26 February 2014
Hyderabad
రాహిత్య
చిన్న పరిధి మాది
తప్పువప్పుల తేడాల వాదులాడుకుంటూ
మంచిచెడుల భేదాల తర్కించుకుంటూ
పాపపుణ్యాల బేరీజులు లెక్కించుకుంటూ
నీ ప్రాపు కోసము ప్రాకులాడే దైనిందినము మాది
నీ లోతుపాతుల విషయమెరుగక
మా లోటుపాట్లు కప్పిపుచ్చుకుందుకై
మమ్ము పీడించు భయ అభద్రతలకు రూపులను ప్రతిపాదించి
ఆ రూపు నీకే చెరుపు చేయు దుస్సాహసములను ఊహించి
నీ సృష్టినుండి నిన్నే రక్షించి లీలలని మురిసేము
మా బింకము సడలకుండుటకు గాను నిన్ను బలహీను జేసి
భగవంతుడే బెంబేలు చెందగాలేనిది మేమెంత అనుకుని
నీకు గుణపాఠాల పేరుతో మేము తగు పాఠాలు నేర్చేము
నీ అస్థిత్వమను మా నుండి వేరు చేసి చూడలేని
చాల చిన్న పరిధి మాది
అనంత విస్త్రుతి నీది
ప్రాణికోటి ప్రతిరూపూ నీదే అయినటుల
అంతటిపై సమదృష్టి తక్క ఆస్కారము లేదు
గుణత్రయములు నీనుండే ఉద్భవించెనేని
హీన నీచములైన తిరస్కారము రాదు
సమస్తమూ నీలో సమసిపోయినంత
కటాక్షములు కార్పణ్యములు అడ్డుపడగజాలవు
మా నిరంతర గమనములో నీ చేయూత రవ్వంత ఉండదను నిజము
నీ గొంతు దిగని గరళము కన్న ఘాటైన వాస్తవము
మా స్తుతులు స్తోత్రాలు నీ చెవులకు
విశ్వాంతరాళములో మార్మ్రోగు నీరవాలు
కారణకర్తవు కావు కేవలము నిమిత్తనేత్రుడవనీ
జగతిపతివైనా నీ ప్రత్యక్ష పర్వ్యవేక్షణ పెట్టవనీ
నిస్తేజు చేయు సత్యాలు మమ్ము ఆచేతనము చేసినా
సమతుల్యము సమభావము సమ్యమనము
నీ తటస్థ వైఖరి చూచి అలవరచుకుందుము
చిన్న గిరి గీసుకుని చింత చెందు మాకు
పరిధి పెద్దది చేసి చూసినంత
వైశాల్యములు పెరిగి వైకల్యములు విరిగి
మాలో నిద్రాణమైన నీ తత్వమును గుర్తుచేయు
అనంత విస్త్రుతి నీది