13 January 2017
Hyderabad
బొమ్మల కొలువు
అదొక క్రిక్కిరిసిన జనావాసాము
వింత రంగుల రంగస్థలము
పాల బుగ్గల పారాడు పసిపాపల మొదలు
వయసు మళ్ళిన ముసలి వగ్గుల వరకు
బ్రతుకు అంకాలను అంచెలాంచెలలో అమరించిన
జీవ దశావతరముల జగన్నాటకము
అదొక నిత్య క్రీడాస్థలి
వయసు నిమిత్తము లేని ఆటలకు ఆలవాలము
ఆకతాయీల కాకతాళీయ బొమ్మల అవశేషాల మొదలు
పౌరుషాలను ఎగదోయు పరాక్రమ విశేషాల వరకు
సకల సంపత్తిని ప్రావిణ్యముల వారీగ పేర్చిపెట్టిన
క్రీడా కదన ఆయుధ పూజా మందిరం
అదొక వేద పాఠశాల
జీవిత సూత్రాలు లిఖియించిన నల్ల బల్ల
శ్రమను ప్రతిఫలించు సాధనముల మొదలు
ఫలితము ప్రతిబింబించు సౌకర్యముల వరకు
తరతరాల తత్వమును సంపూర్ణముగ ఆకళింపు చేసుకున్న
కర్మ క్షేత్రపు మేధో మాగాణి
కరతలములో అనంతమును దాపెట్టు దుర్భిణి
అనల్పమును స్వల్పముతో ఎరుకపరుచు దార్శని
తరచి చూచిన కొత్త పార్స్వములను చూపెట్టు కలువ పూవు
తర్కించి చూచిన విషయమును విశదపరచు బొమ్మల కొలువు