31 March 2014
Hyderabad
ఇది మొదలు
మామిడాకుల తోరణాల ముంగిళ్ళూ
పచ్చదనాల పరిమళాల వాకిళ్ళూ
విరులబంతుల వింతకాంతుల లోగిళ్ళూ
ఆరురుచుల ఓలలాడిన అంగళ్ళూ
వంటలూ వినోదాలూ సరదాలూ సందళ్ళూ
ప్రకృతి పరిభ్రమణానికి పరమార్ధమిదేనా?
మట్టికొట్టుకుపోయిన వట్టిబతుకులకు పుప్పొళ్ళ గంధాలూ
కడుపుమంటలంటిన ఆకలిపేగులకు పరమాన్నభోజ్యాలూ
రేపన్న ప్రశ్నలో మునకలేయు మనుషులకు సంవత్సర సంగతులూ
చేదురుచి మరిగిన చింతజీవులకు షడ్రుచుల కీలకాలూ
సమస్యలూ సతమతలూ పాట్లూ పోరాటాలూ
సరిక్రొత్త ప్రొద్దుకు సరిజోడు బదులీయగలిందే సిసలైన పండుగ
నుదుటిగీతలు తిరగరాసే చుక్కల సమూహాలూ
చేతిరాతలు చెరిపివేసే గ్రహాల కప్పదాట్లూ
రానున్న ఆపదలనుండి అప్రమత్తు చేయు అవమాన ఘంటికలూ
చీకాకు చీకట్లలో ఆశలను రాజేయు రాజపూజ్య దివిటీలు
భయాలూ అభయాలూ నిస్పృహలూ తన్నివారణలూ
గగన సీమల గ్రహాల విహారాల గూడార్ధమిదేనా?
నింగిని పైకప్పుగా వేసుకుని తారలతో చెలిమిని చేసుకుని
ఎండవానలను అప్యాయతన ఒడలుతడుము బందుగులుగా మసలుకుని
పుట్టినచోటు జీవితగతిని నిర్దేశించు విధాతగా తెలుసుకుని
ఊహలను ఎగరనీయని కోరికలను పెరగనీయని బడుగు బతకుకులలో
గ్రహాలూ అనుగ్రహాలూ చక్రాలూ చక్రవ్యూహాలూ
ఆగ్రహించిన ప్రతి గ్రహముతో పేచేలే నిగ్రహించిన ప్రతి రాశితో రాజీలే
ప్రేరణ: సిరివెన్నెల 'నేను సైతం' చిత్ర గీతం