24 August 2017
Hyderabad
ఓం ప్రధమం
ఆరంభమునకు అధిపతిగా హేరంబుడెందుకు?
ఆటంకములను అరికట్ట కరివదనుడెందుకు?
కంటకములను పోకార్చ ఏకదంతుడెందుకు?
కామితములను ఈడేర్చ ఈశుసుతుడెందుకు?
కోరితే కరిగిపోయి కాన్కలందిచే
వేడితే వుప్పొంగి వరములందించే
మాటలకు పడిపోయె గాలిదేవులెందరున్నా
పనికి మాత్రము ఈ పొట్టివానిని
మడమ తిప్పని ఈ గట్టివానిని
కలిసి ఎన్నుకున్న కారణము ఎందుకన్న
తల తెంచబడిన వాడు కాని
తల వంచబడిన వాడు కాడు
తెలుసుకోను నిలిచిపోయిన వాడు కాని
తెలియలేదని వదిలిపోయిన వాడు కాడు
అవకరమును అధిగమించిన వాడు కాని
ఆకారమును నిందించుకున్న వాడు కాడు
పనికి ప్రాధమికమైన పట్టుదలను
వెతల ఎదురీతలో వీడిపోవనివాడు
గెలుపుకు ప్రధమమైన సంకల్పమును
సమస్యల సుడిగుండములలో సడలనీయనివాడు
కర్మ అంటే రాత కాదు చేత
క్రియ అంటే సిద్ధి కాదు బుద్ధి
కర్త అంటే చేతులు కాదు చేతలు
ఇవి నిరూపించినందుకే గణపతి
కార్య నిర్వహణకు అయ్యెను అధిపతి