11 November 2015
Hyderabad
సమరం
పంటి బిగువులలో నవ్వుల మతాబాలు నొక్కి
కంటి ప్రమిదలలో చూపుల వత్తులు వేసి
తేలియడు మనసుల తారాజువ్వలు ఎగరేసి
చిచ్చర వయసుల చిచ్చుబుడ్లను ఎగదోసి
వొళ్ళు వెలుగు వేడుకులకు వప్పజెప్పు వేళిది
రెప్పల మూతలలో చీకట్లను బంధించి
మాటల సందులలో నిశ్శబ్దాలపై లంఘించి
వాకిళ్ళ వెంబడి వెలుగు వారధులు నిర్మించి
సుశిక్షితులైన ప్రమిద సైన్యమును నడిపించి
నెలరాయని దాచేసి చీకట్ల ఇక్కట్లు గురిచేయు
నింగి నంగనాచికి గట్టి బుద్ధి చెప్పు రణ తరుణమ్మిది
విస్ఫోటాలతో వినికిడి వణికింది
క్షిపణులతో చూపు చెదిరింది
కార్చిచ్చు కాలరాత్రికి కంటికి కునుకు లేకుండా చేసింది
శబ్దకాంతుల మూకుమ్మడి దాడి నిశ్శబ్దమును దాసోహమనిపించింది
విజయవార్తలు మోసుకుని పోవు వెలుగు రేఖల వాణి వినీలాకాశాన విస్తరించింది
అంబరాన్నంటు సంబరాలు ముచ్చటగా ముగిసినాయి
కుత్తుకలు తెంచు కార్పణ్యాలు శాంతితో సమసినాయి
క్రితము రాత్రి బుస్సుమన్న ఉత్సాహాలు మరు ప్రొద్దుకు తుస్సుమన్నాయి
ఆనందాల అవశేషాలు యుద్ధభూమిలో విగత జీవులవలే పడిఉన్నాయి
ఓదార్పుల ఊడ్పులలో ఆవిరైన చైతన్యం అక్కడక్కడా చిటపటమన్నది
సమవర్తియైన కాలం బలం కూడగట్టుకుని మరుయేటికి మళ్ళీ సమాయత్తమయినది