన మనుషులు కూడా సవ్యసాచులు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నా. ఒకరు... కీరవాణిగారు. ఒక చేత్తో సంగీతాన్ని, మరో చేత్తో సాహిత్యాన్ని అందించగల సవ్యసాచి ఆయన. రెండు.. చందూ మొండేటి. ఒక చేత్తో కథను అందించి, మరో చేత్తో దర్శకుడిగా తెరకెక్కించగలరు. మూడు... మైత్రీ నిర్మాతలు. ఒక చేత్తో సముచితమైన పారితోషకాలు ఇస్తూనే, మరో చేత్తో సంచలనాత్మక వసూళ్లు రాబట్టుకోగలరు. ఈ చిత్రంలో నాలుగు పాటలు రాయడం సంతోషంగా ఉంది" అన్నారు.
గాయని సునీత మాట్లాడుతూ "కీరవాణిగారిది గోల్డెన్ హ్యాండ్. 23 ఏళ్ళ నా కెరీర్లో ఆయన వెన్నంటి ఉండి, నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. ఈ చిత్రం ద్వారా మా అమ్మాయి శ్రేయ చేత ఒక పాట పాడించారు. తనను గాయనిగా పరిచయం చేస్తున్నారు. కీరవాణిగారూ... థాంక్యూ సో మచ్" అన్నారు.
గాయని శ్రేయ మాట్లాడుతూ "నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన కీరవాణిగారికి థాంక్యూ. గొప్ప సంగీత దర్శకుడి చేతుల మీదుగా పరిచయం కావడం నా అదృష్టం" అన్నారు.
నిధీ అగర్వాల్ మాట్లాడుతూ "ఈ రోజు నా జీవితంలో చాలా పెద్ద రోజు. నేను హైదరాబాద్‌లో పుట్టాను. యాక్చువల్లీ.. తెలుగులో నేను ఒక స్పీచ్ రెడీ చేశాను. నెర్వస్‌గా ఉండటంతో మర్చిపోయా. నన్ను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న చందూ మొండేటిగారికి థాంక్స్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు కూడా థాంక్స్. నేను కలిసిన మంచి వ్యక్తుల్లో చైతన్య ఒకరు. తను 100% పర్ఫెక్ట్. మాధవన్ సర్, భూమిక మేడమ్, ఇతర నటీనటులతో పని చేయడం సంతోషంగా ఉంది. అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చిన కీరవాణిగారికి థాంక్స్" అన్నారు.
యం.యం. కీరవాణి మాట్లాడుతూ "నాగార్జునగారితో పని చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో.. ఈ సినిమాకు పని చేసినప్పుడు అంతే హ్యాపీగా ఫీలయ్యా. అనంత శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు చక్కటి పాటలు ఇచ్చారు. మా నాన్నగారు శివశక్తి దత్తాగారు అద్భుతమైన టైటిల్ ట్రాక్ రాశారు. సింగర్స్ అందరూ చక్కగా పాడారు. జీవన్ చక్కగా ప్రొగ్రామింగ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మోహన్ గారు, రవి గారు, నవీన్ గారు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే... ప్రతిదీ తెలుసుకుంటూ ఉంటారు. అలాగే, ఫ్రీడమ్ ఇస్తారు. 'అల్లరి అల్లుడు'లో 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' పాటను ఈ సినిమా కోసం రీమిక్స్ చేయడం జరిగింది. విధి విలాసం చూడండి.. నాగార్జునగారికి, అక్కినేని కుటుంబానికి, నాకూ ఎంత సన్నిహితమైన నిర్మాత కామాక్షి మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డిగారు పరమ పదించడం బాధాకరం. ఆయనకు మోహన రాగం అంటే చాలా ఇష్టం. 'అన్నమయ్య' చిత్రంలో 'పొడగంటిమయ్యా.. పురుషోత్తమా' వంటి పాట కావాలని రిక్వెస్ట్ చేస్తే, 'నేనున్నాను' చిత్రం కోసం 'వేణుమాధవా..' పాట చేసి ఇచ్చా. ఎంత మురిసిపోయారో. మంచి హృదయం ఉన్న వ్యక్తి. ఈ రోజు ఆయన మనమధ్య లేకపోవడం బాధగా ఉంది. చాలా తొందరగా మన మధ్య నుంచి వెళ్లారు" అన్నారు.
హీరో మాధవన్ మాట్లాడుతూ "ఫైనల్లీ.. తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. దీనికి కారణమైన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు థాంక్యూ. మంచి నిర్మాతలు ఉంటే ఇండస్ట్రీ బావుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా సిక్సర్లు కొడుతుండటం నాకు సంతోషంగా ఉంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని వాళ్లకు చెబుతున్నా. నెక్స్ట్ నేను థాంక్స్ చెప్పాల్సింది.. చైతన్యకు! మంచి మనసున్న వ్యక్తులు ఈ సినిమాకు పని చేశారు. నాగచైతన్య పేరెంట్స్‌కి నేను పెద్ద అభిమానిని. వాళ్ళ అబ్బాయితో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా చైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నా. స్టేజి మీద డాన్స్ చేసిన విజయ్ దేవరకొండకు థాంక్స్. నా జీవితంలో స్టేజి మీద డాన్స్ చేయలేదు. ప్రత్యేకంగా వేరేవాళ్ళ ఫంక్షన్స్‌లో అయితే అసలు చేయలేదు. నా ఫంక్షన్స్‌లో చెప్పక్కర్లేదు. అసలు చేయలేదు. తను ఇక్కడ చేశాడు. హి ఈజ్ వెరీ స్పోర్టివ్. ఇక, సినిమా టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. చందూ మొండేటి బాగా చేశాడు. రామకృష్ణ సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. వరల్డ్ క్లాస్ టాప్ సెట్స్ వేశాడు. ఫైనల్లీ... తెలుగులో సినిమా చేయడం సంతోషంగా ఉంది. 100 డేస్ ఫంక్షన్‌లో మాట్లాడతాను" అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ "నేను ఇంటర్ చదువుతున్నప్పుడు 'అల్లరి అల్లుడు' విడుదలైంది. ఫస్ట్ డే సినిమా చూసి... ఇంటికి వెళ్లి డాన్స్ చేశా. 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు' పాట అప్పట్లో ఎంత పెద్ద హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నా ఫ్యామిలీ మెంబెర్స్. వాళ్ళు ఏం చేసినా చాలా కమిట్‌మెంట్‌తో చేస్తారు. ప్రతి సినిమాను చాలా పెద్ద సినిమా చేయాలనే ప్రయత్నంతో చేస్తారు. అది చాలా గొప్ప విషయం. ఈ సినిమా మైత్రీ సంస్థలో నాలుగో బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నా. 'సవ్యసాచి' పవర్ ఫుల్ టైటిల్. ట్రైలర్స్ చూశా. అద్భుతంగా ఉన్నాయి. ఇటువంటి కథ రాసిన చందూ మొండేటిగారికి స్పెషల్ విషెస్ చెప్పాలి. ఇలాంటి కథకు లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిగారి సౌండ్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ట్రైలర్స్, పాటల్లో చూశాం. ప్రతి పాట ఫెంటాస్టిక్‌గా ఉంది. నాగచైతన్యగారు సినిమాలో ఇంటెన్స్‌గా కనిపిస్తున్నారు. వెరీ ప్రామిసింగ్. ఆయన చేతుల్లో ఒక హిట్ సినిమా ఉంది. చాలా పెద్ద సినిమా అవుతుందని అనుకుంటున్నా. నాకిష్టమైన నటుల్లో ఒకరైన మాధవన్ గారు ఈ సినిమాలో నటించడం గొప్ప విషయం. ఎంతో ప్రతిభావంతులు ఈ సినిమాకు పని చేశారు" అన్నారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ "కీరవాణిగారిని చూసినప్పుడల్లా ఆయన్ను కౌగిలించుకోవాలని అనిపిస్తుంది. కానీ, ఊరికే ఊరికే హాగ్ ఇస్తే బాగోదని చాలాసార్లు కంట్రోల్ చేసుకున్నా. ఫస్ట్ టైమ్ కీరవాణిగారిని బాంబే నుంచి ఫ్లైట్ లో వస్తున్నప్పుడు కలిశా. నా వెనుక సీటులో కూర్చుకున్నారు. ఫ్లైట్ లో ఏదో ఫుడ్ ఆర్డర్ చేస్తే... నా దగ్గర డబ్బుల్లేవు. ఎప్పుడూ ఇదే పరిస్థితి. అప్పుడు కీరవాణిగారు వచ్చి డబ్బులు కట్టారు. మాకు ఫుడ్ ఉండేలా చూసుకున్నారు. ఐ లవ్ కీరవాణి సర్ మ్యూజిక్. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా. నేను ఒక సినిమా చేసిన తరవాత మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ గారు, నవీన్ గారు ఫోన్ చేసారు. రేపు కలుద్దామా? ఎల్లుండి కలుద్దమా? అంటే... అర్జెంటుగా కలవాలి అన్నారు. నా ఆఫీసుకు వచ్చి కలిశారు. అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది. ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో సినిమా కూడా దింపుతున్నాం. 'సవ్యసాచి'తో వాళ్ళు గట్టిగా కొడతారని నమ్ముతున్నా. మాధవన్ సర్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయడం సంతోషంగా ఉంది. ఆయన తమిళ సినిమాలను ఇక్కడ చాలామంది చూస్తారు. ఎందుకో తెలియదు.. నాగచైతన్య అంటే నాకు ఇష్టం. నాకు చైతన్య అంటే చాలా చాలా ఇష్టం. ఒక్కసారి కలిశా. షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్విన విధానంలో మస్తు చిల్ రిలాక్సడ్ వైబ్ ఉంటుంది. నాకు ఇండస్ట్రీలో ఎవరూ ఫ్రెండ్స్ లేరు. కానీ, ఇండస్ట్రీలో చైతన్య గురించి ఎవరు మాట్లాడినా 'చై ఈజ్ అమేజింగ్ ఫెలో' అంటారు. అందరూ చైతన్యను ప్రేమిస్తారు. సినిమాలో యాక్టర్లు అయిపోయినం గానీ.. యాక్టర్ కాకుండా బయట కలిస్తే గుడ్ ఫ్రెండ్స్ అవుతాం. చైతన్యకు గుర్తు ఉండి ఉండదు... తనను నేను తొలిసారి ఎక్కడ కలిశానంటే? నేను డిగ్రీలో ఉన్నాను. 'జోష్'తో తను హీరోగా లాంచ్ కావడానికి రెడీ అవుతున్నాడు. నాకు యాక్టర్ అవ్వాలనే కోరిక కొంచెం కొంచెం ఉంది అప్పట్లో. నాకు తెలిసిన వినోద్ బాల అంకుల్ చైతన్యతో అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ వర్క్ షాప్ చేస్తున్నారు. ఆ రోజు నన్ను అన్నపూర్ణ లోపలికి పంపిస్తారో లేదో అని భయపడ్డా. గేట్ నుంచి రిటర్న్ పంపిస్తారేమో అని టెన్షన్ పడుతూ వెళ్ళా. కానీ, లోపలికి వెళ్లనిచ్చారు. అక్కడ చైతన్య, వినోద్ బాల అంకుల్ మాత్రమే ఉన్నారు. చైతన్యకు గుర్తుంటే.. అక్కడ మరో అబ్బాయి ఉన్నాడు. అది నేను. చిన్నప్పుడు 'శివ', 'క్రిమినల్', 'గోవిందా గోవిందా' చూసి నాగ్ సర్ అంటే ఒక పిచ్చి ఉండేది. నాగ్ సర్ కొడుకు.. అన్నపూర్ణ స్టూడియో అనగానే మరో ప్రపంచం అన్నట్టు ఉంది. ఈ రోజు చైతన్య ఫంక్షన్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది. నవంబర్ 2న వస్తున్న 'సవ్యసాచి' పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా" అన్నారు.
దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ "నేను చాలా మాట్లాడాలి. అందుకని, రిలీజ్ తరవాత మాట్లాడతా" అన్నారు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ "మా మైత్రీ సంస్థ ఈ రోజు ఇలా ఉందంటే దానికి ముఖ్య కారణం కొరటాల శివగారు. ఆయనకు, ఇక్కడ అతిథిగా వచ్చిన విజయ్ దేవరకొండకు థాంక్స్. ప్రస్తుతం విజయ్‌తో మేం 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాం. ఈ సినిమాను మాతో చేసిన నాగచైతన్యగారికి థాంక్స్. ఆయనతో మంచి ప్రేమకథ చేయాలని ఉంది. త్వరలో చేయాలని అనుకుంటున్నాం. 'సఖి' నుంచి 'విక్రమ్ వేద' వరకూ మాధవన్ సినిమాలకు ఇక్కడ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. చందూ మొండేటి ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు. 'బాహుబలి2' తరవాత కీరవాణిగారు ఈ సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం" అన్నారు.
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ "ఇక్కడికి వచ్చిన కొరటాల శివగారికి ముందుగా థాంక్స్. మిస్టర్ రౌడీ.. థాంక్యూ సో మచ్. ఆ స్టోరీ చెబుతుంటే.. ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. ఒకసారి పబ్‌లో కలిసి సరదాగా ఒక మంచి డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం... త్వరలో! ఒక బ్యాడ్ న్యూస్ తో ఈ రోజు ఉదయం నిద్ర లేచా. శివప్రసాద్ రెడ్డి గారు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. అక్కినేని ఫ్యామిలీకి, నాన్నకు ఆయన ఎంత సపోర్ట్ ఇచ్చారో అందరికీ తెలుసు. ఆయన కుటుంబానికి భగవంతుడు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. అక్కినేని అభిమానులంతా మా కుటుంబమే. తాతగారు ప్రారంభించిన జర్నీ. అక్కడ మీరు (అభిమానులు) అందుకున్నారు. నాన్నకి సపోర్ట్ ఇచ్చారు. అఖిల్‌కి సపోర్ట్ ఇచ్చారు. నాకు ఇచ్చారు. సుశాంత్, సుమంత్.. అందరికీ ఇచ్చారు. జనరేషన్స్ మారుతున్నాయి కానీ.. మీ సపోర్ట్ మారలేదు. ఇంకా పెరుగుతూ ఉంది. థాంక్యూ. కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని డిజప్పాయింట్ ఇస్తా. కొన్ని కొన్నిసార్లు ఎనర్జీ ఇస్తా. కానీ, ఏది ముఖ్యం అంటే.. మనమంతా ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలి. అభిమానులకు అభిమానులు మా అక్కినేని అభిమానులు. ప్రతి సినిమా అభిమానులు సంతోషపడాలని నిజాయతీగా, సిన్సియర్‌గా చేస్తాను. నాకంటే ఎక్కువ ఈ సినిమాకు చందూ మొండేటి సిన్సియర్‌గా చేశాడు. చందు అభిమానుల్ని ఎంత ప్రేమిస్తాడో నాకు తెలుసు. మిమ్మల్ని సంతోషపెట్టాలని సినిమా చేస్తాడు. యూనిక్ పాయింట్ అయినా కావలసిన కమర్షియల్ ఎలెమెంట్స్ అన్ని యాడ్ చేసి ఒక అల్ రౌండ్ మూవీ చేశాడు. ఒక లవ్ స్టోరీ 'ప్రేమమ్'తో అభిమానులను ఎలా ఎంటర్‌టైన్ చేశాడో.. కంప్లీట్ ఆల్ రౌండ్ కమర్షియల్ మూవీ 'సవ్యసాచి'తో అలాగే ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కీరవాణిగారు తాతగారితో, నాన్నతో చేశారు. ఆయనతో పని చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమా షూటింగుకు వెళ్తున్నప్పుడు ఫోన్ చేసినంతమంది అమ్మాయిలు, ఇంతకు ముందు ఏ షూటింగుకు వెళ్తున్నప్పుడూ ఫోన్లు చేయలేదు. 'మేం షూటింగుకు రావొచ్చా' అని అడిగేవారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం మారలేదు. మాధవన్ గారు ఈ సినిమా అంగీకరించినప్పుడు నాకు, చందూకు ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏదో కొత్తదనం ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. మైత్రీ మూవీ మేకర్స్ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. నేను, చందు ఒకలా చేయాలని అనుకుంటే వాళ్ళు భారీ స్థాయికి తీసుకువెళ్లారు. నా కెరీర్లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ ఇది. మొన్న కూడా చెప్పాను.. కాంబినేషన్ నమ్మి మా నిర్మాతలు సినిమా తీయలేదు. కంటెంట్ ని నమ్మి సినిమా తీశారు. తప్పకుండా అభిమానులు హ్యాపీగా ఉంటారు. డిజప్పాయింట్ అవ్వరు" అన్నారు.