20 March 2015
Hyderabad
విమర్శ
శక్తి వంచన లేకుండా గుండె గంట కొట్టుకుని పోతోంది
ఎవరి ప్రోద్బలం లేకుండా కాలం కీలు కదలి పోతోంది
ఊపిరి పాటలు దివరాత్రుల ఆటలు నిశ్శబ్దంలో జరిగిపోతున్నాయి
అనుభవాల జడిలో ఙ్ఞాపకాల తడిలో రోజులు దొర్లిపోతున్నాయి
ఇక చెప్పుకోవడానికి మిగిలినవల్లా మైలురాళ్ళు
గతం నేటికి వేసే ప్రగతికి పునాదిరాళ్ళు
బ్రతుకుకు అర్ధం పరమార్ధం సాధన శోధనే
కార్య రాహిత్యము కామ్య శూన్యత్వము మరణముతో సమానమే
ప్రయాస పడని పనిని నెత్తికెత్తుకున్న ప్రయోజనమేమి?
నుదుట చెమట చిందని చాకిరీన కలుగు ఉపయోగమేమి?
ఇది జంతుకోటి నుండి నేర్వవలసిన ఆవశ్యకమే
ఆటలో వేటలో కుదురన్నది లేని కదలిక అందుకు నిదర్శనమే
నిరుడులా ఈ యేడూ సాఫీగా సాగిపోవలెనన్న ఆలోచన
అవయవాలు ఉడిగిన ఆచేతనమును కోరుకొను మృతచింతన
ఒడిదుడుకులు ఉథ్థాన పతనాలు పురోగతికి ప్రతీకలు
ఇవిలేని జీవితపు మూల్యము గాలివాలున పోయే గడ్డిపోచకు సమానం
మదిని కదిలించని మతిని మధించని బ్రతుకును ఎన్నడూ కోరుకోకు
నీకు ఇంధనమివ్వ లోన కణకణము రగులుతున్న మాటను మరచిపోకు
కాలాన్ని చక్రాన్ని చేసి మరలి వచ్చే రోజుని మరల పలకరించే ప్రయత్నం
ప్రతి వత్సరం నీ సంకల్పాన్నీ ప్రయత్నన్నీ ప్రశ్నించుకునే అవసరం అవకాశం