5 April 2017
Hyderabad
ఎదురుచూపు
ఏళ్ళ తరబడి నిరీక్షణ ఫలియించిన తరుణమున
ఎట్ట ఎదుటే కైవల్యము కదిలొచ్చిన నిముషమున
దరి చేరుదామన్న కాళ్ళు కనికరించవాయె
తేట పరుచుకోను చూపు సహకరించదాయె
ఆబగా ఆలింగనమునకు చేతులు చాచి
అన్నదమ్ములిరువురను అక్కున చేర్చి
రామ తనమును నోట పట్టించుకోను
ఎంగిలి గంగను వారలోలాలాడించుకోను
మ్రింగ పూనె దాశరధులను మరణము కోరితెచ్చుకోను
ఒంటి కంటితో కుంటి జన్మతో బ్రతుకు భారము ఓపలేని కబంధుడు
పుట్టెరిగి కంట చూసింది లేదు
బుద్ధెరిగి కోన దాటింది లేదు
ద్రిమ్మరి చెప్పిన కమ్మని శబ్దమ్ము నమ్ముకుని
రామ జపమున తరగని తియ్యందనము తెలుసుకుని
ఎదుట పడిన నాడు అదే మాధుర్యమును అందీయబూని
పూటకొక ఫలమును కోసి తెచ్చి వేచె
మాగిన మామిడి నాడు వచ్చింది లేదు
తేనెలూరు చెరుకుకు చప్పుడు లేదు
పనస కోసిన నాడు ఎదురు పడ్డాడు కాదు
కోరి ఏరిన ద్రాక్షకు దిక్కే లేదు
ఋతువులు మారె ఫలములు మారె
కళ్ళు కాయలయ్యె కాయలు పండ్లయ్యె
ఈ జన్మకిక అగుపించడనుకున్న నాడు...
చీకటైపోయిన చూపులోకి వెలుగొక్కటి వచ్చె
నేల వాలిపోయిన దృష్టికి నీలి పాదాలు సోకె
మునుపెన్నడు వినని మృదువైన ధ్వని
ఆప్తుడెవరో పిలిచినట్టు పిలిచింది "శబరి" అని
ఏళ్ళ తరబడి నిరీక్షణ ఫలియించిన తరుణమున
ఎట్ట ఎదుటే కైవల్యము కదిలొచ్చిన నిముషమున
దరి చేరుదామన్న కాళ్ళు కనికరించవాయె
తేట పరుచుకోను చూపు సహకరించదాయె
ఆబగా ఆలింగనమునకు చేతులు చాచి
అన్నదమ్ములిరువురను అక్కున చేర్చి
రామ తనమును నోట పట్టించుకోను
ఎంగిలి గంగను వారలోలాలాడించుకోను
రామ శబ్దముతో తేనె మాగిన నోటితో
పుల్ల రేగును కొరికి పెదవికందించె శబరి