15 April 2016
Hyderabad
వియోగము
జరిగిన ఉదంతానికి ఉమెత్త ఉలుకులేక ఉన్నమాటున
గడిచిన దురంతము పాలుపోక ఉడత చేష్టలుడిగి చూస్తున్న చోటున
రెప్ప పాటులో మెరపు తీగలా సీత నింగిదారి పట్టె
కమ్ముకొస్తున్న కారుమబ్బులా దశకంఠు రధము తరుముకునిపోయె
గాలి భీతిల్లి స్థంబించె నేల మ్రాంపడి మిన్నకుండె
అందెల సడి రవళిలో రింగుమన్న తపోవాకిటన
ఎండుటాకుల చిటుకుల స్మశాన మృత్యుఘోషా కదంబం
చెట్లపాదుల నీటి గలగల కేరింతల బదులుగ
చెక్కలై పడిఉన్న కుండవ్రక్కలో ఊయలూగుతున్న కన్నీటి కెరటం
శుకపికల చుట్టపక్కాలతో పెళ్ళి పందిరిని తలపించు పర్ణశాల
నిలిచె పాడె ఊరేగింపు పిదప మొండిగా నిలిచిన మరణవాకిలిగ
కంటి ఎదుట దృశ్యము బుద్ధి తర్కించలేదు
బుద్ధి ఎంచు కీడు మాట పలకించలేదు
మాట పెకిలించిన భావము మనసు ఒప్పుకోలేదు
మనసు స్థాపించిన సత్యము మనిషి భరియింపలేడు
నిర్జీవమైన స్థలిని చూసి నిర్వీర్యుడయ్యె సీతాపతి
కోరిక వెలిబుచ్చిన వైదేహి మీదనో
వదినను వదిలొచ్చిన సౌమిత్రి మీదనో
పన్నాగము పన్నిన హరిణము మీదనో
మోసమును కనలేని పరిణితి మీదనో
కానలకు పంపిన కైక మీదనో
తొలుత మాట ఇచ్చిన ముదుసలి తండ్రి మీదనో
అది ఆవేశమో, ఆక్రోశమో, క్రోధమో, కోపమో, బాధో, వ్యధో
పెల్లుబిక్కెనా స్వరకుహరాన దిక్కులు పిక్కటిల్లు పొలికేక