22 October 2014
Hyderabad
ఏమని పొగడుదుమే?
భరింపరాని భారమును దించుకున్నందుకా
క్షమించరాని నేరములను శిక్షించినందుకా
భార్యగా బరువును పంచుకున్నందుకా
పట్టమహిషిగా ధర్మము నిలిపినందుకా
కన్నకొడుకని చూడక కడతేర్చినందుకా
భూమాతగా బాధ్యత నెరపినందుకా
పెంజీకట్లపై పోరు గెలిచినందుకా
ఇక్కటలనుండి బయట పడవేసినందుకా
చిమ్మ చీకటిలో వెలుగు వాటికలు వేసి
ప్రతి సాలు ఏ పేరున ఈ పండుగను పలుకరించేము?
తక్కిన పురాణగాధలకంటె ఈ నరకకధ కడు విడ్డూరం
కన్నుపొడుచున్నా కానరాని కాళరాత్రి
తిమిరాంధకరపు దాష్టీకానికి దృష్టాంతం
నలుదిక్కులకు ఙ్ఞానజ్యోతిని ప్రసరింపనీయక
అడ్డుపడు పైశచికత్వమునకు నరకుడు ప్రతిరూపం
ముందుకాళ్ళ బంధానాల ముళ్ళు విప్పుకుని
పక్కతోడు పోయినా పరాక్రమమును పోగుచేసుకుని
సమరాంగణాన స్వశక్తిని కూడదీసుకుని
ఏకదీక్షతో విజయసాధనకై సత్య నడిచిన బాట
బాణాసంచా పేరిట ఙ్ఞప్తికుంచుకుందుము ప్రతి యేట