శివానీ శివాత్మిక సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌లో డా.రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సి.కల్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం `కల్కి`. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా...
నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ - ``గరుడవేగ హిట్ తర్వాత మరో డిఫరెంట్ కథాంశంతో రాజశేఖర్ చేస్తోన్న చిత్రమిది. 70 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. 30 శాతం మిగిలి ఉంది. మార్చి, ఏప్రిల్‌లో మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేస్తాం. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం. సినిమా పూర్తి బాధ్యతను ప్రశాంత్ వర్మ మోస్తున్నాడు. `అ!` తర్వాత తనకొక మంచి హిట్ వస్తుందని అనుకుంటున్నాను. `శేషు` తర్వాత రాజశేఖర్‌తో నేను చేస్తోన్న సినిమా ఇది. ఈ టైటిల్‌ను కార్తీక్ అనే డైరెక్టర్ రిజిష్టర్ చేయించుకున్నాడు. నేను అడగ్గానే ఇచ్చాడు. ఈ సందర్భంగా తనకు థాంక్స్ చెబుతున్నాను. కర్ణాటక, తమిళనాడులో ఓ షెడ్యూల్, హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది`` అన్నారు.
డా.రాజశేఖర్ మాట్లాడుతూ - ``గరుడువేగ తర్వాత ఆరు నెలలు పాటు మంచి కథ కోసం వెయిట్ చేశాం. ఆ సమయంలో ప్రశాంత్ వర్మ చెప్పిన కథే ఇది. చాలా రోజుల తర్వాత సి.కల్యాణ్‌గారి బ్యానర్‌లో చేస్తున్నాను. గరుడవేగ తర్వాత సి.కల్యాణ్‌గారు నాతో సినిమా చేయడానికి వచ్చారు. ఆయన బ్యానర్‌లో సినిమా చేయడం హ్యాపీ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నుండి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. గరుడవేగ సమయంలో ఎంత కొత్తగా ఫీలయ్యానో.. ఈ సినిమా విషయంలో కూడా అంతే కొత్తగా ఫీలవుతున్నాను. మరింత మంది కొత్త దర్శకులతో పనిచేయాలని ఉంది. నా కంటే జీవిత ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడింది. సినిమా గురించి ఇప్పుడేం మాట్లాడను. సినిమా విడుదలైన తర్వాత మాట్లాడుతాను`` అన్నారు.
ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ - ```అ!` కంటే ముందే ఈ సినిమా చేయాల్సింది. కొంచెం ఆలస్యమైంది. `కల్కి` అనేది పెద్ద టైటిల్. `అ!` కంటే కష్టపడి స్క్రిప్ట్ తయారుచేసుకున్నాను. ఓ బాధ్యతగా, గౌరవంగా భావించి చేస్తున్న సినిమా. రాజశేఖర్‌గారితో మళ్లీ సినిమా చేయాలనుంది. కమర్షియల్ ఫార్మేట్‌లో ఇదొక డిఫరెంట్ సినిమాగా ఉంటుంది. దీనికి ఫ్రాంచైజీ కూడా చేయాలనుకుంటున్నాం. ఆ కోవలో `కల్కి2` చేస్తున్నాం. నెక్ట్స్ రాజశేఖర్‌గారి పుట్టినరోజుకి `కల్కి2` కూడా చేస్తాం. ఇందులో రాజశేఖర్‌గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కూడా కనపడతారు. ఆయన ఓన్ బాడీలాంగ్వేజ్ కూడా ఈ సినిమాలో చూపిస్తాం. సీరియస్‌నెస్‌తో పాటు కామెడీ కూడా పాత్రలో ఉంటుంది. అన్నీ వర్గాలను ఆకట్టుకునే సినిమా అవుతుంది`` అన్నారు.
జీవిత మాట్లాడుతూ - ``గరుడవేగ`కు ముందు అదఃపాతాళానికి వెళ్లిపోయాం. డబ్బును సంపాదించుకోవచ్చు కానీ.. కెరీర్‌ణు నిలబెట్టుకోవడం చాలా కష్టం. గరుడవేగకు చాలా మంచి పేరు వచ్చింది. బాహుబలితో పాటు చాలా మంది గరుడవేగ గురించి కూడా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం సినిమాలు తీయడం కష్టమైన తరుణంలో ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎలా చేయాలని ఆలోచించాం. ఆ సమయంలో కల్యాణ్‌గారు ముందుకు వచ్చి సపోర్ట్ అందిస్తున్నారు. ప్రశాంత్ వర్మ కథ, డైలాగ్స్ మాత్రమే ఇచ్చాడు. తను డైరెక్ట్ చేయడేమో అనుకున్నాం. కానీ చివరకు తను డైరెక్ట్ చేయడానికి అంగీకరించడం ఆనందంగా ఉంది. మే నెలలో సినిమాను విడుదల చేద్దామనుకుంటున్నాం`` అన్నారు.