16 February 2015
Hyderabad
మూలం
కాలానికి అతీతమై నిలిచి
అర్ధానికి అందనిదై మిగిలే
నిత్యమైన సత్యము ఏమిటది?
తనను అంతటా చూపి
అనంతములో అన్నింటిని కలిపే
సర్వమైన శివము ఏదది?
కూర్చుకున్న భాషలో అమరి
అందుకునే భావములో ఒదిగే
శాశ్వత సౌందర్యము దేనిది?
బంధానికి కట్టుబడని కళ్ళు
రాగానికి పట్టుబడని చూపు
స్తిమితమైన దృష్టియే సత్యము
గతిని కాలానికి కిచ్చి
మతిని ఆలోచనకి కూర్చి
వేదికైన సృష్టియే శివము
అణువు మొదలు బ్రహ్మాండము వరకు
వేరు ద్రవ్య రాసులను ఒక్కతాటిన కలుపు
అంతస్సూత్రమైన ప్రేమయే సుందరము
ఎరుక కలిగిన యోగమే ఈశ్వరము
నిశ్చల తత్వమే సచ్చిదానందము