07 March 2016
Hyderabad
బొమ్మ-బొరుసు
స్థిరమైన మదిలో కదలిక కలిగింది
స్థాణువైన అస్థిత్వము చలనమును కోరింది
మొండి గుండెలో తలపు చిగురు వెసింది
మౌని గొంతులో బ్రతుకు పాట పలికింది
ఆరాధన అనురాగమై క్రొత్త బాట పట్టింది
భక్తితో మొదలయినది బంధమై ముగిసింది
ముగ్ధమోహన రూపము బూదికుప్పగా మిగిలింది
చిచ్చుకంటి హృదిలో కార్చిచ్చు రగిలింది
వియోగ దుఃఖము విస్ఫోటమై పెల్లుబిక్కింది
లయంకరుని కడ మరణ మృదంగము మార్మ్రోగింది
ప్రణయము నాట్యమాడిన చోట ప్రళయము తాండవించింది
విరియబోతున్న వలపు మొగ్గలోనే వాడిపోయింది
ధ్యానమున కూర్చున్నా గాని ధ్యాస మరలిపోదు
కాంక్ష కట్టడి చేయనందుకు శిక్ష తప్పిందికాదు
మనసు మాట విన్నందుకు దాని గారడీ చూపక మానదు
భవములో భావము తెలిసి వచ్చింది తుదకు
మరలెన్నడు దృష్టిని సృష్టి వైపుగ మరలనీడు
ఆత్మావలోకనముతో అంతర్ముఖుడాయె అనంతుడు
పూవింటి శరము పులకలను పుట్టించె
భగ్నమైన మదికి మరల భంగము వాటిల్లె
కృద్ధుడై కపర్ది కోర్కెను బుగ్గి చేసె
కుదుటపడుతున్న మనసున తిరిగి కలలము రేగె
ఎదుట నిలిచింది ప్రసన్నతకు కైమోడ్చి ప్రకృతి
భక్తితో తిరిగి భవుని గెలవనెంచిన పార్వతి
శరీరాలు మారినా సజీవమైనది ప్రేమ
చిరంతనమూ నిరతరమైన జీవనది ఈ ప్రేమ